మైనార్టీలను బలహీన వర్గాలుగా గుర్తించాలి

ప్రధానాంశాలు

Published : 03/08/2021 05:57 IST

మైనార్టీలను బలహీన వర్గాలుగా గుర్తించాలి

సుప్రీంకోర్టుకు ఎన్‌సీఎం సూచన

దిల్లీ: దేశంలోని మైనార్టీలను బలహీన వర్గాలుగా గుర్తించాలని జాతీయ మైనార్టీ కమిషన్‌ (నేషనల్‌ కమిషన్‌ ఫర్‌ మైనార్టీస్‌- ఎన్‌సీఎం) సుప్రీంకోర్టును కోరింది. మెజార్టీ వర్గీయుల ప్రాబల్యం అధికంగా ఉన్నందున ఈ ఏర్పాటు అవసరమని తెలిపింది. రాజ్యాంగ పరమైన రక్షణలు ఉన్నప్పటికీ అసమానత, వివక్షకు గురవుతున్నామన్న భావన మైనార్టీల్లో ఉన్నందున రాజ్యాంగంలోని 46వ అధికరణానికి అనుగుణంగా ఈ గుర్తింపు ఇస్తే మంచిదని పేర్కొంది. ఈ మేరకు 40 పేజీల ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. మైనార్టీలకు ప్రత్యేకంగా సంక్షేమ పథకాలు అమలు చేయడం రాజ్యాంగ విరుద్ధమని పేర్కొంటూ నీరజ్‌ శంకర్‌ సక్సేనా, మరో అయిదుగురు ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు. దీనివల్ల మెజార్టీ మతంలో జన్మించి నష్టపోతున్నామన్న భావన హిందువుల్లో కలుగుతోందని అభిప్రాయపడ్డారు. మతప్రాతిపదికన సంక్షేమ పథకాలను అమలు చేయకూడదని కోరారు. దీనికి సమాధానంగానే ఎన్‌సీఎం ప్రమాణ పత్రాన్ని సమర్పించింది. సమాజంలో మైనార్టీలను సమ్మిళితం చేయడానికే ప్రభుత్వం సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని పేర్కొంది. మైనార్టీల కోసం పథకాల అమలు చట్టవ్యతిరేకమేమీ కాదని కేంద్ర ప్రభుత్వం తన ప్రమాణ పత్రంలో తెలిపింది. అసమానతలు తగ్గించడానికే వీటిని అమలు చేస్తున్నామని, దీనివల్ల హిందువుల హక్కులను నష్టం జరగడం లేదని స్పష్టం చేసింది. మైనార్టీల్లోని బాగా వెనుకబడిన వారి కోసమే వీటిని అమలు చేస్తున్నందున తప్పుపట్టాల్సిందేమీ లేదని వివరించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన