సంపన్న దేశాలకూ సుర్రు‘మంట’ది!

ప్రధానాంశాలు

Published : 05/08/2021 05:35 IST

సంపన్న దేశాలకూ సుర్రు‘మంట’ది!

వాషింగ్టన్‌: భౌగోళిక మార్పుల కారణంగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలతో గతంలో ఎన్నడూ వీటి పరిణామాలను చవిచూడని సంపన్న దేశాలు సైతం ఇబ్బందులు పడే ప్రమాదం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచంలో ఆర్థికంగా సుసంపన్న దేశాలుగా పేరున్న అమెరికా, కెనడా, జర్మనీ, బెల్జియం ఈ జాబితాలో చేరవచ్చని వారు చెబుతున్నారు. ‘ఇప్పుడిది పేద దేశాల సమస్య కాదు. నూటికి నూరుపాళ్లు సంపన్న దేశాల సమస్య’ అని బెల్జియంకు చెందిన అంతర్జాతీయ విపత్తు సమాచార ఆధారిత సంక్రమిత రోగశాస్త్ర పరిశోధన కేంద్రం వ్యవస్థాపకురాలు డెబ్బి గుహ-సపిర్‌ వ్యాఖ్యానించారు. ఇటీవల భారీ వరదలు చైనాను ముంచెత్తగా.. అటు జర్మనీ, బెల్జియంలలోనూ వందలాది జనం ముంపునకు గురైన విషయం తెలిసిందే. ఇటు కెనడా, అమెరికాలోని కొన్ని ప్రాంతాల్లోనూ ప్రమాద సంకేతాలు అందుతున్నాయి. దీనికితోడు కాలుతున్న అడవులు కూడా ఆజ్యం పోస్తున్నాయి. దక్షిణ యూరప్‌ ప్రాంతం ప్రస్తుతం విపరీతమైన ఉష్ణోగ్రతలతో వేడెక్కుతోంది. ఇది ఆరంభం మాత్రమేనని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అమెరికాలో తరచూ వచ్చే తుపాన్లకు పై పరిస్థితులు కూడా తోడైతే మిగిలేది విధ్వంసమే అని వీరు అంటున్నారు. 2000 సంవత్సరం నుంచి వచ్చిన వరదలపై ఉపగ్రహ చిత్రాల ఆధారంగా జరిపిన ఓ తాజా అధ్యయనం ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా వరదల తీవ్రత కారణంగా ఇబ్బందులు పడే ప్రజల సంఖ్య పది రెట్లకు (34%) పెరిగింది. గుహ-సపిర్‌ (బెల్జియం) ఈ పరిణామాలపై మాట్లాడుతూ.. ఆకస్మిక వరదలు, అటవీ దహనాల కంటే ఇపుడు వడగాలుల తీవ్రత పై దేశాలకు ప్రధాన సమస్యగా మారనుందని చెప్పారు. ‘పాశ్చాత్య దేశాలకు ఇది పెద్ద సవాలు. వడగాలుల కారణంగా ప్రధానంగా ఇబ్బంది పడేది పెద్దవయసు వ్యక్తులే. యూరప్‌లో వీరి సంఖ్య ఎక్కువ’ అన్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన