హెచ్‌సీఏ వ్యవహారాలపై విచారణ

ప్రధానాంశాలు

Published : 22/10/2021 03:00 IST

హెచ్‌సీఏ వ్యవహారాలపై విచారణ

ఆదేశిస్తామన్న సుప్రీంకోర్టు

సంఘం పనితీరుపై ఆగ్రహం

ఈనాడు - దిల్లీ

భారత క్రికెట్‌ మాజీ కెప్టెన్‌ మహమ్మద్‌ అజహరుద్దీన్‌ నేతృత్వంలోని హైదరాబాద్‌ క్రికెట్‌ సంఘం (హెచ్‌సీఏ) పనితీరుపై సుప్రీంకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ దీపక్‌ వర్మ నియామకానికి సంబంధించి తలెత్తిన  వివాదంపైనా మండిపడింది. ఆ సంస్థ మొత్తం వ్యవహారాలపై విచారణ జరిపిస్తామని హెచ్చరించింది. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్‌-కమ్‌-ఎథిక్స్‌   ఆఫీసర్‌గా జస్టిస్‌ దీపక్‌ వర్మను నియమిస్తూ హెచ్‌సీఏ అపెక్స్‌ కౌన్సిల్‌ తీసుకున్న నిర్ణయాన్ని సస్పెండ్‌ చేస్తూ హైదరాబాద్‌ సిటీ సివిల్‌ కోర్టు జారీచేసిన ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు ఏప్రిల్‌ 6న కొట్టేసింది. హైకోర్టు తీర్పును సవాల్‌చేస్తూ హెచ్‌సీఏ, అందులో సభ్యులైన బడ్డింగ్‌ స్టార్‌ క్రికెట్‌ క్లబ్‌లు సుప్రీంకోర్టులో రెండు అప్పీళ్లు దాఖలుచేశాయి. ఆ కేసును గురువారం ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌, జస్టిస్‌ హిమా కోహ్లీలతో కూడిన ధర్మాసనం విచారించింది. ఈ సందర్భంగా జస్టిస్‌ రమణ.. సంఘం పనితీరుపై   సునిశిత వ్యాఖ్యలుచేశారు. ‘‘క్రికెట్‌ ఎక్కడికో కొట్టుకుపోయింది. రాజకీయాలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి’’ అన్నారు. అక్కడ చోటుచేసుకున్న మొత్తం వ్యవహారాలపై రిటైర్డ్‌ సుప్రీంకోర్టు న్యాయమూర్తి లేదా హైకోర్టు న్యాయమూర్తితో విచారణకు  ఆదేశిస్తామని పేర్కొన్నారు. ‘‘మేం రిటైర్డ్‌ సుప్రీంకోర్టు లేదంటే హైకోర్టు న్యాయమూర్తులను విచారణ కోసం  నియమిస్తాం. రెండు గ్రూపులు మేనేజ్‌మెంట్‌ నుంచి బయటికెళ్లిపోవాలి. ఇందులో సీబీఐ దర్యాప్తు అవసరం ఉంది. వాళ్లు ఆఖరికి న్యాయవ్యవస్థను కూడా వివాదాల్లోకి లాగాలని చూస్తున్నారు’’ అని ధర్మాసనం పేర్కొంది. అంబుడ్స్‌మన్‌గా నియమితులైన జస్టిస్‌ దీపక్‌ వర్మ పదవీకాలం ఇప్పటికే ముగిసిపోయినందున ఆయన ఎలాంటి ఉత్తర్వులు జారీచేయకుండా చూడాలని హెచ్‌సీఏలో ఓ గ్రూప్‌ తరుఫున హాజరైన సీనియర్‌ అడ్వొకేట్‌ రాకేష్‌ ఖన్నాకు కోర్టు సూచించింది. ఈ కేసును వచ్చే బుధవారానికి వాయిదా వేస్తామని, ఆలోపు విచారణకోసం మాజీ న్యాయమూర్తుల పేర్లను ఎంపికచేస్తామని పేర్కొంది.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన