కొన్ని ప్రభుత్వాలకు పెగాసస్‌ నిలిపివేత!

ప్రధానాంశాలు

Published : 01/08/2021 05:55 IST

కొన్ని ప్రభుత్వాలకు పెగాసస్‌ నిలిపివేత!

  దుర్వినియోగ ఆరోపణలే కారణమన్న యూఎస్‌ మీడియా నివేదిక

వాషింగ్టన్‌: పలు దేశాల్లో రాజకీయ దుమారానికి కారణమైన పెగాసస్‌ గూఢచర్యం కుంభకోణంలో కేంద్ర బిందువైన ఇజ్రాయెల్‌ సైబర్‌ సెక్యూరిటీ కంపెనీ ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ కొన్ని ప్రభుత్వాలకు తన సేవలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు తెలిసింది. తామందించిన స్పైవేర్‌ సాంకేతికత దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలపై చేపట్టిన దర్యాప్తులో భాగంగానే కంపెనీ ఈ నిర్ణయం తీసుకొందని అమెరికా మీడియా నివేదిక ఒకటి వెల్లడించింది. పెగాసస్‌ స్పైవేర్‌ను భారత్‌ సహా పలు దేశాల్లోని పాత్రికేయులు, మానవహక్కుల ఉద్యమకారులు, రాజకీయనేతలపై నిఘాకు వినియోగించడంతో పాటు  వ్యక్తి గోప్యతకు విఘాతం కలిగిందనే ఆందోళనలు వ్యక్తమవుతున్న విషయం తెలిసిందే. ‘కొందరు క్లయింట్లకు తాత్కాలికంగా స్పైవేర్‌ సేవలను నిలిపివేశాం. వారిపై దర్యాప్తు కొనసాగుతోంది’అని పేరు వెల్లడించడానికి ఇష్టపడని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ ఉద్యోగి ఒకరు తెలిపారని అమెరికా మీడియా సంస్థ ఎన్‌పీఆర్‌ తన నివేదికలో పేర్కొంది. అయితే, ఏ ప్రభుత్వాలు, దేశాలు అనేది వెల్లడించలేదని తెలిపింది. పెగాసస్‌ స్పైవేర్‌ వివాదంతో ఇజ్రాయెల్‌ ప్రభుత్వంపై తీవ్ర ఒత్తిడి వచ్చిందని, దీంతో ఆ దేశ రక్షణ శాఖ ..ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌పై ఆంక్షల కొరడా ఝుళిపించిందని ఆ నివేదిక పేర్కొంది. టెల్‌ అవివ్‌లోని ఎన్‌ఎస్‌ఓ కార్యాలయంపై ఇజ్రాయెల్‌ అధికారులు తనిఖీలు చేపట్టారని, ప్రభుత్వ దర్యాప్తు అధికారులకు పూర్తిగా సహకరిస్తున్నామని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ అనుబంధ సంస్థ మెర్క్యురీ పబ్లిక్‌ అఫైర్స్‌ ఒక ప్రకటనలో తెలిపింది. పెగాసస్‌ స్పైవేర్‌కు 40 దేశాల్లో 60 సంస్థలు క్లయింట్లుగా ఉన్నాయని, అవన్నీ ఆయా దేశాలకు చెందిన నిఘా, దర్యాప్తు, సైనిక విభాగాలేనని ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ ఇటీవల వెల్లడించింది. అయితే, తాజా గూఢచర్య వివాదం తలెత్తడానికి ముందే సౌదీ అరేబియా, దుబాయ్‌, యూఏఈ, మెక్సికోకు చెందిన ప్రభుత్వ సంస్థలకు స్పైవేర్‌ సేవలను ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ నిలిపివేసిందని వాషింగ్టన్‌ పోస్ట్‌ పేర్కొంది. ఉగ్రవాదం, నేరాల కట్టడి ఉద్దేశంతోనే స్పైవేర్‌ను ప్రభుత్వాలకు అందజేస్తున్నట్లు ఎన్‌ఎస్‌ఓ గ్రూప్‌ చెబుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన