పాక్‌లో 2023 ఆసియా కప్‌!

ప్రధానాంశాలు

Published : 18/10/2021 01:25 IST

పాక్‌లో 2023 ఆసియా కప్‌!

కరాచి: 2023 ఆసియా కప్‌ క్రికెట్‌ టోర్నీని తమ దేశంలో నిర్వహించనున్నట్లు పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డు (పీసీబీ) ఛైర్మన్‌ రమీజ్‌ రజా చెప్పాడు. ఇటీవల బీసీసీఐ కార్యదర్శి జై షా అధ్యక్షతన జరిగిన ఆసియా క్రికెట్‌ మండలి (ఏసీసీ) సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. వన్డే ఫార్మాట్‌లో ఈ టోర్నీ జరగనుంది. నిజానికి గతేడాది పాక్‌లో ఆసియా కప్‌ జరగాల్సింది. కానీ భద్రతా కారణాల రీత్యా టోర్నీని యూఏఈకి తరలించాలని బీసీసీఐ కోరింది. మధ్యలో కరోనా మహమ్మారి కారణంగా మొదట 2021కి ఆ తర్వాత 2022కి ఈ టోర్నీ వాయిదా పడింది. మొత్తానికి వచ్చే ఏడాది శ్రీలంకలో ఈ టోర్నీని టీ20 ఫార్మాట్‌లో జరపాలని నిర్ణయించారు. ఇక 2023 ఆసియా కప్‌ ఆతిథ్యం విషయంలో మాత్రం పాక్‌ పట్టు వదలట్లేదు. భారత్‌లో 2023లో జరిగే వన్డే ప్రపంచకప్‌నకు సన్నాహకంగా ఈ ఆసియా కప్‌ నిర్వహించే అవకాశం ఉంది. 2008 ఆసియా కప్‌ తర్వాత పాక్‌లో ఇప్పటివరకూ ఒకటి కంటే ఎక్కువ దేశాలు పాల్గొన్న టోర్నీలు జరగలేదు. 2009లో పాక్‌ పర్యటనకు వెళ్లిన శ్రీలంక జట్టు బస్సుపై ఉగ్రదాడే అందుకు కారణం. ఇటీవల తమ ఆటగాళ్ల భద్రతపై ఆందోళన వ్యక్తం చేస్తూ చివరి నిమిషంలో న్యూజిలాండ్‌.. పాక్‌ పర్యటన రద్దు చేసుకుని స్వదేశం వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌ కూడా అదే బాటలో సాగింది. మరి రెండేళ్ల తర్వాత ఆసియా కప్‌ కోసం భారత్‌ను తమ దేశానికి పాక్‌ రప్పించగలదా అన్నది ప్రశ్న.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన