నమీబియాతో శ్రీలంక ఢీ

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

నమీబియాతో శ్రీలంక ఢీ

అబుదాబి: దిగ్గజాల నిష్క్రమణ తర్వాత తిరిగి కోలుకోలేకపోతున్న శ్రీలంక.. టీ20 ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌కు సిద్ధమైంది. సోమవారం క్వాలిఫయర్స్‌లో నమీబియాతో తలపడనుంది. 2014లో పొట్టి ప్రపంచకప్‌ను గెలుచుకున్న లంక.. ఇప్పుడు సూపర్‌ 12 దశకు అర్హత సాధించడానికి చిన్న జట్లతో క్వాలిఫయర్స్‌ ఆడుతుందంటే ఆ జట్టు ప్రమాణాలు ఏ స్థాయిలో పడిపోయాయో అర్థం చేసుకోవచ్చు. సంగక్కర, జయవర్ధనె, దిల్షాన్‌, మలింగ ఇలా అగ్రశ్రేణి ఆటగాళ్లు వరుసగా వీడ్కోలు పలకడంతో సంధి దశలో పడ్డ ఆ జట్టు.. మళ్లీ పుంజుకోలేకపోతోంది. అందుకే ర్యాంకింగ్స్‌లో దిగజారి క్వాలిఫయర్స్‌ ఆడాల్సి వచ్చింది. అదీ కాకుండా ఇటీవల ఇంగ్లాండ్‌లో బయో బబుల్‌ నిబంధనలు ఉల్లంఘించారని నిరోషన్‌ డిక్వెలా, కుశాల్‌ మెండిస్‌, గుణతిలకపై ఏడాది పాటు నిషేధం విధించడంతో ఆ జట్టుకు గట్టి దెబ్బ తగిలింది. ఈ నేపథ్యంలో చరిత్‌, అవిష్క ఫెర్నాండో, కమిందు మెండిస్‌, చమిక కరుణరత్నె ఆ జట్టులో కీలకం కానున్నారు. దినేశ్‌ చండిమల్‌, కుశాల్‌ పెరీరా రాక ఆ జట్టును పటిష్ఠపరుస్తోంది. మణికట్టు స్పిన్నర్‌ హసరంగపై ఆ జట్టు భారీ ఆశలు పెట్టుకుంది. మరోవైపు 18 ఏళ్ల తర్వాత ఓ ప్రపంచకప్‌లో ఆడుతున్న నమీబియా సత్తాచాటాలనే పట్టుదలతో ఉంది. 2003లో వన్డే ప్రపంచకప్‌ ఆడిన ఆ జట్టు.. ఇప్పుడు ఈ పొట్టి కప్పులో క్వాలిఫయర్స్‌ ఆడుతుంది. కెప్టెన్‌ ఎరాస్మస్‌, క్రెయిగ్‌, స్టీఫెన్‌, స్మిత్‌పై జట్టు ఆధారపడింది. మాజీ దక్షిణాఫ్రికా ఆటగాడు డేవిడ్‌ వీస్‌ ఇప్పుడు నమీబియాతో చేరడం ఆ జట్టు బలాన్ని పెంచేదే. మరో మ్యాచ్‌లో నెదర్లాండ్స్‌ను ఐర్లాండ్‌ ఢీ కొడుతుంది. గతంలో ప్రపంచకప్‌ల్లో పాకిస్థాన్‌, ఇంగ్లాండ్‌ లాంటి పెద్ద జట్లకు షాకిచ్చిన ఐర్లాండ్‌.. ఈ మ్యాచ్‌లో ఫేవరేట్‌గా కనిపిస్తోంది. అనుభవజ్ఞుడైన కెవిన్‌ ఓబ్రైన్‌ ఆ జట్టుకు కీలకం కానున్నాడు.


టీ20 ప్రపంచకప్‌లో ఈనాడు
ఐర్లాండ్‌ × నెదర్లాండ్స్‌ (మధ్యాహ్నం 3.30 నుంచి)
శ్రీలంక × నమీబియా (రాత్రి 7.30 నుంచి)Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన