IPL 2021: నరైన్‌ మెరిసెన్‌

ప్రధానాంశాలు

Updated : 29/09/2021 07:10 IST

IPL 2021: నరైన్‌ మెరిసెన్‌

దిల్లీపై కోల్‌కతా విజయం

షార్జా

పీఎల్‌-14 రెండో అంచెలో కోల్‌కతా మెరుగైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. యూఏఈలో నాలుగు మ్యాచ్‌ల్లో మూడో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. తక్కువ స్కోర్లే నమోదైనా  ఆసక్తికరంగా సాగిన మ్యాచ్‌లో దిల్లీని 3 వికెట్ల తేడాతో ఓడించిన కోల్‌కతా.. మొత్తంగా అయిదో విజయంతో ప్లేఆఫ్స్‌ ఆశలను సజీవంగా ఉంచుకుంది. నరైన్‌ ఆల్‌రౌండ్‌ ప్రదర్శనతో నైట్‌రైడర్స్‌ గెలుపులో కీలక పాత్ర పోషించాడు. 128 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని కోల్‌కతా 18.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. క్లిష్ట ఛేదనలో నితీష్‌ రాణా (36 నాటౌట్‌; 27 బంతుల్లో 2×4, 2×6), శుభ్‌మన్‌ గిల్‌ (30; 33 బంతుల్లో 1×4, 2×6), సునీల్‌ నరైన్‌ (21; 10 బంతుల్లో 1×4, 2×6) రాణించారు. మొదట దిల్లీ 9 వికెట్లకు 127 పరుగులే చేయగలిగింది. స్మిత్‌ (39; 34 బంతుల్లో 4×4), పంత్‌ (39; 36 బంతుల్లో 3×4) రాణించారు. నరైన్‌ (2/18), ఫెర్గూసన్‌ (2/10), వెంకటేశ్‌ అయ్యర్‌ (2/29) దిల్లీని కట్టడి చేశారు.

నిలిచిన రాణా..: స్వల్ప లక్ష్యమే అయినా.. బ్యాటింగ్‌కు కష్టంగా ఉన్న పిచ్‌పై ఛేదనలో కోల్‌కతాకు కష్టపడక తప్పలేదు. ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్‌ (30; 33 బంతుల్లో 1×4, 2×6) రాణించినా.. కోల్‌కతా 15 ఓవర్లు ముగిసే సరికి 98/5తో నిలిచింది. మరో వైపు వికెట్లు పడుతున్నా నితీష్‌ రాణా చక్కని బ్యాటింగ్‌తో జట్టును నడిపించాడు. అయితే చివరి అయిదు ఓవర్లలో చేయాల్సింది 30 పరుగులే అయినా.. అప్పటికే అయిదు వికెట్లు పోవడంతో కోల్‌కతా పని అంత తేలిగ్గా ఏమీ అనిపించలేదు. కానీ రబాడ వేసిన ఇన్నింగ్స్‌ 16వ ఓవర్లో నరైన్‌ వరుసగా 6, 4, 6 బాదడంతో ఆ జట్టు ఊపిరిపీల్చుకుంది. గెలుపు ముంగిట నరైన్‌, సౌథీ ఔట్‌ కావడంతో కొన్ని పరుగులు చేయడానికి కోల్‌కతా కష్టపడక తప్పలేదు.

దిల్లీకి కళ్లెం: దిల్లీ పరుగుల  కోసం చెమటోడ్చింది. నరైన్‌, వెంకటేశ్‌ అయ్యర్‌, వరుణ్‌ బ్యాట్స్‌మెన్‌కు ఏమాత్రం బ్యాట్‌ ఝుళిపించే అవకాశం ఇవ్వలేదు. ధావన్‌ (24)ను ఫెర్గూసన్‌ వెనక్కి పంపాడు. శ్రేయస్‌ (1)ను నరైన్‌ ఎక్కువసేపు నిలనివ్వలేదు. 13వ ఓవర్లో ఫెర్గూసన్‌ బౌలింగ్‌లో స్మిత్‌ నిష్క్రమించేటప్పటికి స్కోరు 77 మాత్రమే. ఆ తర్వాత దిల్లీ పతనం వేగంగా సాగింది. ఓ వైపు పంత్‌ నిలిచినా.. వచ్చిన బ్యాట్స్‌మెన్‌ వచ్చినట్లే పెవిలియన్‌ చేరారు. దిల్లీ చివరి ఏడు ఓవర్లలో 46 పరుగులే చేసి ఆరు వికెట్లు చేజార్చుకుంది.

దిల్లీ ఇన్నింగ్స్‌: స్టీవ్‌ స్మిత్‌ (బి) ఫెర్గూసన్‌ 39; ధావన్‌ (సి) వెంకటేశ్‌ (బి) ఫెర్గూసన్‌ 24; శ్రేయస్‌ (బి) నరైన్‌ 1; పంత్‌ రనౌట్‌ 39; హెట్‌మయర్‌ (సి) సౌథీ (బి) వెంకటేశ్‌ 4; లలిత్‌ ఎల్బీ (బి) నరైన్‌ 0; అక్షర్‌ (సి) ఫెర్గూసన్‌ (బి) వెంకటేశ్‌ 0; అశ్విన్‌ (సి) రాణా (బి) సౌథీ 9; రబాడ నాటౌట్‌ 0; అవేష్‌ఖాన్‌ రనౌట్‌ 5; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 127; వికెట్ల పతనం: 1-35, 2-40, 3-77, 4-88, 5-89, 6-92, 7-120, 8-122, 9-127; బౌలింగ్‌: సందీప్‌ వారియర్‌ 2-0-15-0; సౌథీ 4-0-29-1; ఫెర్గూసన్‌ 2-0-10-2; వరుణ్‌ చక్రవర్తి 4-0-24-0; నరైన్‌ 4-0-18-2; వెంకటేశ్‌ అయ్యర్‌ 4-0-29-2

కోల్‌కతా ఇన్నింగ్స్‌: శుభ్‌మన్‌ (సి) శ్రేయస్‌ (బి) రబాడ 30; వెంకటేశ్‌ (బి) లలిత్‌ 14; రాహుల్‌ త్రిపాఠి (సి) స్మిత్‌ (బి) అవేష్‌ఖాన్‌ 9; నితీష్‌ రాణా నాటౌట్‌ 36; మోర్గాన్‌ (సి) లలిత్‌ (బి) అశ్విన్‌ 0; దినేశ్‌ కార్తీక్‌ (బి) అవేష్‌ఖాన్‌ 12; నరైన్‌ (సి) అక్షర్‌ (బి) నార్జ్‌ 21; టిమ్‌ సౌథీ (బి) అవేష్‌ఖాన్‌ 3; ఫెర్గూసన్‌ నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 5 మొత్తం: (18.2 ఓవర్లలో 7 వికెట్లకు) 130; వికెట్ల పతనం: 1-28, 2-43, 3-67, 4-67, 5-96, 6-122, 7-126; బౌలింగ్‌: నార్జ్‌  2.2-0-15-1; అక్షర్‌ 3-0-13-0; అశ్విన్‌   4-0-24-1; లలిత్‌  3-0-35-1; అవేష్‌ ఖాన్‌ 3-0-13-3; రబాడ 3-1-28-1



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన