హైజాక్‌ గురయిన నౌక విడుదల

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:24 IST

హైజాక్‌ గురయిన నౌక విడుదల

పాల్పడింది ఇరాన్‌ సాయుధులు  
ఆదుకున్న బ్రిటిష్‌ నేవీ

దుబాయ్‌: ఒమన్‌ సముద్రంలో హైజాక్‌ గురయిన నౌక బుధవారం సురక్షితంగా ఒడ్డుకు చేరుకుంది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌లోని ఫుజైరాహ్‌ నౌకాశ్రయం నుంచి మంగళవారం అస్ఫాల్ట్‌ (తారులాంటి పదార్థం) లోడుతో బయలుదేరిన ‘అస్ఫాల్ట్‌ క్వీన్‌’ నౌకను రాత్రి హైజాకర్లు స్వాధీనం చేసుకొని, తరువాత విడిచిపెట్టారు. ఒమన్‌ దేశ అధికార వర్గాల సమాచారం ప్రకారం.. మంగళవారం సాయంత్రం ఫుజైరాహ్‌ నౌకాశ్రయం నుంచి ఆరు చమురు ట్యాంకర్లు బయలుదేరాయి. వాటి ప్రయాణాన్ని ఎప్పటికప్పుడు గుర్తించడానికి ‘ఆటోమేటిక్‌ ఐడెంటిఫికేషన్‌ సిస్టం’ అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఏర్పాటు చేశారు. కొద్ది సమయం గడిచిన తరువాత ‘అదుపులో లేవు’ (నాట్‌ అండర్‌ కమాండ్‌) అన్న సమాచారం వచ్చింది. దాంతో అనుమానించిన అధికారులు అప్రమత్తమయ్యారు. బ్రిటన్‌ నేవీకి సమాచారం అందించారు. మరోవైపు పనామా దేశ జెండాతో వెళ్తున్న ‘అస్ఫాల్ట్‌ క్వీన్‌’ నౌకపైకి ఒమన్‌ దేశ జలాల్లో కొందరు ఆగంతుకులు ఎక్కి కాల్పులు జరిపారు. ఉపగ్రహాలతో పరిశీలించినప్పుడు బుధవారం వేకువజాము సమయంలో ఇరాన్‌ దేశంలోని జాస్క్‌ తీరం వైపు ఆ నౌక వెళ్తుండడం కనిపించింది. బ్రిటన్‌ నేవీకి చెందిన నిఘా విమానం, నౌకలు రంగంలో దిగి తగిన చర్యలు తీసుకున్న కారణంగా కొన్ని గంటల అనంతరం అది ఒమన్‌ తీరం వైపు వెళ్లడాన్ని గమనించారు. హైజాకర్లు వెళ్లిపోయారని, నౌక సురక్షితంగా ఉందని బ్రిటన్‌ అధికారులు ప్రకటించారు. ఈ నౌక ఎమిరేట్స్‌కు చెందిన గ్లోరీ ఇంటర్నేషనల్‌ సంస్థకు చెందినది కావడం గమనార్హం. ఇరాన్‌కు చెందిన సాయుధ దుండగుడు ఒకడు ట్యాంకర్‌పై కాల్పులు జరుపుతున్నాడంటూ ఆ నౌకకు చెందిన ఉద్యోగి ఒకరు చెబుతుండడం రికార్డయింది. నౌకపైకి అయిదారుగురు వచ్చినట్టు కూడా రికార్డులో ఉంది. అయితే ఈ హైజాక్‌లో తమకెలాంటి సంబంధం లేదని ఇరాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి స్పష్టం చేశారు. ఇటీవలే ఈ ప్రాంతంలో ఇజ్రాయెల్‌ కుబేరునికి చెందిన ఆయిల్‌ ట్యాంకర్‌పై డ్రోన్ల దాడి జరగడంతో ఇద్దరు మరణించారు. అప్పుడు కూడా ఇరాన్‌పై అనుమానాలు వ్యక్తం కాగా, ఆయన ఖండించారు. ఇరాన్‌పై అమెరికా ఆర్థిక ఆంక్షలు విధించిన దగ్గర నుంచి ఈ ప్రాంతంలో నౌకలపై దాడులు జరుగుతుండడంతో ఆందోళన వ్యక్తమవుతోంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన