పార్లమెంటు స్ఫూర్తికి భాజపా తూట్లు

ప్రధానాంశాలు

Updated : 30/07/2021 10:15 IST

పార్లమెంటు స్ఫూర్తికి భాజపా తూట్లు

 పెగాసస్‌పై విచారణకు సహకరించకపోవడంపై శశి థరూర్‌ అసంతృప్తి

దిల్లీ: పెగాసస్‌ కలకలంపై ప్రభుత్వ అధికారులను ప్రశ్నించకుండా ఐటీ వ్యవహారాల పార్లమెంటరీ స్థాయీ సంఘాన్ని భాజపా సభ్యులు బుధవారం అడ్డుకోవడంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నేత శశి థరూర్‌ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాలయాపనకు మాత్రమే పనికొచ్చే కమిటీగా స్థాయీ సంఘాన్ని కొన్ని శక్తులు చూస్తున్నాయంటూ ఆక్షేపించారు. అది పార్లమెంటు స్ఫూర్తికి తూట్లు పొడవటమేనని విమర్శించారు. ఐటీ వ్యవహారాల స్థాయీ సంఘానికి ఆయన నేతృత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు- తనపై భాజపా ఎంపీ నిశికాంత్‌ దుబె లోక్‌సభలో ఇచ్చిన సభాహక్కుల ఉల్లంఘన నోటీసు చెల్లదని థరూర్‌ పేర్కొన్నారు. నోటీసును ప్రవేశపెట్టడంలో ప్రామాణిక పద్ధతిని అవలంబించలేదని అన్నారు. దుబెను తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ మహువా మొయిత్రా ‘బిహార్‌ గూండా’గా విమర్శించారన్న వార్తలపై స్పందించేందుకు థరూర్‌ నిరాకరించారు. ‘‘జరగని సమావేశం గురించి నేనేం మాట్లాడగలను? మొయిత్రా అలా విమర్శించారన్న సంగతి నాకు ఏమాత్రం తెలియదు’’ అని గురువారం వ్యాఖ్యానించారు. థరూర్‌ వ్యాఖ్యలపై నిశికాంత్‌ దుబె స్పందిస్తూ.. కాంగ్రెస్‌ నేత తీవ్ర అసంతృప్తిలో ఉన్నారని అన్నారు. ఆయనకు పార్లమెంటు నిబంధనలపై అవగాహన లేదేమోనని పేర్కొన్నారు. లోక్‌సభలో అధీర్‌ రంజన్‌ చౌధురీ స్థానంలో ‘కాంగ్రెస్‌ పక్ష నేత’ హోదాను దక్కించుకోవడంపైనే ప్రస్తుతం థరూర్‌ దృష్టి ఉందని ఎద్దేవా చేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన