పాక్‌లో ప్రార్థన మందిరంపై దాడి

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

పాక్‌లో ప్రార్థన మందిరంపై దాడి

లాహోర్‌/దిల్లీ: పాకిస్థాన్‌లోని పంజాబ్‌ ప్రావిన్స్‌ రహీంయార్‌ ఖాన్‌ జిల్లా.. భోంగ్‌ నగరంలో మతోన్మాదులు ఓ ప్రార్థన మందిరంపై దాడి చేసి విగ్రహాలు ధ్వంసం చేశారు. ఈ దాడిని దుండగులు ఫేస్‌బుక్‌లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. విగ్రహాల ధ్వంసం తర్వాత మందిరంలోని కొంత భాగానికి నిప్పు పెట్టారు. పరిసర ప్రాంతాల్లో నివసిస్తున్న కొన్ని మైనారిటీ  కుటుంబాలపై దాడికి దిగారు. బుధవారం జరిగిన ఈ సంఘటన వీడియోను పాక్‌లోని హిందూ మండలి అధ్యక్షుడు రమేశ్‌ వాన్‌కానీ తన ట్విటర్‌ ఖాతాలో పెట్టారు. ఇంత  జరుగుతున్నా స్థానిక పోలీసులు పట్టించుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించాలని పాక్‌ ప్రధాన న్యాయమూర్తికి విజ్ఞప్తి చేశారు. గత వారం ఎనిమిదేళ్ల బాలుడు.. స్థానిక మత పాఠశాలలోని గ్రంథాలయంలో మూత్రం పోయడంతో ఈ ఉద్రిక్తతలు తలెత్తాయని పోలీసులు చెబుతున్నారు. జిల్లా పోలీస్‌ అధికారి అసద్‌ సర్ఫరాజ్‌ మాట్లాడుతూ.. స్థానికంగా నివసిస్తున్న వంద కుటుంబాలకు రక్షణ కల్పించామని తెలిపారు. కాగా, ఈ దాడిని పాక్‌ ప్రధాని ఇమ్రాన్‌ఖాన్‌ ఖండించారు.

పాక్‌ దౌత్యాధికారి ఎదుట భారత్‌ నిరసన

ఈ విధ్వంసంపై భారత్‌ తీవ్రంగా స్పందించింది. పాక్‌లోని మైనారిటీల మతస్వేచ్ఛపై వరుస దాడులు జరుగుతున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని పేర్కొంది. తాజా దాడికి కారకులైన దుండగులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది. భారత్‌లోని పాక్‌ తాత్కాలిక దౌత్యాధికారిని పిలిపించి.. తీవ్ర నిరసన వ్యక్తం చేసినట్లు విదేశీ వ్యవహారాల శాఖ ప్రతినిధి అరిందమ్‌ బాగ్చీ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన