నాసాకు 200 కోట్ల డాలర్ల డిస్కౌంట్‌

ప్రధానాంశాలు

Updated : 28/07/2021 10:07 IST

నాసాకు 200 కోట్ల డాలర్ల డిస్కౌంట్‌

చందమామపై ల్యాండింగ్‌ కాంట్రాక్టు మాకే ఇవ్వండి : జెఫ్‌ బెజోస్‌ ఆఫర్‌

స్పేస్‌ఎక్స్‌కు గండి కొట్టేందుకే..

వాషింగ్టన్‌: రోదసి రంగంలో దిగ్గజ కంపెనీల మధ్య పోటీ తీవ్ర రూపం దాలుస్తోంది. చంద్రుడిపై వ్యోమగాములను దించడానికి ఉద్దేశించిన కాంట్రాక్టును తమకు ఇస్తే అమెరికా అంతరిక్ష సంస్థ (నాసా)కు ఏకంగా 2 వందల కోట్ల డాలర్ల (సుమారు రూ.15వేల కోట్లు) రాయితీని ఇస్తామని అమెజాన్‌ వ్యవస్థాపకుడు, రోదసి సంస్థ బ్లూ ఆరిజిన్‌ అధిపతి జెఫ్‌ బెజోస్‌ ఒక బంపర్‌ ఆఫర్‌ ఇచ్చారు. ఇప్పటికే ఈ కాంట్రాక్ట్‌ను ఎలాన్‌ మస్క్‌కు చెందిన ‘స్పేస్‌ఎక్స్‌’కి కేటాయించగా.. ఎలాగైనా దాన్ని దక్కించుకోవాలన్న పట్టుదలతో బెజోస్‌ పెద్దఎత్తున పైరవీ చేస్తున్నట్లు సమాచారం.

‘అర్టెమిస్‌’ కార్యక్రమం ద్వారా 2024 కల్లా చందమామపై వ్యోమగాములను దించాలని అమెరికా నిర్ణయించింది. ఈ అనుభవంతో 2030లలో అంగారకుడిపైకి మానవులను పంపాలని భావిస్తోంది. జాబిల్లి ఉపరితలంపైకి మానవులను చేర్చే వ్యోమనౌక (హ్యూమన్‌ ల్యాండింగ్‌ సిస్టమ్‌-హెచ్‌ఎల్‌ఎస్‌)ను నిర్మించడానికి ఉద్దేశించిన 290 కోట్ల డాలర్ల కాంట్రాక్టును స్పేస్‌ఎక్స్‌ సంస్థకు ఇస్తున్నట్లు ఏప్రిల్‌లో నాసా ప్రకటించింది. బ్లూ ఆరిజిన్‌, మరో సంస్థ డైనటిక్స్‌ల బిడ్‌లను తోసిపుచ్చింది. స్వీయ నిధుల్లో లోటు, భూ కక్ష్యలోకి యాత్రలు నిర్వహించడంలో స్పేస్‌ఎక్స్‌కు ఉన్న అనుభవం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకొని ఈ కాంట్రాక్టును ఖరారు చేసినట్లు నాడు ప్రకటించింది. ఈ అంశంపై బ్లూ ఆరిజిన్‌, డైనటిక్స్‌ సంస్థలు.. ప్రభుత్వ జవాబుదారీ కార్యాలయం (జీఏవో)లో ఫిర్యాదు చేశాయి. తాము రూపొందించిన ‘బ్లూ మూన్‌’ ల్యాండర్‌లోని అనేక భాగాలపై నాసా తప్పుడు నిర్ణయాలకు వచ్చిందని బ్లూ ఆరిజిన్‌ తన ఫిర్యాదులో పేర్కొంది. దీనిపై ఇంకా నిర్ణయం వెలువడాల్సి ఉంది.

ఈ నేపథ్యంలో నాసా అధిపతి బిల్‌ నెల్సన్‌కు బెజోస్‌ తాజాగా ఒక లేఖ రాశారు. కాంట్రాక్టును బ్లూ ఆరిజిన్‌కు అప్పగిస్తే.. హెచ్‌ఎల్‌ఎస్‌ బడ్జెట్‌ కొరతను తీరుస్తామని అందులో పేర్కొన్నారు. ప్రస్తుత, రాబోయే రెండు ఆర్థిక సంవత్సరాల్లో నాసా తమకు చేయాల్సిన 2 వందల కోట్ల డాలర్ల చెల్లింపులను రద్దు చేస్తామని చెప్పారు. ‘‘ఈ ప్రతిపాదన నిధుల కొరతను తీరుస్తుంది. మేం ఇచ్చే ఆఫర్‌.. చెల్లింపులను వాయిదా వేయడం కాదు. శాశ్వతంగా 2 బిలియన్‌ డాలర్లు రద్దు చేస్తాం’’ అని వివరించారు. అలాగే ల్యాండింగ్‌ పరిజ్ఞాన సామర్థ్యాన్ని రుజువు చేసేందుకు దిగువ భూ కక్ష్యలో సొంతంగా ప్రయోగాన్ని చేపడతామని చెప్పారు. ఇందుకు బదులుగా తమకు స్థిర ధరతో కాంట్రాక్టును ఇవ్వాలని తమకు కోరారు. ప్రాజెక్టు వ్యయంలో పెరుగుదల నుంచి నాసాకు రక్షణ కల్పిస్తామని చెప్పారు.

ఇంకా చాలా ప్రయోజనాలు..

ఈ కాంట్రాక్ట్‌ను ‘బ్లూ ఆరిజిన్‌’కు ఇవ్వడం వల్ల డిస్కౌంట్‌తో పాటు మరిన్ని ప్రయోజనాలు కూడా ఉన్నట్లు బెజోస్‌ తెలిపారు. తాము తయారు చేయబోయే ‘బ్లూ మూన్‌ ల్యాండర్‌’.. ద్రవ హైడ్రోజన్‌తో నడిచేలా రూపొందించనున్నామన్నారు. చంద్రుడి ఉపరితలంపై ఉండే ఐస్‌ నుంచి కూడా దీనికి ఇంధనాన్ని సమకూర్చుకునే అవకాశం ఉందని చెప్పారు. ఫలితంగా భవిష్యత్తులో సౌర కుటుంబంలో మరింత విస్తృతంగా పరిశోధనలు సాగించడానికి వీలవుతుందని వివరించారు. దీనిపై నాసా ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది.

పట్టుకోసం తహతహ..

స్పేస్‌ ఎక్స్‌ నిర్మించిన వ్యోమనౌక ‘క్రూ డ్రాగన్‌’ ఇప్పటికే అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళ్లి వచ్చింది. మరోవైపు బ్లూ ఆరిజిన్‌ రూపొందించిన ‘న్యూ షెపర్డ్‌’ వ్యోమనౌకలో ఇటీవలే బెజోస్‌ అంతరిక్ష యాత్ర చేసి వచ్చారు. దీంతో రెండు సంస్థల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. భవిష్యత్తులో రోదసి పర్యాటక రంగం బాగా వృద్ధి చెందే అవకాశం ఉంది. దీంతో నాసా తాజా ప్రాజెక్టును దక్కించుకోవడం ద్వారా ఈ రంగంపై పై చేయి సాధించవచ్చని బెజోస్‌ ఊవిళ్లూరుతున్నట్లు స్పష్టమవుతోంది.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన