దళిత బాలిక హత్యాచారంపై రాజకీయ దుమారం

ప్రధానాంశాలు

Published : 05/08/2021 04:53 IST

దళిత బాలిక హత్యాచారంపై రాజకీయ దుమారం

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాహుల్‌ గాంధీ
కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని మండిపడిన భాజపా  

దిల్లీ: నైరుతి దిల్లీలో తొమ్మిదేళ్ల దళిత బాలికపై అత్యాచారం, హత్య ఘటన రాజకీయ దుమారం రేపుతోంది. బుధవారం కాంగ్రెస్‌ సీనియర్‌ నేత, ఆ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ బాలిక తల్లిదండ్రులను పరామర్శించారు. చిన్నారి కుటుంబానికి న్యాయం లభించేవరకు వారికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ‘‘న్యాయం జరిగే వరకు రాహుల్‌గాంధీ అండగా ఉంటాడని వారికి చెప్పాను. అప్పటివరకు ఒక్క అంగుళం వెనక్కి తగ్గేది లేదు’’ అని రాహుల్‌ అన్నారు. అనంతరం బాలిక తల్లిదండ్రులను తాను పరామర్శిస్తున్న ఫొటోను ట్విటర్‌లో పోస్ట్‌ చేశారు. దీనిపై జాతీయ బాలల హక్కుల కమిషన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. పోక్సో చట్టం ప్రకారం ఇలా బాధితురాలి గుర్తింపును వెల్లడిచేసే ఫొటోలను బహిర్గతం చేయడం నేరమని పేర్కొంది. దీనిపై ట్విటర్‌ చర్య తీసుకోవాలని, ఆ ఫొటోను తొలగించాలంటూ ఫిర్యాదు చేసింది. కాంగ్రెస్‌ రాజకీయం చేస్తోందని భాజపా మండిపడింది. 

రూ.10 లక్షల పరిహారం
అత్యాచారం, హత్య ఘటనపై మెజిస్టీరియల్‌ దర్యాప్తునకు దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదేశించారు. బాధిత కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ప్రకటించారు. ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టులో విచారణ చేసి, దోషులను కఠినంగా శిక్షించాలని విశ్వహిందూపరిషత్‌ డిమాండ్‌ చేసింది. దిల్లీలోని పాత నంగాల్‌ ప్రాంతంలో ఆదివారం ఉదయం తొమ్మిదేళ్ల చిన్నారి తాము నివాసం ఉంటున్న ఇంటి ఎదురుగా ఉన్న శ్మశానంలోని వాటర్‌ కూలర్‌ నుంచి నీళ్లు తెచ్చుకునేందుకు వెళ్లింది. తర్వాత కాటికాపరి రాధేశ్యామ్‌.. మరో ముగ్గురు వ్యక్తులు కలిసి ఆమెపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. విద్యుత్‌ షాక్‌ తగిలి, బాలిక మరణించిందని బాధితురాలి తల్లికి తర్వాత తెలిపారు. పోలీసులకు సమాచారమిస్తే ఇబ్బందులు ఎదురవుతాయని, పోస్టుమార్టం సమయంలో అవయవాలు దొంగలిస్తారని భయపెట్టి అంత్యక్రియలను హడావుడిగా జరిపించేశారు. రాధేశ్యామ్‌ తీరుపై అనుమానం వచ్చిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ బిడ్డపై అత్యాచారం జరిగిందని, దోషులను శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ ఘటనపై దిల్లీ మహిళా కమిషన్‌ విచారణ ప్రారంభించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన