మెంటార్‌ పాత్ర పరిమితం: గావస్కర్‌

ప్రధానాంశాలు

Published : 23/10/2021 03:42 IST

మెంటార్‌ పాత్ర పరిమితం: గావస్కర్‌

దుబాయ్‌: మెంటార్స్‌ సహాయం మాత్రమే చేయగలరని.. మైదానంలో అసలు సవాల్‌ ఎదుర్కొనేది ఆటగాళ్లేనని దిగ్గజ క్రికెటర్‌ సునిల్‌ గావస్కర్‌ అన్నాడు. టీ20 ప్రపంచకప్‌కు టీమ్‌ఇండియా మెంటార్‌గా ధోనీని నియమించిన నేపథ్యంలో గావస్కర్‌ మాట్లాడుతూ మార్గనిర్దేశకుల పాత్ర పరిమితమని అభిప్రాయపడ్డాడు. ‘‘మెంటార్‌ పెద్దగా చేసేదేమీ ఉండదు. కాకపోతే ఆట వేగంగా సాగుతుంది కాబట్టి డ్రెస్సింగ్‌ రూమ్‌లో ఆటగాళ్లు సిద్ధమయ్యేందుకు సహాయం చేయగలడు. అవసరమైతే వ్యూహంలో మార్పునకు సహాయపడొచ్చు. టైమౌట్‌లో బ్యాటర్లు, బౌలర్లతో మాట్లాడొచ్చు. మెంటార్‌గా ధోని నియామకం మంచి నిర్ణయమే. కాని ధోని డ్రెస్సింగ్‌ రూమ్‌లోనే ఉండాలి. మైదానంలో అసలైన సవాలు ఎదుర్కొనేది ఆటగాళ్లే. వాళ్లు ఒత్తిడిని ఎలా అధిగమిస్తారన్న దానిపైనే ఫలితం ఆధారపడి ఉంటుంది. టీ20 ప్రపంచకప్‌ తర్వాత పొట్టి ఫార్మాట్‌ సారథ్యాన్ని వదులుకోవడం విరాట్‌ కోహ్లీకి మంచిదే. బాధ్యతల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉండదు కాబట్టి తన బ్యాటింగ్‌పై ఎక్కువ దృష్టిసారించొచ్చు. నాకౌట్‌, ఫైనల్‌ మ్యాచ్‌ల్లో జట్టు కూర్పే టీమ్‌ఇండియా సమస్య. సరైన తుది జట్టు లభిస్తే తక్కువ సమస్యలు ఎదురవుతాయి. ఆలోచన విధానం కూడా భిన్నంగా ఉంటుంది. నాకౌట్‌ లేదా ఫైనల్లో మొదట బ్యాటింగ్‌ చేయాలి. బహుశా 140 సమీపంలో స్కోరు చేసినా.. అంతర్జాతీయ క్రికెట్లో లక్ష్య ఛేదనలో ఓవర్‌కు ఏడు పరుగులు రాబట్టడం సలువేమీ కాదు. టీ20 క్రికెట్లో ఏ జట్టునైనా ఓడించడం కష్టం కాదు. పొట్టి ఫార్మాట్లో ఏ జట్టూ ఫేవరెట్‌ కాదు. తక్కువ పొరపాట్లు చేసే జట్టే గెలుస్తుంది’’ అని గావస్కర్‌ వివరించాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన