లవ్లీ పంచ్‌ పడలేదు

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 05:19 IST

లవ్లీ పంచ్‌ పడలేదు

సెమీస్‌ దాటని భారత్‌ బాక్సర్‌

కంచు పతకం సొంతం

ఒలింపిక్స్‌లో మన పంచ్‌.. కాంస్యాన్ని దాటి ముందుకు వెళ్లలేకపోయింది. టోక్యోలోనైనా బాక్సింగ్‌లో పతక రంగు మారుతుందనుకున్న ఆశ నెరవేరలేదు. అద్భుత ప్రదర్శనతో సెమీస్‌ చేరి పతకం ఖాయం చేసిన 23 ఏళ్ల లవ్లీనా బోర్గోహైన్‌.. కంచును మించి మరో అడుగు వేయలేకపోయింది. ఫైనల్‌ చేరాలన్న ఆమె ఆశలకు.. ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ అడ్డుగా నిలిచింది. ఆమెకు దక్కింది కాంస్యమే కావొచ్చు.. కానీ తన తొలి ఒలింపిక్స్‌లోనే అందిన ఆ పతకం తన పంచ్‌ పవర్‌ను ప్రపంచానికి చాటింది.

టోక్యో

ప్రతిష్ఠాత్మక ఒలింపిక్స్‌లో పతకం సాధించాలనే కలను నిజం చేసుకున్న లవ్లీనా.. కాంస్యంతో దేశానికి తిరిగి రానుంది. మహిళల 69 కేజీల క్వార్టర్స్‌లో సంచలన ప్రదర్శనతో సెమీస్‌ చేరిన ఈ అస్సాం బాక్సర్‌.. పసిడి పోరుకు అర్హత సాధించలేకపోయింది. బుధవారం సెమీస్‌లో అడుగుపెట్టిన ఆమె 0-5 తేడాతో ప్రపంచ ఛాంపియన్‌ బుసెనాజ్‌ సర్మెనెలి (టర్కీ) చేతిలో ఓటమి పాలైంది. సెమీస్‌ వరకూ స్ఫూర్తిదాయక ప్రదర్శన కనబరిచిన లవ్లీనా.. కీలక పోరులో బుసెనాజ్‌ ధాటికి నిలబడలేకపోయింది. బుసెనాజ్‌ ఈ బౌట్‌లో పూర్తి ఆధిపత్యం చలాయించింది. కఠిన సవాలుకు సిద్ధమైన భారత బాక్సర్‌.. ఆరంభంలో ఆత్మవిశ్వాసంతో కనిపించింది. కౌంటర్‌ అటాకింగ్‌ చేసేందుకు ప్రయత్నించింది. కానీ ఒక్కసారిగా జోరందుకున్న ప్రత్యర్థి.. ఆమె శరీరాన్ని లక్ష్యంగా చేసుకుని పంచ్‌లు విసరడంతో పాటు ముఖంపై ముష్టిఘాతాలు కురిపించింది. తన వ్యూహం పనిచేయకపోవడంతో పూర్తిగా రక్షణాత్మక ధోరణి అవలంబించిన లవ్లీనా.. అటాకింగ్‌లో వెనకబడింది. ఆమెకు బుసానెజ్‌ ఆ అవకాశమే ఇవ్వలేదు. దూకుడు మంత్రంగా రింగ్‌లో కదులుతూ.. పంచ్‌లు విసురుతూనే ఉన్న ప్రత్యర్థిని ఆపడం లవ్లీనా వల్ల కాలేదు. ఆమె పోరాటం తొలి రౌండ్‌కు మాత్రమే పరిమితమైంది. మిగతా రెండు రౌండ్లలో ప్రత్యర్థి దెబ్బలను కాచుకునేందుకే సరిపోయింది. రిఫరీ సూచనలు పట్టించుకోనందుకు రెండో రౌండ్లో ఆమెకు ఓ పాయింటు కోత పడింది. చివరి రౌండ్లో అయితే పూర్తిగా చెలరేగిన బుసానెజ్‌ మెరుపు పంచ్‌లతో విరుచుకుపడింది. దీంతో పూర్తిగా అలిసిపోయిన లవ్లీనా.. తిరిగి పోటీపడేందుకు రిఫరీ రెండు సార్లు అంకెలు లెక్కబెట్టాల్సి వచ్చింది. ఓ సమయంలో లవ్లీనాకు సవాలు విసిరేందుకు ఆమె.. తన గార్డునూ పక్కనపెట్టింది. పంచ్‌లు ఇచ్చేందుకు అవకాశం.. ప్రత్యర్థిపై పైచేయి సాధించే సమయం.. కలిసి రాకపోవడంతో లవ్లీనాకు ఓటమి తప్పలేదు. అయితే ఆమె ఓడినా.. ఆనందమే. దేశానికి కాంస్య వెలుగులు పంచిందనే సంతోషమిది. టోక్యోలో బాక్సింగ్‌లో ఒక్క పతకమైనా దక్కిందనే సంబరమిది.


‘‘స్వర్ణం కోసం గట్టిగానే ప్రయత్నించా. కానీ సెమీస్‌లో ఓటమి నిరాశ కలిగించింది. ప్రత్యర్థి చాలా బలవంతురాలు కావడంతో నా వ్యూహాన్ని అమలు చేయలేకపోయా. బ్యాక్‌ఫుట్‌పై ఆడితే దెబ్బలు తినే ప్రమాదం ఉందని దాడి చేశా. కానీ ఫలితం దక్కలేదు. ఆమె ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొట్టాలనుకున్నా. కానీ అలా జరగలేదు. ఒలింపిక్స్‌లో పోటీపడి పతకం గెలవాలని ఎప్పుడూ అనుకునేదాన్ని. ఇప్పుడది నిజమైనందుకు సంతోషంగా ఉంది. ఈ పతకం కోసం ఎనిమిదేళ్లుగా కష్టపడ్డా. కుటుంబానికి దూరంగా ఉంటూ.. ఇష్టమైన ఆహారం తినకుండా గడిపా. ఏదైనా తేడా జరిగితే అది నా ఆటపై ప్రభావం చూపుతుందని తెలుసు. ఇప్పుడిక ఆట నుంచి కొద్దికాలం విరామం తీసుకుంటా. బాక్సింగ్‌ మొదలెట్టినప్పటి నుంచి సరదాగా బయటకు వెళ్లలేదు. కానీ ఇప్పుడు ఎక్కడికెళ్తానో ఇంకా నిర్ణయించుకోలేదు కానీ తప్పకుండా విహరిస్తా. మా గ్రామానికి కొత్త రోడ్డు వేస్తున్నందుకు సంతోషంగా ఉంది’’

- లవ్లీనా


3

ఒలింపిక్స్‌ చరిత్రలో దేశానికి పతకం అందించిన మూడో బాక్సర్‌గా లవ్లీనా నిలిచింది. అంతకుముందు 2008 బీజింగ్‌లో విజేందర్‌ సింగ్‌, 2012 లండన్‌లో మేరీకోమ్‌ కూడా కాంస్యాలే గెలిచారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన