కోచ్‌ పదవికి ద్రవిడ్‌ దరఖాస్తు

ప్రధానాంశాలు

Published : 27/10/2021 04:11 IST

కోచ్‌ పదవికి ద్రవిడ్‌ దరఖాస్తు

ఫీల్డింగ్‌ శిక్షకుడి పోటీలో రాత్రా
ఎన్‌సీఏ రేసులో లక్ష్మణ్‌!
దిల్లీ

టీమ్‌ఇండియా మాజీ కెప్టెన్‌ రాహుల్‌ ద్రవిడ్‌ భారత జట్టు ప్రధాన కోచ్‌ పదవి చేపట్టడం లాంఛనమే. టీమ్‌ఇండియా కోచ్‌ పదవి కోసం ద్రవిడ్‌ మంగళవారం అధికారికంగా దరఖాస్తు చేసుకున్నాడు. ప్రస్తుతం జాతీయ క్రికెట్‌ అకాడమీ (ఎన్‌సీఏ) డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్న ద్రవిడ్‌ను చీఫ్‌ కోచ్‌గా నియమిస్తూ క్రికెట్‌ సలహా కమిటీ (సీఏసీ) నిర్ణయం తీసుకోవడమే ఇక తరువాయి. బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్‌ గంగూలీ, కార్యదర్శి జై షాల ఏకైక ఎంపిక ద్రవిడే కావడం.. రేసులో అతనికి సాటి మరెవరూ లేకపోవడంతో రాహుల్‌ నియామకం ఖాయమైనట్లే! ‘‘కోచ్‌ పదవికి ద్రవిడ్‌ దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తుకు మంగళవారమే తుది గడువు. ద్రవిడ్‌ ఎన్‌సీఏ బృందంలోని పారస్‌ మాంబ్రే (బౌలింగ్‌ కోచ్‌), అభయ్‌శర్మ (ఫీల్డింగ్‌ కోచ్‌) ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. ద్రవిడ్‌ దరఖాస్తు లాంఛనం మాత్రమే’’ అని బీసీసీఐ అధికారి తెలిపాడు. టీమ్‌ఇండియా మాజీ వికెట్‌ కీపర్‌ అజయ్‌ రాత్రా ఫీల్డింగ్‌ కోచ్‌ పదవికి మంగళవారం దరఖాస్తు చేశాడు. 6 టెస్టులు, 12 వన్డేలు, 99 ఫస్ట్‌క్లాస్‌ మ్యాచ్‌లు ఆడిన రాత్రా ప్రస్తుతం అస్సాం జట్టుకు కోచ్‌గా వ్యవహరిస్తున్నాడు. మరోవైపు టీమ్‌ఇండియా మాజీ బ్యాటర్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ మరోసారి ఎన్‌సీఏ డైరెక్టర్‌ పదవి రేసులోకి వచ్చాడు. ఎన్‌సీఏ బాధ్యతలు చేపట్టేందుకు లక్ష్మణ్‌ విముఖత చూపినట్లు ఇటీవల వార్తలు వచ్చినా మళ్లీ అతని పేరు తెరపైకి వచ్చింది. లక్ష్మణ్‌ను మరోసారి సంప్రదించాలని బీసీసీఐ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఒకవేళ ఎన్‌సీఏ డైరెక్టర్‌గా లక్ష్మణ్‌ ఎంపికైతే.. సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ మెంటార్‌ పదవికి అతను దూరం కావాల్సొస్తుంది. వ్యాఖ్యానం చేయడం.. కాలమ్స్‌ రాయడం కూడా కుదరదు. ఎన్‌సీఏ డైరెక్టర్‌ పదవి చేపడితే ఏడాదిలో కనీసం 200 రోజులు బెంగళూరులో ఉండాలి. దీనికి లక్ష్మణ్‌ ఒప్పుకుంటాడా? లేదా? అన్నది తెలియరాలేదు. లక్ష్మణ్‌ కాదంటే అనిల్‌ కుంబ్లేను సంప్రదించాలని బీసీసీఐ భావిస్తుంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన