పార్లమెంటులో అదే వరస

ప్రధానాంశాలు

Published : 28/07/2021 05:24 IST

పార్లమెంటులో అదే వరస

పెగాసస్‌, రైతు చట్టాలపై విపక్షాల నిరసన

రోజులో తొమ్మిదిసార్లు వాయిదాపడిన లోక్‌సభ

శాసించాలని చూస్తే ఎలా? : వెంకయ్యనాయుడు

దిల్లీ: పార్లమెంటు ఉభయ సభల్లో మళ్లీ అదే వాతావరణం. తాము లేవనెత్తదలచుకున్న అంశాలపై చర్చ చేపట్టాలని విపక్షం.. సభలో ప్రశాంతత నెలకొంటే దానికి సిద్ధమని అధికార పక్షం తమ వైఖరిని పునరుద్ఘాటించాయి. చర్చకు ఆస్కారం ఇవ్వకపోవడం సబబు కాదని సభాపతులు పలుమార్లు వారించినా విపక్షాలు తమ పట్టును సడలించలేదు. దీంతో మంగళవారం కూడా ఎలాంటి చర్చలు చేపట్టకుండానే ఉభయ సభలూ బుధవారానికి వాయిదా పడ్డాయి. లోక్‌సభ స్వల్ప విరామాలతో తొమ్మిదిసార్లు వాయిదా పడింది. ఫోన్లపై అక్రమ నిఘా, నూతన వ్యవసాయ చట్టాలపై విపక్షాల నిరసనలతో ఉదయం నుంచి లోక్‌సభలో వాతావరణం వేడెక్కింది. కాంగ్రెస్‌, సీపీఎం, సీపీఐ, తృణమూల్‌ కాంగ్రెస్‌, బీఎస్పీ, ఎస్పీ, శిరోమణి అకాలీదళ్‌ తదితర పార్టీల సభ్యులు సభాపతి స్థానం వద్ద నినాదాలిచ్చారు.

సమస్యలు లేవనెత్తడంలో పోటీ : స్పీకర్‌

అత్యవసర ప్రజా ప్రాముఖ్యం ఉన్న అంశాలను చర్చించాల్సి ఉందంటూ సభాపతి ఓం బిర్లా విజ్ఞప్తి చేసినా సభా కార్యకలాపాలు ముందుకు సాగలేదు. నినాదాల్లో కాకుండా ప్రజా సమస్యలను లేవనెత్తడంలో పోటీ పడాలని ఆయన సూచించారు. రైతుల సమస్యలపై నిజంగా ఆందోళన ఉంటే సభా కార్యకలాపాలను కొనసాగనివ్వాలని, రైతులకు సంబంధించిన 15 ప్రశ్నలపై ప్రభుత్వం ఏం చెప్పదలచుకుందో వినాలని వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్రసింగ్‌ తోమర్‌ కోరారు. పరిస్థితిలో మార్పు లేకపోవడంతో సభ పలుమార్లు వాయిదా పడింది. ఇటీవల కన్నుమూసిన మారిషస్‌ మాజీ అధ్యక్షుడు అనిరుధ్‌ జగన్నాథ్‌, జాంబియా తొలి అధ్యక్షుడు కెన్నెత్‌ కౌండాలకు ఉభయ సభల్లో సభ్యులు నివాళులర్పించారు. సాయంత్రం సభను వాయిదా వేశాక పంజాబ్‌కు చెందిన ఇద్దరు కాంగ్రెస్‌ ఎంపీలు రైతు సమస్యలపై సభ లోపల ధర్నాకు దిగారు. దాదాపు నాలుగు గంటలసేపు ధర్నా చేశాక లోక్‌సభ సచివాలయ సిబ్బంది వినతి మేరకు విరమించారు.

రాజ్యసభలోనూ అదే పట్టు

రాజ్యసభలోనూ మంగళవారం విపక్ష సభ్యులు గళమెత్తారు. పెగాసస్‌ స్పైవేర్‌ను అక్రమంగా వాడడంపై నిరసనలు తెలిపారు. రోజు మొత్తంమీద సభ నాలుగుసార్లు వాయిదా పడింది. దీనిపై ఛైర్మన్‌ ఎం.వెంకయ్యనాయుడు ఆవేదన వ్యక్తం చేశారు. సభను నడవనివ్వకూడదని కొందరు సభ్యులు నిర్ణయించుకున్నట్లు వెలువడుతున్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ప్రజా సంబంధిత అంశాలు చర్చించి శాసనాలు చేయడం పార్లమెంటు పని అయినా దానికి ఆస్కారం లభించడం లేదన్నారు. గతంలో 17 నిమిషాల్లో ఎనిమిది బిల్లుల్ని ఆమోదించిన ఒక సందర్భాన్ని గుర్తుచేశారు. పార్లమెంటును ఆ స్థాయికి దిగజార్చడం దురదృష్టకరమన్నారు. సభను ఎవరైనా శాసించాలని చూస్తే అనుమతించేది లేదని స్పష్టంచేశారు. రైతు నేతల పేరుతో ఆందోళన చేస్తున్నవారి విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని భాజపా ఎంపీ వివేక్‌ నారాయణ్‌ షెజ్‌వాల్కర్‌ కోరారు. పోరాటం చేస్తున్నవారు రైతులు కాదన్నారు. విరామం తర్వాత తిరిగి సమావేశమైనప్పుడు సభ్యులు తమ స్థానాల్లోకి వెళ్లడానికి నిరాకరించడంతో సభను బుధవారానికి వాయిదా వేస్తున్నట్లు డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ నారాయణ్‌ సింగ్‌ ప్రకటించారు.

రాష్ట్రపతికి 7 పార్టీల నేతల లేఖ

పెగాసస్‌, రైతు అంశాలపై చర్చించేలా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరుతూ రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌కు ఏడు విపక్ష పార్టీల నేతలు లేఖ రాశారు. వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు. సమయం కేటాయిస్తే స్వయంగా వచ్చి ఈ కీలకాంశాలపై తమ అభిప్రాయాలు నివేదిస్తామని చెప్పారు. బీఎస్పీ, ఆర్‌ఎల్‌పీ, అకాలీదళ్‌, నేషనల్‌ కాన్ఫరెన్స్‌, సీపీఐ, సీపీఎం, ఎన్సీపీ నేతలు ఈ లేఖపై సంతకాలు చేసినట్లు ఎన్సీపీ నేత సుప్రియా సూలే తెలిపారు. సంతకాలు చేసిన పార్టీల్లో ప్రధాన విపక్షం కాంగ్రెస్‌ లేదు. పెగాసస్‌పై చర్చకు కాంగ్రెస్‌, మరికొన్ని విపక్షాలు బుధవారం ఉభయ సభల్లో వాయిదా తీర్మానాలు ప్రవేశపెట్టనున్నాయి. ఈ మేరకు విపక్షాల సమావేశం నిర్ణయం తీసుకుంది. బుధవారం ఉదయం విపక్షాలు మరోసారి సమావేశమై వ్యూహం ఖరారు చేయనున్నాయి.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన