ఆసీస్‌ గట్టెక్కింది

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 04:38 IST

ఆసీస్‌ గట్టెక్కింది

స్టాయినిస్‌ గెలుపు ఇన్నింగ్స్‌

దక్షిణాఫ్రికాపై కంగారూల విజయం

119 పరుగులు. టీ20 మ్యాచ్‌లో ఏ జట్టైనా ఉఫ్‌ అని ఊదేసే లక్ష్యం. కానీ శనివారం దక్షిణాఫ్రికాతో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 ఆరంభ మ్యాచ్‌లో స్వల్ప లక్ష్యమే ఆసీస్‌ ముందు కొండలా
కనిపించింది. ఆఖరి ఓవర్‌ చివరి వరకు మ్యాచ్‌ సాగింది. చివరికి ఫలితం ఆసీస్‌కు సానుకూలంగానే వచ్చినా పొట్టి కప్పు ఎలా జరగబోతుందో ఈ మ్యాచ్‌ చెప్పకనే చెప్పింది. యూఏఈలో ఐపీఎల్‌ మ్యాచ్‌లతో నెమ్మదిగా మారిన వికెట్లపై బౌలర్లదే ఆధిపత్యమని తేలిపోయింది.

అబుదాబి: టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 దశలో ఆస్ట్రేలియా శుభారంభం చేసింది. శనివారం గ్రూప్‌-1 మ్యాచ్‌లో ఆసీస్‌ 5 వికెట్ల తేడాతో దక్షిణాఫ్రికాపై నెగ్గింది. మొదట దక్షిణాఫ్రికా 20 ఓవర్లలో 9 వికెట్లకు 118 పరుగులే చేయగలిగింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ హేజిల్‌వుడ్‌ (2/19), మిచెల్‌ స్టార్క్‌ (2/32), ఆడమ్‌ జంపా (2/21) సఫారి జట్టును తక్కువ స్కోరుకే కట్టడి చేశారు. కెప్టెన్‌ బవుమా (12), డికాక్‌ (7), వాండర్‌డసెన్‌ (2), క్లాసెన్‌ (13), మిల్లర్‌ (16) విఫలమవగా.. మార్‌క్రమ్‌ (40; 36 బంతుల్లో 3×4, 1×6) పోరాడాడు. ఆసీస్‌ 19.4 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. లక్ష్యం చిన్నదే అయినా.. ఆసీస్‌కు ఇబ్బందులు తప్పలేదు. 4 పరుగులకే కెప్టెన్‌ ఫించ్‌ (0) వికెట్‌ కోల్పోయిన ఆసీస్‌పై సఫారీ బౌలర్లు ఒత్తిడి పెంచుతూ పోయారు. డేవిడ్‌ వార్నర్‌ (14), మిచెల్‌ మార్ష్‌ (11) కూడా ఎంతోసేపు నిలవకపోవడంతో ఆసీస్‌ 38/3కి చేరుకుంది. ఈ దశలో స్టీవ్‌ స్మిత్‌ (35; 34 బంతుల్లో 3×4), మ్యాక్స్‌వెల్‌ (18; 21 బంతుల్లో 1×4) నాలుగో వికెట్‌కు 42 పరుగులు జోడించి ఆసీస్‌ను రేసులోకి తెచ్చారు. అయితే ఒక్క పరుగు తేడాతో స్మిత్‌, మ్యాక్స్‌వెల్‌ ఔటవడంతో దక్షిణాఫ్రికా తిరిగి పోటీలోకి వచ్చింది. స్టాయినిస్‌ (24 నాటౌట్‌; 16 బంతుల్లో 3×4), మాథ్యూ వేడ్‌ (15 నాటౌట్‌; 10 బంతుల్లో 2×4) క్రీజులో ఉన్నా.. ఈ వికెట్‌పై ఛేదన సులువుగా అనిపించలేదు. 12 బంతుల్లో 18 పరుగులు చేయాల్సిన సమయంలో నార్జ్‌ వేసిన 19వ ఓవర్లో స్టాయినిస్‌ 10 పరుగులు రాబట్టాడు. ఆఖరి ఓవర్లో 8 పరుగులు కావాల్సి ఉండగా.. మొదటి బంతికి 2 తీసిన స్టాయినిస్‌ 2, 4 బంతుల్ని బౌండరీలకు తరలించి జట్టును గెలిపించాడు.

దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్‌: బవుమా (బి) మ్యాక్స్‌వెల్‌ 12; డికాక్‌ (బి) హేజిల్‌వుడ్‌ 7; డసెన్‌ (సి) వేడ్‌ (బి) హేజిల్‌వుడ్‌ 2; మార్‌క్రమ్‌ (సి) మ్యాక్స్‌వెల్‌ (బి) స్టార్క్‌ 40; క్లాసెన్‌ (సి) స్మిత్‌ (బి) కమిన్స్‌ 13; మిల్లర్‌ ఎల్బీ (బి) జంపా 16; ప్రిటోరియస్‌ (సి) వేడ్‌ (బి) జంపా 1; కేశవ్‌ మహరాజ్‌ రనౌట్‌ 0; రబాడ నాటౌట్‌ 19; నార్జ్‌ (సి) ఫించ్‌ (బి) స్టార్క్‌ 2; షంసి నాటౌట్‌ 0; ఎక్స్‌ట్రాలు 6 మొత్తం: (20 ఓవర్లలో 9 వికెట్లకు) 118; వికెట్ల పతనం: 1-13, 2-16, 3-23, 4-46, 5-80, 6-82, 7-83, 8-98, 9-115; బౌలింగ్‌: స్టార్క్‌ 4-0-32-2; మ్యాక్స్‌వెల్‌ 4-0-24-1; హేజిల్‌వుడ్‌ 4-1-19-2; కమిన్స్‌ 4-0-17-1; ఆడమ్‌ జంపా 4-0-21-2

ఆస్ట్రేలియా ఇన్నింగ్స్‌: వార్నర్‌ (సి) క్లాసెన్‌ (బి) రబాడ 14; ఫించ్‌ (సి) రబాడ (బి) నార్జ్‌ 0; మార్ష్‌ (సి) డసెన్‌ (బి) కేశవ్‌ 11; స్మిత్‌ (సి) మార్‌క్రమ్‌ (బి) నార్జ్‌ 35; మ్యాక్స్‌వెల్‌ (బి) షంసి 18; స్టాయినిస్‌ నాటౌట్‌ 24; వేడ్‌ నాటౌట్‌ 15; ఎక్స్‌ట్రాలు 4 మొత్తం: (19.4 ఓవర్లలో 5 వికెట్లకు) 121; వికెట్ల పతనం: 1-4, 2-20, 3-38, 4-80, 5-81; బౌలింగ్‌: రబాడ 4-0-28-1; నార్జ్‌ 4-0-21-2; కేశవ్‌ 4-0-23-1; షంసి 4-0-22-1; ప్రిటోరియస్‌ 3.4-0-26-0


నేటి మరో మ్యాచ్‌
బంగ్లాదేశ్‌ × శ్రీలంక
మధ్యాహ్నం 3.30 నుంచి


పక్షి కాదు ఫీల్డరే

ఆస్ట్రేలియాతో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికా ఆటగాడు మార్‌క్రమ్‌ పట్టిన క్యాచ్‌ ఇప్పుడు సామాజిక మాధ్యమాలను ఊపేస్తోంది. ఆసీస్‌ ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌ అయిదో బంతికి స్మిత్‌ పుల్‌ షాట్‌ ఆడాడు. లాంగాన్‌ ముందు ఉన్న మార్‌క్రమ్‌ బంతిని చూసి.. తన కుడివైపుగా గాల్లోకి డైవ్‌ చేసి అది నేలను తాకేముందే రెండు చేతులతో ఒడిసిపట్టుకున్నాడు. అద్భుత రీతిలో క్యాచ్‌ పట్టుకున్న అతను ఒక్కసారిగా పక్షిలా మారిపోయాడని అభిమానులు ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. పక్షి కాదు మార్‌క్రమే అంటూ తెగ పోస్టులు పెడుతున్నారు. మరోవైపు ఇంగ్లాండ్‌తో మ్యాచ్‌లో విండీస్‌ స్పిన్నర్‌ అకీల్‌ తన బౌలింగ్‌లోనే దాదాపు ఇలాంటి మెరుపు డైవింగ్‌ క్యాచ్‌నే పట్టాడు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన