పట్టేయ్‌ పసిడి

ప్రధానాంశాలు

Updated : 05/08/2021 03:34 IST

పట్టేయ్‌ పసిడి

 రవి దహియా ఉడుంపట్టు

57కేజీ ఫైనల్లో ప్రవేశం

రజతం ఖాయం.. స్వర్ణంపై గురి
 నేడే తుది పోరు

మధ్యాహ్నం 2.45 నుంచి

చిబా

వారెవ్వా..ఏం పట్టు! వీరుడంటే అతడే.. వీరత్వం అంటే అదే!

శక్తిమంతుడైన ప్రత్యర్థి తిరుగులేని ఆధిక్యంతో విజయం దిశగా దూసుకెళ్తుంటే.. భారీ అంతరం (స్కోరు) గుండె నిబ్బరానికి సవాలు విసురుతుంటే.. ఒత్తిడంతా ఓడించడానికి దాడి చేస్తుంటే.. పరిస్థితులన్నీ ప్రతికూలంగా మారి.. ఒలింపిక్‌ పసిడి కలను దెబ్బతీస్తుంటే..   కోట్లాది భారతీయులు ఆశానిరాశల మధ్య కొట్టుమిట్టాడుతుంటే...  23 ఏళ్ల యువ రెజ్లర్‌ రవి కుమార్‌ దహియా అద్భుతమే చేశాడు.

ఒత్తిడిని చిత్తు చేస్తూ... అసాధ్యమనుకున్న దాన్ని సుసాధ్యం చేస్తూ... సెమీస్‌లో పెను సంచలనం సృష్టించాడు. ధీమాగా ఉన్న ప్రత్యర్థిని ఉడుం పట్టుతో తిప్పిపడేస్తూ ఫైనల్‌కు దూసుకెళ్లాడు.  మామూలు పట్టా అది.

కసినీ, పట్టుదలను కళ్లలో నింపుకున్న అతడికి.. అర్జునుడికి పక్షి కళ్లలా సనయేవ్‌ కాళ్లే కనిపించాయి. అంతే.. సమయం తరుముతుంటే, కొండంత శక్తిని కూడదీసుకుంటూ మెరుపు వేగంతో ఆ కాళ్లను దొరకబుచ్చుకుని అతణ్ని వెల్లకిలా పడేశాడు. అతడు గింజుకుంటూ తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా వదలక.. మ్యాట్‌కు నొక్కిపెట్టేశాడు. అంతే ఖేల్‌ ఖతం!

భారత్‌కు కనీసం రజతం ఖాయం.. లక్ష్యం స్వర్ణమే.

పతకమేదైనా అభిమానులకు పండగే.

అసమాన పోరాట తత్వాన్ని ప్రదర్శించిన రవి దహియా 57 కిలోల విభాగంలో ఫైనల్‌కు దూసుకెళ్లాడు. క్లిష్టపరిస్థితుల్లో అద్భుతంగా పుంజుకున్న దహియా.. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో ప్రత్యర్థి నురిస్లామ్‌ సనయేవ్‌ (కజకిస్థాన్‌)ను పిన్‌ డౌన్‌ (ఫాల్‌) చేసి విజేతగా నిలిచాడు. ప్రత్యర్థి రెండు భుజాలను మ్యాట్‌కు నొక్కి పెడితే ఫాల్‌ ద్వారా విజయం సాధించినట్లు ప్రకటిస్తారు. హరియాణాకు చెందిన దహియా ఈ విజయంతో.. సుశీల్‌ కుమార్‌ (2012) తర్వాత రెజ్లింగ్‌ స్వర్ణ పతక బౌట్‌కు అర్హత సంపాదించిన రెండో భారతీయుడిగా ఘనత సాధించాడు. అతడు ఫైనల్‌ చేరే క్రమంలో తొలి రౌండ్లో 13-2తో టిగ్రెరోస్‌ అర్బానో (కొలంబియా)ను, క్వార్టర్స్‌లో 14-4తో వాలెంటినోవ్‌ వంగెలోవ్‌ (బల్గేరియా)ను చిత్తు చేశాడు. దహియా స్వర్ణం కోసం రష్యాకు చెందిన యుగేవ్‌ జావుర్‌ను ఢీకొంటాడు.

2-9..అయినా!: ఈ పోరులో రవి దహియా గెలవడం నిజంగా అద్భుతమే. నిజానికి సెమీస్‌ ఆరంభంలో సనయేవ్‌పై అతడు ఆధిక్యాన్ని ప్రదర్శించాడు. తొలి రౌండ్‌ (మూడు నిమిషాలు, మొత్తం రెండు రౌండ్లు) ముగిసే సరికి 2-1తో నిలిచాడు. పుంజుకున్న సనయేవ్‌.. దహియా రెండు కాళ్లను బలంగా చేజిక్కించుకుని, నాలుగుసార్లు తిప్పేసి తక్కువ సమయంలో ఎనిమిది పాయింట్లు ఖాతాలో వేసుకున్నాడు. హఠాత్తుగా ఆధిక్యం కోల్పోయిన దహియా 2-9తో ఓటమి అంచుల్లో నిలిచాడు. ఆ దశలో దహియాకు ఓటమి తప్పదేమో అనిపించింది. మరో 75 సెకన్లలో బౌట్‌ ముగిసే సమయానికి దహియా స్కోరు 3... సమయేవ్‌ 9. కానీ టెక్నికల్‌గా బలవంతుడైన దహియా పట్టుదలగా పోరాడాడు. దూకుడుగా ఆడిన అతడు.. ప్రత్యర్థిని మ్యాట్‌ బయటికి నెట్టడం ద్వారా ఆధిక్యాన్ని 5-9కి తగ్గించగలిగాడు. అయినా మరో నిమిషం మాత్రమే ఉండడంతో దహియా పరిస్థితి క్లిష్టంగానే ఉంది. కానీ అన్ని శక్తులనూ కూడదీసుకున్న అతడు.. డబుల్‌ లెగ్‌ ఎటాక్‌తో సనయేవ్‌ను బంధించేశాడు. కాళ్లను గట్టిగా పట్టుకుని అతణ్ని వెల్లకిలా పడేశాడు. తన బలాన్నంతా ప్రయోగిస్తూ అతణ్ని మ్యాట్‌కు అణచిపెట్టి విజేతగా నిలిచాడు.

పాపం పునియా..: దీపక్‌ పునియాకు మాత్రం కలిసి రాలేదు. చక్కని ప్రదర్శన సెమీఫైనల్‌ చేరిన అతడు.. అక్కడ  డేవిడ్‌ మోరిస్‌ టేలర్‌ (అమెరికా) చేతిలో భంగపడ్డాడు. తిరుగులేని ఆధిపత్యం ప్రదర్శించిన టేలర్‌ టెక్నికల్‌ సుపీరియారిటీ ఆధారంగా విజయం సాధించాడు. బౌట్లో ఏ దశలోనైనా   ఒక ఆటగాడు పది పాయింట్ల ఆధిక్యం సంపాదిస్తే అతడు టెక్నికల్‌ సుపీరియారిటీ ద్వారా గెలిచినట్లు  ప్రకటిస్తారు. వరుస దాడులు చేసిన టేలర్‌.. దీపక్‌కు ఎలాంటి అవకాశమూ ఇవ్వలేదు. దీపక్‌ ఇక రెపిచేజ్‌ రౌండ్‌ ఆడతాడు.22 ఏళ్ల దీపక్‌ క్వార్టర్స్‌లో 6-3తో జుషెన్‌ (చైనా)ను ఓడించాడు.

అన్షుకు రెపిచేజ్‌ అవకాశం: మహిళల 57 కిలోల విభాగంలో తొలి రౌండ్లోనే ఓడిన   అన్షు మలిక్‌కు కూడా కాంస్యం కోసం ప్రయత్నించేందుకు అవకాశం దక్కింది. ఆమెపై    గెలిచిన బెలారస్‌ రెజ్లర్‌ కురచికిన ఫైనల్‌కు చేరడంతో అన్షుకు రెపిచేజ్‌కు అర్హత       సాధించింది. ఆమె రెపిచేజ్‌లో గెలిస్తే కాంస్యం కోసం ఆడుతుంది.


కండ కొరికేశాడు

వి దహియా-సనయేవ్‌ (కజకిస్థాన్‌) మధ్య క్వార్టర్‌ఫైనల్‌ మధ్య అనూహ్య సంఘటన జరిగింది. ఆఖరి సెకన్లలో సనయేవ్‌ కాలు పట్టు చిక్కించుకున్న దహియా అతడిని పడేసే ప్రయత్నంలో ఉండగా.. సనయేవ్‌ మాత్రం ఎలాగైనా తప్పించుకోవాలని చూశాడు. అందుకోసం అతడు రవి చేతి కండను గట్టిగా కొరికేశాడు. ఇది చాలా బాధ కలిగించినా రవి మాత్రం వదల్లేదు. అతడి వీపుని నేలకు ఆనించిన తర్వాతే పట్టు వీడాడు. అయితే రవిని సనయేవ్‌ కొరికిన దృశ్యాలు కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి. ఈ దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో విస్తృతం అవుతున్నాయి. సనయేవ్‌ అన్యాయంగా ప్రవర్తించాడని అభిమానులు విమర్శిస్తున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన