రద్దయిన సెక్షన్‌ కింద కేసులా?

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:30 IST

రద్దయిన సెక్షన్‌ కింద కేసులా?

‘66ఏ’పై రాష్ట్రాలు, హైకోర్టులకు సుప్రీంకోర్టు నోటీసులు

దిల్లీ: ఐటీ చట్టంలోని 66ఏ సెక్షన్‌ను 2105లోనే రద్దు చేసినప్పటికీ, దాని కింద ఇంకా కేసులు నమోదు చేస్తుండడంపై సుప్రీంకోర్టు సోమవారం అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, హైకోర్టులకు నోటీసులు పంపించింది. ఇది పోలీసులు, న్యాయవ్యవస్థకు సంబంధించిన అంశం కావడంతో ఈ తరహా నోటీసులు పంపించినట్టు న్యాయమూర్తులు జస్టిస్‌ ఆర్‌.ఎఫ్‌.నారిమన్‌, జస్టిస్‌ బి.ఆర్‌.గవాయ్‌లతో కూడిన ధర్మాసనం తెలిపింది. నాలుగు వారాల్లో సమాధానం చెప్పాలని, కేసుల వివరాలు, అందుకు సంబంధించిన వాదనలను పొందుపరచాలని సూచించింది. రద్దయిన ఈ సెక్షన్‌ కింద ఇంకా కేసులు పెడుతున్నారంటూ దావా చేసిన పీపుల్స్‌ యూనియన్‌ ఫర్‌ సివిల్‌ లిబర్టీస్‌ (పీయూసీఎల్‌) తరఫున సీనియర్‌ న్యాయవాది సంజయ్‌ పారిఖ్‌ వాదనలు వినిపిస్తూ ఈ కేసుల నమోదులో పోలీసులతో పాటు న్యాయవ్యవస్థకూ పాత్ర ఉందని తెలిపారు. 2019 ఫిబ్రవరి 15న మరోసారి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ రద్దయిన సెక్షన్‌ కింద పోలీసు స్టేషన్లలో కేసులు నమోదు చేయడంతో పాటు, కింది కోర్టుల్లో విచారణలు జరుగుతున్నాయన్నారు.

న్యాయవ్యవస్థ వ్యవహారాలను తాము చూస్తామని చెప్పిన ధర్మాసనం హైకోర్టుల రిజిస్ట్రార్‌ జనరళ్లకు నోటీసులు ఇచ్చింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతా ప్రమాణ పత్రాన్ని సమర్పించారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును అమలు చేయాల్సిన ప్రాథమిక బాధ్యత రాష్ట్ర ప్రభుత్వాలదేనని ఇందులో కేంద్రం స్పష్టం చేసింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన