పీలేను దాటిన ఛెత్రి

ప్రధానాంశాలు

Published : 15/10/2021 02:18 IST

పీలేను దాటిన ఛెత్రి

దిల్లీ: భారత ఫుట్‌బాల్‌ జట్టు కెప్టెన్‌ సునీల్‌ ఛెత్రి మరో ఘనత అందుకున్నాడు. అంతర్జాతీయ ఫుట్‌బాల్‌లో అత్యధిక గోల్స్‌ సాధించిన వారిలో ఆరో స్థానానికి చేరుకున్నాడు. ఈ క్రమంలో ఫుట్‌బాల్‌ దిగ్గజం పీలే (బ్రెజిల్‌)ను అధిగమించడం విశేషం. బుధవారం శాఫ్‌ ఛాంపియన్‌షిప్‌లో మాల్దీవులతో మ్యాచ్‌లో అతడు ఈ ఘనత అందుకున్నాడు. 124 మ్యాచ్‌ల్లో భారత్‌కు ప్రాతినిధ్యం వహించిన ఛెత్రి 79 గోల్స్‌తో గాడ్‌ఫ్రే (జాంబియా)తో కలిసి సంయుక్తంగా ఆరో స్థానంలో నిలిచాడు. క్రిస్టియానో రొనాల్డో (115 గోల్స్‌- పోర్చుగల్‌), అలీ దాయ్‌ (109- ఇరాన్‌), మొఖ్తార్‌ దహరి (89- మలేసియా), ఫెరెంక్‌ పుస్కాస్‌ (84- హంగేరీ), లియోనెల్‌ మెస్సి (80- అర్జెంటీనా) వరుసగా తొలి అయిదు స్థానాల్లో కొనసాగుతున్నారు. 37 ఏళ్ల ఛెత్రి మరో గోల్‌ సాధిస్తే మెస్సి సరసన నిలుస్తాడు. మాల్దీవులతో మ్యాచ్‌కు ముందు ఛెత్రి 77 గోల్స్‌తో పీలేతో సమంగా ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో భారత్‌ 3-1తో మాల్దీవులపై విజయం సాధించింది. 33వ నిమిషంలో మాన్విర్‌సింగ్‌ గోల్‌ చేయగా.. 62, 71 నిమిషాల్లో ఛెత్రి రెండు గోల్స్‌ రాబట్టాడు. శనివారం జరిగే ఫైనల్లో నేపాల్‌తో భారత్‌ తలపడుతుంది.

ఎస్‌సీ11 ఎక్కడికీ వెళ్లదు: ‘‘నా కెరీర్‌ త్వరలోనే ముగుస్తుందన్నది నిజం. అంతమాత్రాన బాధపడాల్సిన అవసరం లేదు. అప్పటి వరకు ప్రతి క్షణాన్ని ఆస్వాదిస్తా. కెరీర్‌లో కొన్ని మ్యాచ్‌లే మిగిలి ఉన్నాయి. ప్రతి మ్యాచ్‌లో అత్యుత్తమ ఆటతీరు కనబరుస్తా. అయితే ఎస్‌సీ 11 జెర్సీ కొన్నేళ్ల వరకు ఎక్కడికీ వెళ్లదు. ప్రశాంతంగా ఉండండి’’ 

   - సునీల్‌ ఛెత్రిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన