క్రికెట్‌ నుంచి పూర్తిగా..

ప్రధానాంశాలు

Published : 15/09/2021 02:05 IST

క్రికెట్‌ నుంచి పూర్తిగా..

ఆటకు మలింగ టాటా

విలక్షణ క్రికెటర్‌ లసిత్‌ మలింగ ఆటను మనిమిక చూడలేం. పదునైన పేస్‌తో ప్రపంచ క్రికెట్లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ శ్రీలంక స్పీడ్‌స్టర్‌ అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు.

కోలంబో

పదునైన యార్కర్లతో ప్రపంచంలో అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ను దశాబ్దానికిపైగా వణికించిన శ్రీలంక పేసర్‌ లసిత్‌ మలింగ ఆటగాడిగా క్రికెట్‌ కెరీర్‌కు ముగింపు పలికాడు. ఇప్పటికే టెస్టు, వన్డే క్రికెట్‌ నుంచి రిటైరైన ఈ 38 ఏళ్ల పేసర్‌ టీ20లతో పాటు అన్ని రకాల క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించాడు. ‘‘ఇక టీ20 క్రికెట్‌కు కూడా దూరమవుతున్నా. అన్ని ఫార్మాట్ల నుంచి రిటైరవుతున్నా. ఇన్నేళ్ల ప్రయాణంలో నాకు సహకరించిన వారందరికీ కృతజ్ఞతలు. వచ్చే రోజుల్లో నా అనుభవాలను యువ క్రికెటర్లతో పంచుకుంటా. ఆటకు వీడ్కోలు పలుకుతున్నా. ఆటపై ప్రేమ మాత్రం ఎప్పటికీ తగ్గదు’’ అని మలింగ ట్వీట్‌ చేశాడు. గొప్ప టీ20 బౌలర్లలో ఒకడిగా పేరున్న మలింగ.. 2014 టీ20 ప్రపంచకప్‌ గెలిచిన శ్రీలంక జట్టుకు నాయకత్వం వహించాడు. మలింగ 2011లోనే టెస్టు క్రికెట్‌ నుంచి రిటైరయ్యాడు. ఆ తర్వాత వన్డేలకు కూడా గుడ్‌బై చెప్పినా.. టీ20ల్లో మాత్రం కొనసాగాడు. ఇప్పుడు పొట్టి క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. అతడు చివరిసారి 2020 మార్చిలో లంక తరఫున తన చివరి టీ20 మ్యాచ్‌ ఆడాడు. వచ్చే టీ20 ప్రపంచకప్‌లో పోటీపడే లంక జట్టులో అతడికి చోటు దక్కలేదు.

విచిత్రమైన బౌలింగ్‌ శైలితో బ్యాట్స్‌మెన్‌ను తికమక పెట్టి వికెట్లు తీయడం ద్వారా మలింగ వెలుగులోకి వచ్చాడు. మొదట్లో అతడి బౌలింగ్‌కు అలవాటు పడటమే బ్యాట్స్‌మెన్‌కు సవాలుగా మారింది. ఇక అతడి యార్కర్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. మలింగ మూడు ఫార్మాట్లలో కలిపి 546 వికెట్లు పడగొట్టాడు. అతడు 84 టీ20ల్లో 107, 226 వన్డేల్లో 338, 30 టెస్టుల్లో 101 వికెట్లు పడగొట్టాడు. టీ20ల్లో 100 వికెట్లు సాధించిన తొలి బౌలర్‌ మలింగనే. ఐపీఎల్‌లో 122 మ్యాచ్‌ల్లో 170 వికెట్లు తీశాడు. 5/13.. అతడి అత్యుత్తమ ప్రదర్శన. ఫ్రాంఛైజీ క్రికెట్లో ఆడనని అతడు జనవరిలో ప్రకటించాడు. మలింగ 12 ఏళ్లు ముంబయి ఇండియన్స్‌కు ప్రాతినిధ్యం వహించాడు.  తన కెరీర్లో పదునైన యార్కర్లతో బ్యాట్స్‌మెన్‌ను హడలెత్తించిన మలింగ.. అంతర్జాతీయ క్రికెట్లో అయిదుసార్లు హ్యాట్రిక్‌ నమోదు చేయడం విశేషం. రెండు సార్లు టీ20ల్లో, మూడుసార్లు వన్డేల్లో ఈ ఘనత సాధించాడు. అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌ మలింగనే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన