ధనాధన్‌.. కొత్త కెప్టెన్‌

ప్రధానాంశాలు

Updated : 17/09/2021 09:50 IST

ధనాధన్‌.. కొత్త కెప్టెన్‌

టీ20 సారథ్యానికి విరాట్‌ కోహ్లి టాటా
ప్రపంచకప్పే చివరి టోర్నీ
దుబాయ్‌

ధనాధన్‌ క్రికెట్లో భారత్‌కు కొత్త కెప్టెన్‌ను చూడబోతున్నాం. అందరినీ ఆశ్చర్యపరుస్తూ.. పొట్టి ప్రపంచకప్‌ అనంతరం టీ20 సారథిగా వైదొలుగుతానని విరాట్‌ కోహ్లి ప్రకటించాడు. పని భారం పెరిగిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపాడు. మరి ఐపీఎల్‌లో కెప్టెన్‌గా గొప్ప రికార్డున్న రోహిత్‌ శర్మకే టీ20 పగ్గాలు దక్కుతాయా.. లేక ‘యువ కెప్టెన్‌’ వైపు బీసీసీఐ చూస్తుందా అన్నది ఆసక్తికరం.

యూఏఈలో జరిగే టీ20 ప్రపంచకప్‌ అనంతరం పొట్టి ఫార్మాట్‌ సారథ్య బాధ్యతలను వీడతానని టీమ్‌ఇండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి గురువారం ప్రకటించాడు. వన్డేలు, టెస్టుల్లో మాత్రం జట్టును నడిపిస్తానని చెప్పాడు. పరిమిత ఓవర్ల క్రికెట్లో కెప్టెన్‌గా కోహ్లి భవిష్యత్తు గురించి కొంతకాలంగా ఊహాగానాలు సాగుతున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా నిరుడు రోహిత్‌ శర్మ కెప్టెన్‌గా అయిదోసారి ముంబయి ఇండియన్స్‌కు ఐపీఎల్‌ టైటిల్‌ అందించిన తర్వాత కోహ్లి పరిమిత ఓవర్ల నాయకత్వంపై చర్చ ఎక్కువైంది. ఈ నేపథ్యంలో తాజాగా కోహ్లి తీసుకున్న నిర్ణయం.. కెప్టెన్‌ కావాలన్న రోహిత్‌ ఆశ నెరవేరడానికి మార్గం సుగమం చేసినట్లు భావిస్తున్నారు. కానీ బీసీసీఐ రోహిత్‌కే పగ్గాలు అప్పగిస్తుందా అని కచ్చితంగా చెప్పలేం. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాలను సంప్రదించి నిర్ణయం తీసుకున్నట్లు తన ట్విట్టర్‌ పేజీలో ఉంచిన ప్రకటనలో 32 ఏళ్ల కోహ్లి పేర్కొన్నాడు. కోహ్లి నిర్ణయంపై జై షా కూడా స్పందించాడు. ‘‘టీమ్‌ఇండియా భవిష్యత్తు కోసం మా వద్ద స్పష్టమైన ప్రణాళిక  ఉంది. పని భారాన్ని దృష్టిలో ఉంచుకుని కోహ్లి ఈ నిర్ణయం తీసుకున్నాడు. మార్పు సాఫీగా జరగడం కోసం టీ20 ప్రపంచకప్‌ అనంతరం అతడు టీ20 కెప్టెన్సీ నుంచి తప్పుకోనున్నాడు. విరాట్‌, నాయకత్వ బృందంతో గత ఆరు నెలలుగా చర్చలు జరుపుతున్నా. లోతుగా ఆలోచించాకే ఈ నిర్ణయం జరిగింది’’ అని షా ఓ ప్రకటనలో తెలిపాడు. టీ20 ప్రపంచకప్‌ అక్టోబరు 17న ఆరంభం కానుంది.


టీ20 నాయకుడిగా కోహ్లి ఇలా..

కోహ్లి 2017లో ధోని నుంచి టీ20 పగ్గాలు అందుకున్నాడు. 45 మ్యాచ్‌ల్లో జట్టును నడిపించాడు. 27 గెలిచి, 14 ఓడిపోయాడు. రెండు మ్యాచ్‌లు టైగా ముగియగా.. మరో రెండు రద్దయ్యాయి. కెప్టెన్‌గా కోహ్లి టీ20 గెలుపు శాతం 65.11. కోహ్లి సారథ్యంలో భారత   జట్టు విదేశాల్లో టీ20ల్లో మెరుగైన ప్రదర్శన చేసింది. 2018లో  దక్షిణాఫ్రికాలో 2-1తో పొట్టి సిరీస్‌ గెలిచిన టీమ్‌ఇండియా.. అదే ఏడాదిని ఇంగ్లాండ్‌ను ఇంగ్లాండ్‌లో 2-1తో ఓడించింది. 2019-20 సీజన్‌లో న్యూజిలాండ్‌ను దాని సొంతగడ్డపై    5-0తో చిత్తు చేసింది. 2020లో ఆస్ట్రేలియాలో వన్డే సిరీస్‌ కోల్పోయాక కోహ్లి బృందం.. టీ20ల్లో 2-1తో పైచేయి సాధించింది. ఇటీవల సొంతగడ్డపై భారత్‌ 3-2తో ఇంగ్లాండ్‌ను మట్టికరిపించింది. కోహ్లి ఇప్పటివరకు 90 టీ20ల్లో 52.65  సగటుతో 3159 పరుగులు చేశాడు. అందులో 28 అర్ధ శతకాలున్నాయి. అత్యధిక స్కోరు.. 94 నాటౌట్‌. విరాట్‌ సారథ్యంలో భారత్‌ ఇప్పటిదాకా టీ20 ప్రపంచకప్‌ ఆడలేదు. వచ్చే నెలలో జరగబోయేదే మొదటిది, చివరిది.


భారత్‌కు కేవలం ప్రాతినిధ్యం వహించడమే కాకుండా నాయకత్వం కూడా వహించడం నా అదృష్టం. సహచర ఆటగాళ్లు, సహాయ సిబ్బంది, సెలక్షన్‌ కమిటీ, నా కోచ్‌లు, మా విజయం కోసం ప్రార్థించిన ప్రతి భారతీయుడు.. వీళ్లంతా లేకుండా నేనిదంతా చేయగలిగేవాణ్ని కాదు. అయితే పనిభారాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం. మూడు ఫార్మాట్లలో 8-9 ఏళ్లుగా ఆడుతున్నా. 5-6 ఏళ్లుగా జట్టుకు సారథ్యం వహిస్తున్నా. దీని వల్ల నాపై చాలా పని భారం పెరిగింది. ఈ నేపథ్యంలో టెస్టులు, వన్డేల్లో జట్టును నడిపించడానికి పూర్తి    సంసిద్ధంగా ఉండడం కోసం నాకు కాస్త ఖాళీ అవసరమనిపించింది. టీ20 సారథిగా జట్టు కోసం నూరుశాతం కష్టపడ్డా. బ్యాట్స్‌మన్‌గా ముందు ముందు కూడా టీ20ల్లో జట్టు కోసం చేయగలిగినంత చేస్తా. చాలా ఆలోచించే ఈ నిర్ణయం తీసుకున్నా. నా సన్నిహితులు, రవిభాయ్‌, నాయకత్వం బృందంలో అంతర్భాగమైన రోహిత్‌తో లోతుగా చర్చించాక.. టీ20 ప్రపంచకప్‌ అనంతరం టీ20 కెప్టెన్సీ నుంచి వైదొలగాలని నిర్ణయించుకున్నా. బీసీసీఐ కార్యదర్శి జై షా, అధ్యక్షుడు గంగూలీ, సెలక్టర్లతో నా నిర్ణయం గురించి మాట్లాడా. 

- విరాట్‌ కోహ్లిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన