లంక ఘనంగా..

ప్రధానాంశాలు

Published : 25/10/2021 02:23 IST

లంక ఘనంగా..

 టీ20 ప్రపంచకప్‌లో బోణీ

మెరిసిన అసలంక, భానుక

172.. టీ20లో ఎప్పుడూ కష్టసాధ్యమైన లక్ష్యమే. చెప్పుకోదగ్గ ఆటగాళ్లు లేని శ్రీలంకకు ఇంకా ఇబ్బంది. కానీ.. ఆ జట్టు మరీ కష్టపడకుండానే ఛేదించేసింది. టీ20 ప్రపంచకప్‌లో ఘనంగా బోణీ కొట్టింది. బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌లో ఒక దశలో 79 పరుగులకే 4 కీలక వికెట్లు కోల్పోయినా అసాధారణ రీతిలో ఆడి విజయాన్ని అందుకుంది. అసలంక, భానుక మెరుపు బ్యాటింగ్‌తో గెలుపు తీరాలకు చేరింది.

షార్జా

శ్రీలంక అదరగొట్టింది. టీ20 ప్రపంచకప్‌ తొలి మ్యాచ్‌లో సమష్టిగా ఆడి స్ఫూర్తిదాయక విజయాన్ని అందుకుంది. చరిత్‌ అసలంక (80 నాటౌట్‌; 49 బంతుల్లో 5×4, 5×6), భానుక (53; 31 బంతుల్లో 3×4, 3×6) సత్తా చాటడంతో ఆదివారం గ్రూప్‌-1 పోరులో లంక 5 వికెట్ల తేడాతో బంగ్లాను ఓడించింది. మొదట బంగ్లా 20 ఓవర్లలో 4 వికెట్లకు 171 పరుగులు చేసింది. నయీం (62), ముష్ఫికర్‌ రహీం (57 నాటౌట్‌) రాణించారు. అసలంక, భానుక మెరుపులతో లక్ష్యాన్ని లంక 18.5 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి అందుకుంది.

ఛేదనలో తడబడినా..: తొలి ఓవర్లోనే కుశాల్‌ ట(1)ను కోల్పోయినా లంక మాత్రం ఆగలేదు. అసలంక ధాటిగా ఆడడంతో స్కోరు పరుగులెత్తింది. అతడికి నిశాంక (24) నుంచి సహకారం అందడంతో 8 ఓవర్లకు లంక 71/1తో బలమైన స్థితిలో నిలిచింది. అయితే షకిబ్‌ ఒకే ఓవర్లో నిశాంక (24), అవిష్క (0) వికెట్లు తీసి లంకను దెబ్బ కొట్టాడు. ఆ తర్వాత హసరంగ (6) కూడా వెనుదిరగడంతో లంక 79/4తో కష్టాల్లో పడిపోయింది. అయితే 60 బంతుల్లో 92 పరుగులు చేయాల్సిన స్థితిలో అసలంక, భానుకతో కలిసి ఎదురుదాడి చేశాడు. 30 బంతుల్లో 46 పరుగులు అవసరమైన స్థితిలో భానుక సైఫుద్దీన్‌ వేసిన 16 ఓవర్లో రెండు సిక్స్‌లు, రెండు ఫోర్లు బాదడంతో లంకకు లక్ష్యం సులభం అయిపోయింది. అర్ధసెంచరీ తర్వాత భానుక ఔటైనా.. అసలంక మిగిలిన పని పూర్తి చేశాడు.

వాళ్లిద్దరూ నిలబడి..: బంగ్లా ఇన్నింగ్స్‌ మొత్తం ఓపెనర్‌ నయీం, మాజీ కెప్టెన్‌ ముష్ఫికర్‌ రహీం చుట్టే తిరిగింది. అర్ధసెంచరీలతో అదరగొట్టిన ఈ ఇద్దరు జట్టు భారీ స్కోరు చేయడంలో కీలకపాత్ర పోషించారు. మొదట నయీం ఇన్నింగ్స్‌కు గట్టి పునాది వేస్తే.. ముష్ఫికర్‌ అదిరే ముగింపునిచ్చాడు. నయీం.. తొలి వికెట్‌కు లిటన్‌దాస్‌ (16)తో కలిసి 40 పరుగులు జత చేసి శుభారంభం ఇచ్చాడు. అయితే లిటన్‌తో పాటు షకిబ్‌ తక్కువ వ్యవధిలో కూలినా.. ముష్ఫికర్‌ తోడుగా నయీం స్కోరు పెంచాడు. ముష్ఫికర్‌ కూడా బ్యాట్‌ ఝుళిపించడంతో బంగ్లా స్కోరు పరుగులెత్తింది. నయీం ఔటైనా జోరు కొనసాగించిన ముష్ఫికర్‌ స్కోరు పడిపోకుండా చూశాడు. 32 బంతుల్లో అర్ధసెంచరీ మార్కు దాటిన అతడు జట్టుకు మంచి స్కోరు అందించాడు.

బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌: నయీం (సి) అండ్‌ (బి) బినుర ఫెర్నాండో 62; లిటన్‌ దాస్‌ (సి) శనక (బి) కుమార 16; షకిబ్‌ (బి) కరుణరత్నె 10; ముష్ఫికర్‌ నాటౌట్‌ 57; అఫిఫ్‌ రనౌట్‌ 7; మహ్మదుల్లా నాటౌట్‌ 10; ఎక్స్‌ట్రాలు 9 మొత్తం: (20 ఓవర్లలో 4 వికెట్లకు) 171; వికెట్ల పతనం: 1-40, 2-56, 3-129, 4-150; బౌలింగ్‌: చమిక కరుణరత్నె 3-0-12-1; బినుర ఫెర్నాండో 3-0-27-1; చమీర 4-0-41-0; లహిరు కుమార 4-0-29-1; చరిత్‌ అసలంక 1-0-14-0; హసరంగ 3-0-29-0; శనక 2-0-14-0

శ్రీలంక ఇన్నింగ్స్‌: కుశాల్‌ పెరీరా (బి) నసుమ్‌ 1; నిశాంక (బి) షకిబ్‌ 24; చరిత్‌ అసలంక నాటౌట్‌ 80; అవిష్క ఫెర్నాండో (బి) షకిబ్‌ 0; హసరంగ (సి) నయీమ్‌ (బి) సైఫుద్దీన్‌ 6; భానుక రాజపక్స (బి) నసుమ్‌ 53; శనక నాటౌట్‌ 1; ఎక్స్‌ట్రాలు 7 మొత్తం: (18.5 ఓవర్లలో 5 వికెట్లకు) 172; వికెట్ల పతనం: 1-2, 2-71, 3-71, 4-79, 5-165; బౌలింగ్‌: నసుమ్‌ అహ్మద్‌ 2.5-0-29-2; మెహదీ హసన్‌ 4-0-30-0; సైఫుద్దీన్‌ 3-0-38-1; షకిబ్‌ 3-0-17-2; ముస్తాఫిజుర్‌ 3-0-22-0; మహ్మదుల్లా 2-0-21-0; అఫిఫ్‌ 1-0-15-0Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన