ముంబయి విమానాశ్రయం వద్ద ‘శివసేన’ హల్‌చల్‌

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:57 IST

ముంబయి విమానాశ్రయం వద్ద ‘శివసేన’ హల్‌చల్‌

ముంబయి: శివసేన కార్యకర్తలు ముంబయి ఛత్రపతి శివాజీ మహరాజ్‌ విమానాశ్రయం సమీపంలో సోమవారం వీరంగం సృష్టించారు. అక్కడి శివాజీ విగ్రహం వద్ద ఉన్న ఓ హోర్డింగ్‌ మీద ‘అదానీ ఎయిర్‌పోర్ట్‌’ అని ఉండడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిరసనగా హోర్డింగ్‌ను ధ్వంసం చేశారు. అనంతరం సమీపంలోని పశ్చిమ ఎక్స్‌ప్రెస్‌ హైవేపైకి ర్యాలీగా వచ్చారు. దీంతో ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది. వారిలో కొందరిని అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేయనున్నట్లు చెప్పారు. ముంబయి విమానాశ్రయ నిర్వహణ బాధ్యతలను జీవీకే గ్రూప్‌ నుంచి తాము దక్కించుకున్నట్లు అదానీ సంస్థ గత నెలలో ప్రకటించింది. ఈ క్రమంలో అదానీ ఎయిర్‌పోర్ట్‌ హోల్డింగ్స్‌ లిమిటెడ్‌ పేరును అక్కడి హోర్డింగ్‌పై ఉంచడం వివాదానికి దారి తీసింది. దీనిపై అదానీ సంస్థ స్పందించింది. ఛత్రపతి శివాజీ పేరిట ఉన్న విమానాశ్రయం పేరును తాము మార్చలేదని స్పష్టం చేసింది. ఎయిర్‌పోర్ట్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా నిబంధనలకు అనుగుణంగానే అక్కడ హోర్డింగ్‌పై అదానీ బ్రాండ్‌ పేరును ప్రదర్శించినట్లు పేర్కొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన