నమీబియా గట్టెక్కింది

ప్రధానాంశాలు

Published : 28/10/2021 01:40 IST

నమీబియా గట్టెక్కింది

అబుదాబి: 3/2.. నమీబియాతో టీ20 ప్రపంచకప్‌ సూపర్‌-12 మ్యాచ్‌లో స్కాట్లాండ్‌ ఇన్నింగ్స్‌లో తొలి ఓవర్‌ ముగిసేసరికి స్కోరిది. ఈ స్థితి నుంచి పుంజుకుని ప్రత్యర్థికి 110 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడమే కాదు.. ఛేదనలో ఆ జట్టు వికెట్లు ఆరు వికెట్లు పడగొట్టి, మ్యాచ్‌ను ఉత్కంఠభరితంగా మార్చి, ఒక దశలో విజయం సాధించేలానూ కనిపించింది స్కాట్లాండ్‌. కానీ ఒత్తిడిని అధిగమించి చివరికి నమీబియానే మ్యాచ్‌లో విజేతగా నిలిచింది. స్కాట్లాండ్‌ పోరాటం మాత్రం అందరినీ ఆకట్టుకుంది. గ్రూప్‌-2లో జరిగిన ఈ మ్యాచ్‌లో నమీబియా 4 వికెట్ల తేడాతో నెగ్గి టోర్నీలో బోణీ కొట్టింది. మొదట స్కాట్లాండ్‌ 8  వికెట్లకు 109 పరుగులు చేసింది. రుబెన్‌ ట్రంపుల్‌మ్యాన్‌ (3/17) తొలి  ఓవర్లోనే మూడు వికెట్లు పడగొట్టి స్కాట్లాండ్‌ను కోలుకోలేని దెబ్బ తీశాడు. అయితే లియాస్క్‌ (44; 27 బంతుల్లో 4×4, 2×6), గ్రీవ్స్‌ (25) పోరాడి జట్టుకు పోరాడే స్కోరు అందించారు. నమీబియా బౌలర్లలో రుబెన్‌తో పాటు ఫ్రైలింక్‌ (2/10) కూడా సత్తా చాటాడు. అనంతరం క్రెయిగ్‌ విలియమ్స్‌ (23), లింగెన్‌ (18) నమీబియాకు మంచి ఆరంభమే అందించినా.. స్కాట్లాండ్‌ బౌలర్లు పట్టు వదల్లేదు. తొలి వికెట్‌ పడ్డాక.. ఒత్తిడి పెంచారు. ముఖ్యంగా బ్యాటింగ్‌లో ఆకట్టుకున్న లియాస్క్‌ (2/12) బంతితోనూ విజృంభించాడు. 12.3 ఓవర్లకు 67/4తో నమీబియా కష్టాల్లో పడింది. ఈ దశలో కెప్టెన్‌ వీస్‌ (16)తో కలిసి స్మిట్‌ (32 నాటౌట్‌; 23 బంతుల్లో 2×4, 2×6) కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. చివర్లో మరో రెండు వికెట్లు పడ్డప్పటికీ.. లక్ష్యం చిన్నది కావడంతో విజయం నమీబియానే వరించింది. ఆ జట్టు  19.1 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.

సంక్షిప్త స్కోర్లు: స్కాట్లాండ్‌: 109/8 (లియాస్క్‌ 44, గ్రీవ్స్‌ 25; రుబెన్‌ 3/17, ఫ్రైలింక్‌ 2/10); నమీబియా: 115/6 (స్మిట్‌ 32 నాటౌట్‌, క్రెయిగ్‌ విలియమ్స్‌ 23; లియాస్క్‌ 2/12, వీల్‌ 1/14)Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన