పెగాసస్‌పై 5న సుప్రీం విచారణ

ప్రధానాంశాలు

Published : 02/08/2021 04:52 IST

పెగాసస్‌పై 5న సుప్రీం విచారణ

జస్టిస్‌ రమణ ఆధ్వర్యంలో ధర్మాసనం

దిల్లీ: పెగాసస్‌ స్పైవేర్‌ వ్యవహారంపై దాఖలైన వ్యాజ్యాలకు సంబంధించి ఈ నెల 5వ తేదీన సుప్రీంకోర్టు విచారణ జరపనుంది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం దీన్ని చేపట్టనుంది. ప్రముఖ పాత్రికేయులు ఎన్‌.రామ్‌, శశి కుమార్‌లు ఈ దావా వేశారు. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్‌ జడ్జితోగానీ, విశ్రాంత న్యాయమూర్తితోగానీ స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని కోరారు. శుక్రవారం ఈ దావాను సమర్పిస్తున్న సందర్భంగా సీనియర్‌ న్యాయవాది కపిల్‌ సిబల్‌ వాదనలు వినిపిస్తూ భావ స్వేచ్ఛను, అసమ్మతి వ్యక్తీకరణను అణచివేయడానికే ఈ నిఘా సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వంగానీ, సంస్థలుగానీ పెగాసస్‌ లైసెన్సును సంపాదించాయా? ప్రత్యక్షంగా గానీ, పరోక్షంగాగానీ ఎవరిపైన అయినా నిఘా పెట్టాయా వెల్లడించాల్సిందిగా కేంద్రాన్ని ఆదేశించాలని కూడా పిటిషన్‌లో కోరారు. వారితో పాటు న్యాయవాది ఎం.ఎల్‌.శర్మ, జాన్‌ బ్రిట్టస్‌లు కూడా ఇదే విషయమై మరో రెండు వ్యాజ్యాలు వేశారు. వీటన్నింటిపై సుప్రీంకోర్టు విచారణ జరపనుంది.

ఏవిధంగా రాజ్యాంగ విరుద్ధమంటే...
మిలటరీ గ్రేడ్‌ స్పైవేర్‌తో పౌరులపై నిఘా పెట్టడం రాజ్యాంగ విరుద్ధమని ఎన్‌.రామ్‌, శశికుమార్‌లు తమ దావాలో పేర్కొన్నారు. ఈ మేరకు రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులకు సంబంధించిన పలు అధికరణాలను ప్రస్తావించారు. 14వ అధికరణం ప్రసాదించిన చట్టం ముందు సమానత్వం, గోప్యత హక్కు.. 19వ అధికరణం కింద వాక్‌ స్వాతంత్య్రం, భావస్వేచ్ఛ.. 21వ అధికరణం ఇచ్చిన జీవన రక్షణ, వ్యక్తిగత స్వేచ్ఛలను ఉల్లంఘిస్తోందని తెలిపారు. ఇదే కాకుండా పెగాసస్‌ స్పైవేర్‌ ద్వారా ఫోన్లను హ్యాక్‌ చేయడం ఐటీ చట్టం ప్రకారం క్రిమినల్‌ నేరమని కూడా తెలిపారు. సంబంధిత సెక్షన్లను ఉదహరించారు..

* సెక్షన్‌ 66 : కంప్యూటర్‌ సంబంధిత నేరాలు

* సెక్షన్‌ 66బీ : చోరీకి గురయిన కంప్యూటర్‌ వనరులు, కమ్యూనికేషన్ల పరికరాలను అనైతికంగా తీసుకోవడం

* సెక్షన్‌ 66ఈ : గోప్యతను ఉల్లంఘించడం

* సెక్షన్‌ 66ఎఫ్‌ : సైబర్‌ ఉగ్రవాదానికి పాల్పడడం.. ఇవన్నీ నేరాలని, వీటికి తగిన శిక్షలను కూడా అందులో పేర్కొన్నారని తెలిపారు. ఈ నేరాలకు జైలు శిక్షతోపాటు జరిమానా విధిస్తారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన