ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు రాహుల్‌గాంధీ

ప్రధానాంశాలు

Updated : 27/07/2021 06:19 IST

ట్రాక్టర్‌పై పార్లమెంట్‌కు రాహుల్‌గాంధీ

దిల్లీ: సాగు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా సోమవారం కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ పార్లమెంటుకు ట్రాక్టర్‌పై వచ్చారు. ఆయనతో పాటు ఎంపీలు ప్రతాప్‌ సింగ్‌ బజ్వా, రవనీత్‌ సింగ్‌ బిట్టూ కూడా ఉన్నారు. ‘‘ఇద్దరు ముగ్గురు పారిశ్రామికవేత్తల కోసమే ఈ చట్టాలను తీసుకొచ్చారన్చ్న విషయం దేశం మొత్తానికి తెలుసు. ఇవి రైతులకు ఏ మాత్రం మేలు చేయవు. అందుకే వీటిని వెనక్కి తీసుకోవాలి’’ అని రాహుల్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. ఈ ర్యాలీలో పాల్గొన్న కాంగ్రెస్‌ నాయకులు రణ్‌దీప్‌ సూర్జేవాలా, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు బి.వి.శ్రీనివాస్‌ తదితరులను పోలీసులు అదుపులోకి తీసుకొని మందిర్‌ మార్గ్‌ పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. ‘‘ఇలాంటి చర్యలతో  వెనక్కి తగ్గం. దేశంలోని 62 కోట్ల మంది రైతుల హక్కులను ముగ్గురు, నలుగురు పారిశ్రామికవేత్తల అప్పగించాలని మోదీ ప్రభుత్వం చూస్తోంది’’ అని సూర్జేవాలా తెలిపారు.

రైతుల్ని తప్పుదోవ పట్టించొద్దు: తోమర్‌

రైతుల్ని తప్పుదోవ పట్టించి అయోమయం సృష్టించే ప్రయత్నం చేయవద్దని కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ సూచించారు. ‘రాహుల్‌కి గ్రామీణ భారతదేశం గురించి ఎలాంటి అవగాహన లేదు. పేదలు, రైతులపై ఏ విధమైన చింత లేదు. వ్యవసాయ రంగంలో ఇలాంటి సంస్కరణలే తెస్తామని ఎన్నికల ప్రణాళికలో కాంగ్రెస్‌ హామీ ఇచ్చింది. ఆ మేనిఫెస్టో అబద్ధమా? ఇప్పుడు చెబుతున్న మాటలు అబద్ధమా అనేది రాహుల్‌ చెప్పాలి’ అని డిమాండ్‌ చేశారు. ఇలాంటి అరకొర అవగాహన వల్లనే కనీసం కాంగ్రెస్‌ పార్టీలోనైనా ఆయన ఏకగ్రీవ నేత కాలేకపోయారని ఎద్దేవా చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన