సైరస్‌ పూనావాలాకు తిలక్‌ జాతీయ పురస్కారం

ప్రధానాంశాలు

Updated : 01/08/2021 06:05 IST

సైరస్‌ పూనావాలాకు తిలక్‌ జాతీయ పురస్కారం

పుణె: టీకాల తయారీ సంస్థ సీరమ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా-పుణె ఛైర్మన్‌ డాక్టర్‌ సైరస్‌ పూనావాలా ఈ ఏడాదికి సంబంధించి ప్రతిష్ఠాత్మక లోకమాన్య తిలక్‌ జాతీయ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ మేరకు లోకమాన్య తిలక్‌ ట్రస్ట్‌ అధ్యక్షుడు దీపక్‌ తిలక్‌ ప్రకటన చేశారు. పురస్కారం కింద రూ.లక్ష నగదు, జ్ఞాపికతో సత్కరిస్తారు. ‘‘కొవిడ్‌-19 మహమ్మారి సమయంలో చేసిన కృషికిగాను పూనావాలాను సత్కరించనున్నాం. కొవిషీల్డ్‌ టీకాతో ఆయన అనేక మంది ప్రాణాలను కాపాడగలిగారు. కొవిషీల్డ్‌ టీకా కోట్లాది డోసులను సీరమ్‌ సంస్థ రికార్డు సమయంలో ప్రపంచానికి అందుబాటులోకి తెచ్చింది. సముచితమైన ధరలకు వివిధ రకాల టీకాలను అందించడంలో పూనావాలా ముందున్నారు’’ అని తిలక్‌ చెప్పారు. ఈ నెల 13న పురస్కార ప్రదానోత్సవం జరగనుంది. వాస్తవానికి ఏటా తిలక్‌ వర్ధంతి రోజైన ఆగస్టు 1న ఈ పురస్కార ప్రదానోత్సవం నిర్వహించేవారు. ఈ ఏడాది కరోనా మహమ్మారి నేపథ్యంలో 13వ తేదీకి వాయిదా వేశారు. 1983 నుంచి దేశంలో పలు రంగాల్లో విశేష సేవలందించే ప్రముఖులకు ఈ పురస్కారాన్ని ప్రదానం చేస్తున్నారు. సోషలిస్ట్‌ నేత ఎస్‌ఎం జోషి, మాజీ ప్రధానులు ఇందిర, అటల్‌ బిహారీ వాజ్‌పేయీ, మన్మోహన్‌ సింగ్‌, మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ, ఇన్ఫోసిస్‌ వ్యవస్థాపకుడు ఎన్‌.ఆర్‌.నారాయణమూర్తి ఈ అవార్డు అందుకున్న ప్రముఖుల్లో ఉన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన