close

ప్రధానాంశాలు

Updated : 12/04/2021 06:11 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇరాన్‌ అణు కర్మాగారంపై సైబర్‌ దాడి!

ప్లాంట్‌లో కుప్పకూలిన విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ
ఇది మా దేశం పనే: ఇజ్రాయెల్‌ మీడియా

టెహ్రాన్‌: యురేనియం శుద్ధిని వేగంగా చేపట్టేందుకు అధునాతన సెంట్రిఫ్యూజ్‌లను ప్రారంభించిన ఇరాన్‌కు ఆదిలోనే ఇబ్బంది ఎదురైంది. నతాంజ్‌లోని అణు కర్మాగారంలో ఈ యంత్రాలను పనిచేయించడం మొదలుపెట్టిన కొద్దిగంటలకే అనూహ్యంగా అక్కడ విద్యుత్‌ పంపిణీ వ్యవస్థ కుప్పకూలింది. ఈ ఘటనను ఇజ్రాయెల్‌ సైబర్‌ దాడిగా స్వయంగా అక్కడి మీడియా పేర్కొంది. నతాంజ్‌ కర్మాగారంలో అత్యంత కీలకమైన సెంట్రిఫ్యూజులు ఉన్నాయి. విద్యుత్‌ సమస్య వల్ల.. నేలపై ఉన్న వర్క్‌షాప్‌లు, నేలమాళిగలోని అణుశుద్ధి యూనిట్లు సహా కర్మాగారం అంతటా విద్యుత్‌ నిలిచిపోయిందని ఇరాన్‌ అణు విభాగం అధికార ప్రతినిధి బెహ్రౌజ్‌ కమల్‌వాండి చెప్పారు. దీనికి కారణాలు వెల్లడి కాలేదన్నారు. ఈ ఘటన వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించలేదని చెప్పారు. కాలుష్య సమస్య కూడా ఉత్పన్నం కాలేదని తెలిపారు. అయితే ఈ ఘటన చాలా అనుమానాస్పదంగా ఉందని ఇరాన్‌ పార్లమెంటులోని ఇంధన కమిటీ అధికార ప్రతినిధి మాలెక్‌ షిరియాతి నియాసర్‌ పేర్కొన్నారు. విద్రోహచర్య, చొరబాటును ఇది సూచిస్తోందని చెప్పారు. ఇది ‘అణు ఉగ్రవాదం’ అని ఇరాన్‌ అణు ఇంధన సంస్థ అధిపతి అలీ అక్బర్‌ సలేహి ఆరోపించారు. అయితే నిర్దిష్టంగా ఎవరిపైనా ఆరోపణలు చేయలేదు. ‘‘ఉగ్రవాదుల దుశ్చర్యలను అడ్డుకోవడానికి మా అణు పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోవడాన్ని కొనసాగిస్తాం. అలాగే నిరంకుశ ఆంక్షలను ఎత్తివేయించేలా కృషి చేస్తాం’’ అని ఆయన తెలిపారు. ఇలాంటి అణు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ (ఐఏఈఏ) చర్యలు చేపట్టాలన్నారు.
తాజా ఘటన వెనుక తమ దేశ ప్రమేయం ఉండొచ్చని ఇజ్రాయెల్‌ అధికారిక మీడియా ‘కాన్‌’ సహా పలు వార్తా సంస్థలు పేర్కొన్నాయి. దాదాపు దశాబ్దం కిందట నతాంజ్‌పై జరిగిన ‘స్టక్స్‌నెట్‌’ సైబర్‌ దాడిని కూడా తమ దేశమే నిర్వహించిందని తెలిపాయి. ఇజ్రాయెల్‌లో మీడియాకు, సైన్యానికి మధ్య సన్నిహిత సంబంధాలు ఉండటం ఇక్కడ ప్రస్తావనార్హం. తాజా ఘటన వెనుక ఇజ్రాయెల్‌ హస్తమున్నట్లు తేలితే రెండు దేశాల మధ్య మరోసారి ఉద్రిక్తతలు పెరిగే అవకాశం ఉంది. ఇరాన్‌ అణు కార్యక్రమాన్ని పరిమితం చేసేందుకు కుదిరిన ఒక ఒప్పందంలోకి తిరిగి ప్రవేశించేందుకు అమెరికా చేస్తున్న ప్రయత్నాలకూ విఘాతం కలగొచ్చు. నతాంజ్‌ కర్మాగారంలో విద్యుత్‌ సమస్య తలెత్తిన సమయంలో అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ ఇజ్రాయెల్‌లో పర్యటిస్తున్నారు. తాజా పరిణామాలపై అక్కడి ప్రభుత్వంతో ఆయన చర్చించే వీలుంది.

భద్రంగా నిర్మించినా..

శత్రు దేశాల వైమానిక దాడులను తట్టుకునేలా నతాంజ్‌ కర్మాగారాన్ని చాలా వరకూ నేలమాళిగలోనే నిర్మించారు. దీని నిర్మాణానికి సంబంధించిన ఉపగ్రహ చిత్రాలు 2002లో బహిర్గతం కాగానే.. ఇరాన్‌కు, పశ్చిమ దేశాలకు మధ్య ఉద్రిక్తతలు చెలరేగాయి. గత ఏడాది జులైలో అక్కడి ‘సెంట్రిఫ్యూజ్‌ అసెంబ్లీ కర్మాగారం’లో అంతుచిక్కని విస్ఫోటం చోటుచేసుకుంది. అది కూడా ఇజ్రాయెల్‌ పనేనన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. పేలుడుతో దెబ్బతిన్న అసెంబ్లీ కర్మాగారాన్ని.. సమీపంలోని పర్వతంలోకి తరలించారు. గత ఏడాది నవంబరులో ఇరాన్‌కు చెందిన ఒక అణుశాస్త్రవేత్త హత్య వెనుక కూడా ఇజ్రాయెల్‌ ప్రమేయం ఉండొచ్చని వార్తలు వచ్చాయి. నతాంజ్‌లోని సరికొత్త 164 ఐఆర్‌-6 సెంట్రిఫ్యూజులను ప్రారంభించినట్లు ఇరాన్‌ శనివారం ప్రకటించింది. వాటికన్నా మెరుగైన ఐఆర్‌-9 సెంట్రిఫ్యూజ్‌పై పరీక్షలనూ ఆరంభించినట్లు తెలిపింది. అది తొలి తరం ‘ఐఆర్‌-1’ కన్నా 50 రెట్లు వేగంగా యురేనియాన్ని శుద్ధి చేస్తుందని పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన