T20 World Cup: ఇక సూపర్‌ మజా!

ప్రధానాంశాలు

Updated : 23/10/2021 07:05 IST

T20 World Cup: ఇక సూపర్‌ మజా!

టీ20 ప్రపంచకప్‌ ప్రధాన రౌండ్‌ నేటి నుంచే
ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా ఢీ
విండీస్‌తో తలపడుతున్న ఇంగ్లాండ్‌

అయిదేళ్ల విరామం తర్వాత.. పొట్టి క్రికెట్‌ మజాను మరోసారి అందించేందుకు తిరిగి వచ్చిన టీ20 ప్రపంచకప్‌లో అసలు సమరానికి రంగం సిద్ధమైంది. ఇప్పటికే క్వాలిఫయర్‌ పోరాటాలు.. వార్మప్‌ మ్యాచ్‌లతో మొదలైన పొట్టి కప్పు సందడిని మరింత పెంచేందుకు.. ధనాధన్‌ ఆటతీరుతో అభిమానులను అలరించేందుకు అగ్రశ్రేణి జట్లు సన్నద్ధమయ్యాయి. నేటి నుంచే సూపర్‌-12 పోటీలకు తెరలేవనుంది. ఇక నుంచి జట్ల మధ్య పోరు అంతకు మించి ఉండబోతుంది. శనివారం గ్రూప్‌- 1లో తొలి మ్యాచ్‌లో ఆస్ట్రేలియాతో దక్షిణాఫ్రికా.. రెండో మ్యాచ్‌లో డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌తో ఇంగ్లాండ్‌ తలపడనున్నాయి.

దుబాయ్‌: గత (2016) టీ20 ప్రపంచకప్‌ ఫైనల్లో ఆఖరి ఓవర్లో బ్రాత్‌వైట్‌ విధ్వంసంతో టైటిల్‌ను అందుకుని తమ జట్టుకు పీడకలను మిగిల్చిన వెస్టిండీస్‌తో పోరుతో ఇంగ్లాండ్‌ ఈ టోర్నీని మొదలెట్టనుంది. ఇప్పటికే రెండు సార్లు టీ20 ప్రపంచకప్‌ను ఖాతాలో వేసుకున్న విండీస్‌.. మూడో టైటిల్‌పై కన్నేసింది. మరోవైపు రెండోసారి ఈ కప్పును సొంతం చేసుకోవాలనే లక్ష్యంతో మోర్గాన్‌ జట్టుంది.

హిట్టర్లున్నా..: వెస్టిండీస్‌ జట్టు నిండా హిట్లర్లే. ఒంటిచేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చేసే ఆటగాళ్లే. కానీ సమష్టిగా ఆడలేకపోవడం.. నిలకడ లోపించడం ఆ జట్టు సమస్యలు. ప్రపంచకప్‌లో వార్మప్‌ మ్యాచ్‌లోనూ ఆ జట్టు బ్యాటింగ్‌ ఆర్డర్‌ తేలిపోయింది. లూయిస్‌, సిమన్స్‌, గేల్‌, పూరన్‌, పొలార్డ్‌, హెట్‌మయర్‌, రసెల్‌, బ్రావో లాంటి హిట్టర్లు జట్టులో ఉన్నప్పటికీ.. అవసరమైన సమయంలో కీలక భాగస్వామ్యాలతో జట్టును ఆదుకోలేకపోతున్నారు. బ్రావో, రసెల్‌, పొలార్డ్‌.. బ్యాట్‌తో పాటు తమ తెలివైన బౌలింగ్‌తోనూ సత్తాచాటగలరు. స్పిన్నర్లు వాల్ష్‌, ఛేజ్‌, హొసేన్‌, పేసర్లు రవి రాంపాల్‌, థామస్‌, మెక్‌కాయ్‌తో కూడిన బౌలింగ్‌లో కీలకం.మరోవైపు ఆల్‌రౌండర్‌ స్టోక్స్‌, పేసర్‌ ఆర్చర్‌ లేకపోయినా ఇంగ్లాండ్‌ అన్ని విభాగాల్లోనూ పటిష్ఠంగా కనిపిస్తోంది. కెప్టెన్‌ మోర్గాన్‌ సహా బట్లర్‌, రాయ్‌, మలన్‌, బెయిర్‌ స్టో లాంటి విధ్వంసక బ్యాటర్లున్న జట్టుతో విండీస్‌ బౌలర్లకు ప్రమాదం తప్పకపోవచ్చు.వార్మప్‌ మ్యాచ్‌లో నెగ్గింది. బట్లర్‌, బెయిర్‌ స్టో లయ అందుకోవడం సానుకూలాంశం. ఆల్‌రౌండర్‌ మొయిన్‌ అలీతో పాటు మరో స్పిన్నర్‌ ఆదిల్‌ రషీద్‌ యూఏఈ పిచ్‌లపై కీలకం కానున్నారు. ఈ ఇద్దరు.. విండీస్‌ హిట్టర్లను ఎలా అడ్డుకుంటారో చూడాలి. మిల్స్‌, విల్లీ, మార్క్‌వుడ్‌, క్రిస్‌ వోక్స్‌, జోర్డాన్‌ లాంటి పేసర్లు జట్టులో ఉన్నారు.

తుది జట్లు (అంచనా).. ఇంగ్లాండ్‌: రాయ్‌, బట్లర్‌, బెయిర్‌స్టో, అలీ, లివింగ్‌స్టోన్‌, మోర్గాన్‌, వోక్స్‌, జోర్డాన్‌, రషీద్‌, మార్క్‌వుడ్‌, మిల్స్‌ వెస్టిండీస్‌: లూయిస్‌, సిమన్స్‌, గేల్‌, పూరన్‌, హెట్‌మయర్‌, పొలార్డ్‌, రసెల్‌, బ్రావో, వాల్ష్‌, మెక్‌కాయ్‌, థామస్‌/రవి

అబుదాబి: ఓ వైపు అయిదు సార్లు వన్డే ప్రపంచకప్‌ను దక్కించుకున్నప్పటికీ ఒక్కసారి కూడా టీ20 ప్రపంచకప్‌ను సొంతం చేసుకుని జట్టు.. మరోవైపు ఇప్పటివరకూ వన్డేలు, టీ20ల్లో కలిపి ఒక్క ప్రపంచకప్‌ను కూడా ముద్దాడని జట్టు.. ఈ సారి పొట్టి కప్పు పట్టేసి బోణీ కొట్టాలనే పట్టుదలతో ఉన్నాయి. ఇప్పుడు అవే జట్ల మధ్య మ్యాచ్‌తో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌- 12 దశకు తెరలేవనుంది.. ఆ జట్లలో ఒకటి ఆస్ట్రేలియా కాగా.. మరొకటి దక్షిణాఫ్రికా. టాప్‌ ఆర్డర్‌ వైఫల్యం.. తాజా ఫామ్‌.. ఆస్ట్రేలియాకు ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ టోర్నీకి ముందు వరుసగా అయిదు టీ20 సిరీస్‌ల్లో ఓడడం ఆ జట్టును కలవరపరిచే అంశమే. వార్నర్‌, కెప్టెన్‌ ఫించ్‌ ఫామ్‌లోకి రావాల్సిన అవసరం ఉంది.

ఇక స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌, స్టాయినిస్‌, మిచెల్‌ మార్ష్‌తో కూడిన మిడిలార్డర్‌ పటిష్ఠంగా ఉంది. ఒంటి చేత్తో మ్యాచ్‌ ఫలితాన్ని మార్చే మ్యాక్సీ ఫామ్‌లో ఉండడం కలిసొచ్చే అంశం. స్పిన్‌కు సహకరించే పిచ్‌పై బౌలింగ్‌తో సత్తాచాటేందుకు జంపా, అగర్‌ సిద్ధమయ్యారు. కమిన్స్‌, స్టార్క్‌, రిచర్డ్‌సన్‌, హేజిల్‌వుడ్‌తో కూడిన పేస్‌ దళం ప్రత్యర్థి బ్యాటర్లకు సవాలు విసరనుంది. మరోవైపు వరుస విజయాలతో.. పూర్తి ఆత్మవిశ్వాసంతో దక్షిణాఫ్రికా ఈ మ్యాచ్‌లో అడుగుపెడుతుంది. వరుసగా మూడు టీ20 సిరీస్‌లు నెగ్గి ఊపు మీదున్న సఫారీ సేన.. ఈ ప్రపంచకప్‌లో రెండు వార్మప్‌ మ్యాచ్‌ల్లోనూ గెలిచింది. కెప్టెన్‌ బవుమా, డికాక్‌, హెండ్రిక్స్‌, మార్‌క్రమ్‌లో కూడిన టాప్‌ ఆర్డర్‌ పటిష్ఠంగా ఉంది. మిడిలార్డర్‌ బలహీనం. పేస్‌ విభాగం రబాడ, ఎంగిడి, నార్జ్‌లతో బలంగానే ఉంది. షంసి, కేశవ్‌లతో స్పిన్‌ విభాగం కూడా ఉత్తమంగా ఉంది.

తుది జట్లు (అంచనా).. ఆస్ట్రేలియా: ఫించ్‌, వార్నర్‌, మార్ష్‌, మ్యాక్స్‌వెల్‌, స్మిత్‌, స్టాయినిస్‌, వేడ్‌, అగర్‌, స్టార్క్‌, జంపా, హేజిల్‌వుడ్‌ దక్షిణాఫ్రికా: డికాక్‌, బవుమా, మార్‌క్రమ్‌, డసెన్‌, మిల్లర్‌, క్లాసెన్‌, ముల్డర్‌, రబాడ, కేశవ్‌, నార్జ్‌/ఎంగిడి, షంసిAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన