విండీస్‌ విలవిల

ప్రధానాంశాలు

Updated : 24/10/2021 04:40 IST

విండీస్‌ విలవిల

రషీద్‌, అలీ ధాటికి 55కే ఆలౌట్‌

ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తు

ఒకరా ఇద్దరా హిట్టర్ల మీద హిట్టర్లు.. అయినా ఒక్కరైనా నిలిస్తే కదా! పరుగులు చేయడానికి కాక పెవిలియన్‌ చేరడానికే పోటీపడుతున్నట్లుగా ఒకరి వెంట ఒకరు క్యూ కట్టడంతో టీ20 ప్రపంచకప్‌ను డిఫెండింగ్‌ ఛాంపియన్‌ వెస్టిండీస్‌ పేలవంగా ఆరంభించింది. లెగ్‌స్పిన్నర్‌ అదిల్‌ రషీద్‌, ఆఫ్‌స్పిన్నర్‌ మొయిన్‌ అలీ మాయాజాలంతో విలవిల్లాడిన ఆ జట్టు కేవలం 55 పరుగులకే కుప్పకూలి ఇంగ్లాండ్‌ చేతిలో చిత్తుగా ఓడింది.

దుబాయ్‌: 27 పరుగులకు 2 వికెట్లు! 55 పరుగులకు ఆలౌట్‌! ఈ గణాంకాలు చాలు ఇంగ్లాండ్‌తో గ్రూప్‌-1 పోరులో వెస్టిండీస్‌ కుప్పకూలిన తీరును చెప్పడానికి..! రషీద్‌ (2.2-0-2-4), ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ మొయిన్‌ అలీ (4-1-17-2) అద్భుత స్పెల్స్‌తో స్వల్ప స్కోరుకే పరిమితమైన ఆ జట్టు 6 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. శనివారం జరిగిన ఈ పోరులో మొదట విండీస్‌ 14.2 ఓవర్లలో 55 పరుగులకే కుప్పకూలింది. అయిదు ఓవర్లలోపే 3 వికెట్లు పోగొట్టుకున్న ఆ జట్టు ఆ తర్వాత కోలుకోలేదు. లూయిస్‌ (6), సిమన్స్‌ (3), హెట్‌మయర్‌ (9) అలా వచ్చి ఇలా వెళ్లారు. హిట్టర్లు గేల్‌ (13), బ్రావో (5), పూరన్‌ (1), పొలార్డ్‌ (6), రసెల్‌ (0) కూడా నిలవలేదు. 9 ఓవర్లలో 42/6తో నిలిచిన విండీస్‌ జట్టు ఆ తర్వాత 13 పరుగులకే మిగిలిన 4 వికెట్లు చేజార్చుకుంది. అత్యంత పొదుపుగా బౌలింగ్‌ చేసిన రషీద్‌.. 2 పరుగులే ఇచ్చి నాలుగు వికెట్లు తీయడం విశేషం. రషీద్‌, అలీతో పాటు మిల్స్‌ (2/17) రాణించాడు. స్వల్ప ఛేదనలో ఇంగ్లాండ్‌ 39/4తో తడబడింది. రాయ్‌ (11), బెయిర్‌స్టో (9), అలీ (3), లివింగ్‌స్టోన్‌ (1) స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. కానీ లక్ష్యం సమీపంగా ఉండడంతో బట్లర్‌ (24 నాటౌట్‌), కెప్టెన్‌ మోర్గాన్‌ (7 నాటౌట్‌) పెద్దగా శ్రమపడకుండానే జట్టును గెలిపించారు. ఇంగ్లాండ్‌ 8.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. విండీస్‌ బౌలర్లలో అకీల్‌ (2/24) రాణించాడు. అతడు తన బౌలింగ్‌లోనే రెండు మెరుపు క్యాచ్‌లు పట్టి ఈ వికెట్లు సాధించడం విశేషం.

వెస్టిండీస్‌ ఇన్నింగ్స్‌: సిమన్స్‌ (సి) లివింగ్‌స్టోన్‌ (బి) అలీ 3; లూయిస్‌ (సి) అలీ (బి) వోక్స్‌ 6; గేల్‌ (సి) మలన్‌ (బి) మిల్స్‌ 13; హెట్‌మయర్‌ (సి) మోర్గాన్‌ (బి) అలీ 9; డ్వేన్‌ బ్రావో (సి) బెయిర్‌స్టో (బి) జోర్డాన్‌ 5; పూరన్‌ (సి) బట్లర్‌ (బి) మిల్స్‌ 1; పొలార్డ్‌ (సి) బెయిర్‌స్టో (బి) రషీద్‌ 6; రసెల్‌ (బి) రషీద్‌ 0; అకీల్‌ నాటౌట్‌ 6; మెకాయ్‌ (సి) రాయ్‌ (బి) రషీద్‌ 0; రాంపాల్‌ (బి) రషీద్‌ 3; ఎక్స్‌ట్రాలు 3; మొత్తం: (14.2 ఓవర్లలో ఆలౌట్‌) 55; వికెట్ల పతనం: 1-8, 2-9, 3-27, 4-31, 5-37, 6-42, 7-44,  8-49, 9-49; బౌలింగ్‌: మొయిన్‌ అలీ 4-1-17-2; వోక్స్‌ 2-0-12-1; మిల్స్‌ 4-0-17-2; జోర్డాన్‌ 2-0-7-1; రషీద్‌ 2.2-0-2-4
ఇంగ్లాండ్‌ ఇన్నింగ్స్‌: రాయ్‌ (సి) గేల్‌ (బి) రాంపాల్‌ 11; బట్లర్‌ నాటౌట్‌ 24; బెయిర్‌స్టో (సి) అండ్‌ (బి) అకీల్‌ 9; మొయిన్‌ అలీ రనౌట్‌ 3; లివింగ్‌స్టోన్‌ (సి) అండ్‌ (బి) అకీల్‌ 1; మోర్గాన్‌ నాటౌట్‌ 7; ఎక్స్‌ట్రాలు 1;
మొత్తం: (8.2 ఓవర్లలో 4 వికెట్లకు) 56; వికెట్ల పతనం: 1-21, 2-30, 3-36, 4-39; బౌలింగ్‌: అకీల్‌ 4-0-24-2;  రవి రాంపాల్‌ 2-0-14-1; మెకాయ్‌ 2-0-12-0; పొలార్డ్‌ 0.2-0-6-0Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన