అమ్మభాషలో చదివితే ఆత్మవిశ్వాసం

ప్రధానాంశాలు

Published : 30/07/2021 05:21 IST

అమ్మభాషలో చదివితే ఆత్మవిశ్వాసం

 జాతీయ విద్యావిధానమే కీలకం : ప్రధానమంత్రి

దిల్లీ: మాతృభాషలో విద్యార్జన వల్ల ఆత్మవిశ్వాసం పెరుగుతుందని, విద్యార్థుల సామర్థ్యానికీ, ప్రతిభకూ న్యాయం జరుగుతుందని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ) కీలక అంశమని, తమ ఆకాంక్షలకు దేశం బాసటగా నిలుస్తోందన్న భరోసాను ఇది యువతకు కల్పిస్తోందని ఆయన చెప్పారు. ఎన్‌ఈపీ ఏడాది పూర్తిచేసుకున్న సందర్భంగా గురువారం ఏర్పాటుచేసిన కార్యక్రమంలో మోదీ వీడియో ద్వారా మాట్లాడారు. ‘‘జాతీయ విద్య నిజమైన అర్థంలో సార్థకం కావాలంటే... అది జాతీయ పరిస్థితులకు అద్దం పట్టాలని మహాత్మాగాంధీ అంటూ ఉండేవారు. జాతిపిత దూరదృష్టితో చేసిన ఆలోచనను నెరవేర్చేందుకే మాతృభాషలో విద్యా బోధన అంశాన్ని నూతన విద్యా విధానంలో చేర్చాం. దీనివల్ల దేశంలోని పేద, మధ్యతరగతి, గ్రామీణ, దళిత, ఆదివాసీ, వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుంది. ప్రారంభ విద్యలోనూ మాతృభాషను ప్రోత్సహించే పని ఆరంభమైంది. 8 రాష్ట్రాల్లోని 14 ఇంజినీరింగ్‌ కళాశాలలు... హిందీ, తమిళం, తెలుగు, మరాఠీ, బంగ్లా మాధ్యమాల్లో బోధనను ప్రారంభించడం నాకెంతో ఆనందం కలిగించింది. కృత్రిమ మేధ కార్యక్రమాన్ని ప్రారంభించాం. భావి అవసరాలకు, కృత్రిమ మేధ ఆధార ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా యువతను తీర్చిదిద్దేందుకు ఇది ఎంతగానో దోహదపడుతుంది. భవిష్యత్తులో మనం ఏ ఉన్నత శిఖరాలను చేరుకుంటామన్నది... ఇప్పుడు మన యువతకు ఎలాంటి విద్య అందిస్తున్నామన్న దానిపై ఆధారపడి ఉంటుంది. జాతి నిర్మాణ మహాయజ్ఞంలో ఎన్‌ఈపీ స్థానం సమున్నతమైనది. కరోనా విజృంభిస్తున్న సమయంలోనూ దశల వారీగా ఎన్‌ఈపీని అమలు చేయగలిగాం. దేశ యువతకు స్వేచ్ఛ కావాలి. దేశం పూర్తిగా వారితోనే ఉందన్న భరోసా కొత్త విద్యా విధానం వారికి కల్పిస్తోంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. అకడమిక్‌ బ్యాంక్‌ ఆఫ్‌ క్రెడిట్స్‌, నేషనల్‌ డిజిటల్‌ ఎడ్యుకేషన్‌ ఆర్కిటెక్చర్‌ వంటి కీలక ప్రాజెక్టులను ఈ సందర్భంగా మోదీ ప్రారంభించారు. కొత్త విద్యా విధానాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు ఉపాధ్యాయులు, ప్రధానాచార్యులు, విధాన రూపకర్తలు గత ఏడాదిగా ఎంతో శ్రమించారని కితాబిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్‌ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి కూడా పాల్గొన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన