పత్రాలివ్వని ‘మహా’ సర్కారు

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:38 IST

పత్రాలివ్వని ‘మహా’ సర్కారు

అనిల్‌ దేశ్‌ముఖ్‌ కేసుపై హైకోర్టుకు తెలిపిన సీబీఐ

ముంబయి: మహారాష్ట్ర మాజీ హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌పై నమోదైన కేసు దర్యాప్తునకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని సీబీఐ బుధవారం బాంబే హైకోర్టుకు తెలిపింది. సీబీఐ తరఫున హాజరైన అదనపు సొలిసిటర్‌ జనరల్‌ అనిల్‌ సింగ్‌.. న్యాయమూర్తులు జస్టిస్‌ ఎస్‌.ఎస్‌.షిందే, జస్టిస్‌ ఎన్‌.జె.జమదార్‌లతో కూడిన ధర్మాసనానికి ఈ మేరకు ఫిర్యాదు చేశారు. హైకోర్టు ఆదేశాల మేరకే ఈ దర్యాప్తు జరుగుతున్న విషయాన్ని ప్రస్తావించారు. బదిలీలు, పోస్టింగ్‌లపై సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి రష్మీ శుక్లా రాసిన లేఖ, ఇతర పత్రాలను ఇవ్వాలని రాష్ట్ర నిఘా విభాగాన్ని కోరగా అందుకు నిరాకరించిందని తెలిపారు. వేరే కేసు కోసం ఈ సమాచారం అవసరం ఉందని చెబుతూ ఆ లేఖను పంపించలేదని చెప్పారు. ధర్మాసనం స్పందిస్తూ దీనిపై వినతి పత్రం ఇస్తే పరిశీలన జరుపుతామని తెలిపింది.

12 చోట్ల సోదాలు

ఈ కేసు వ్యవహారంలో సీబీఐ బుధవారం రాష్ట్రంలోని ఎనిమిది నగరాల్లోని 12 చోట్ల సోదాలు జరిపింది. ఎన్‌కౌంటర్‌ స్పెషలిస్టు ఏసీపీ సంజయ్‌ పాటిల్‌, డీసీపీ రాజు భుజబల్‌ ఇళ్లల్లోనూ సోదాలు జరిగాయి. ముంబయిలోని బార్లు, మద్యం దుకాణాల నుంచి ప్రతి నెలా రూ.100 కోట్లు వసూలు చేసి ఇవ్వాలని అనిల్‌ దేశ్‌ముఖ్‌ పోలీసులను ఆదేశించినట్టు సీబీఐ కేసు నమోదు చేసిన విషయం విదితమే.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన