భాజపా సహకరించక స్థాయీ సంఘం వాయిదా

ప్రధానాంశాలు

Updated : 29/07/2021 07:48 IST

భాజపా సహకరించక స్థాయీ సంఘం వాయిదా

పెగాసస్‌ వ్యవహారంపై చర్చకు నిరాకరణ

దిల్లీ: భాజపా సభ్యుల సహాయ నిరాకరణ కారణంగా బుధవారం జరగాల్సిన ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశం వాయిదా పడింది. పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై చర్చించడానికి సిద్ధం కాగా, భాజపా సభ్యులు సహకరించలేదు. సమావేశం గదిలోకి వచ్చినప్పటికీ వారెవరూ హాజరుపట్టీలో సంతకాలు చేయలేదు. పార్లమెంటు నడవకుండా కాంగ్రెస్‌ అడ్డుకుంటోందని, అందువల్ల తాము కూడా ఇక్కడ సహకరించబోమని భాజపా సభ్యులు తెలిపారు. దాంతో అవసరమైన కోరం లేకపోవడంతో సమావేశం నిర్వహణ సాధ్యం కాలేదు. 32 మంది ఉన్న ఈ సంఘానికి కాంగ్రెస్‌ సభ్యుడు శశి థరూర్‌ అధ్యక్షత వహిస్తుండగా, మెజార్జీ సభ్యులు భాజపావారే ఉన్నారు. హోం, ఐటీ శాఖల అధికారులు కూడా రాలేదని ఈ కమిటీ సభ్యుడైన కార్తీ చిదంబరం (కాంగ్రెస్‌) చెప్పారు. పెగాసస్‌ వ్యవహారంపై చర్చించడం భాజపాకు ఇష్టం లేదని అర్థమవుతోందని ఆయన వ్యాఖ్యానించారు. మరోవైపు తన అధికారాన్ని ఇష్టం వచ్చినట్టు ఉపయోగిస్తున్న శశి థరూర్‌ను స్థాయీ సంఘం ఛైర్మన్‌ పదవి నుంచి తొలగించాలని భాజపా సభ్యుడు నిషికాంత్‌ దుబే డిమాండు చేశారు. ఈ మేరకు స్పీకర్‌ ఓం బిర్లాకు వినతి పత్రం సమర్పించినట్టు తెలిపారు. తనను తృణమూల్‌ ఎంపీ మహువా మొయిత్రా ‘బిహార్‌ గూండా’ అని విమర్శించారని దుబే ఆరోపించారు. అయితే దీన్ని ఆమె ఖండించారు. ఆయన అసలు సమావేశానికే రాలేదని, అలాంటప్పుడు తానెలా వ్యాఖ్యలు చేయగలుగుతానని ప్రశ్నించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన