భారత్‌పై బ్రిటన్‌ ఆంక్షల సడలింపు

ప్రధానాంశాలు

Published : 06/08/2021 05:36 IST

భారత్‌పై బ్రిటన్‌ ఆంక్షల సడలింపు

ప్రయాణికులకు హోటల్‌ క్వారంటైన్‌ నుంచి మినహాయింపు

లండన్‌: భారత్‌ నుంచి తమ దేశానికి వచ్చే ప్రయాణికులపై విధించిన ఆంక్షలను బ్రిటన్‌ తాజాగా సడలించింది. టీకా రెండు డోసులు వేయించుకొని వస్తే.. 10 రోజుల పాటు తప్పనిసరిగా హోటల్‌లోనే క్వారంటైన్‌లో ఉండాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. ఇళ్లలో క్వారంటైన్‌లో ఉంటే సరిపోతుందని తెలిపింది. ఈ మేరకు ప్రయాణ ఆంక్షల విషయంలో భారత్‌ను ‘ఎరుపు’ నుంచి ‘జేగురు’ రంగు జాబితాలోకి మార్చింది. యూఏఈ, ఖతార్‌, బహ్రెయిన్‌లకూ ఇదే వెసులుబాటును కల్పించింది. తాజా సడలింపులు ఈ నెల 8 నుంచి అమల్లోకి వస్తాయని బ్రిటన్‌ రవాణా శాఖ మంత్రి గ్రాంట్‌ షాప్స్‌ ట్విటర్‌ వేదికగా గురువారం వెల్లడించారు. ఆయా దేశాల్లో మహమ్మారి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో ఆంక్షలను సడలించినట్లు తెలిపారు.

బ్రిటన్‌ నిబంధనల ప్రకారం.. ‘జేగురు’ జాబితాలోని దేశాల నుంచి వచ్చే ప్రయాణికులు టీకా రెండు డోసులు వేసుకొని ఉండాలి. తమ ప్రయాణ ప్రారంభానికి మూడు రోజుల ముందు తప్పనిసరిగా కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. ‘నెగెటివ్‌’ వస్తేనే ప్రయాణాన్ని అనుమతిస్తారు. ఇంగ్లాండ్‌కు వెళ్లాక రెండుసార్లు కరోనా నిర్ధారణ పరీక్ష చేసుకునేందుకు వీలుగా ముందుగానే బుకింగ్‌ పూర్తిచేసుకోవాలి. ఆ దేశానికి చేరుకున్నాక ఇంట్లో లేదా ఎంచుకున్న మరేదైనా ప్రాంతంలో 10 రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండాలి. క్వారంటైన్‌లో ఉన్నప్పుడు తొలి రెండు రోజుల్లో ఒకసారి కొవిడ్‌ పరీక్ష చేయించుకోవాలి. 8వ రోజు లేదా ఆ తర్వాత మరోసారి పరీక్ష తప్పనిసరి. వయసు 18 ఏళ్లలోపు ఉండి.. బ్రిటన్‌లో లేదంటే బ్రిటన్‌ టీకా కార్యక్రమానికి అనుగుణంగా ఇప్పటికే రెండు డోసులు వేయించుకొని ఉంటే క్వారంటైన్‌ నుంచి మినహాయింపు లభిస్తుంది. కొవిషీల్డ్‌ వ్యాక్సిన్‌ వేయించుకున్నవారికీ ఈ విషయంలో ఊరట లభించే అవకాశాలున్నాయి. మరోవైపు- జర్మనీ, ఆస్ట్రియా, స్లొవేనియా, స్లొవేకియా, లాత్వియా, రొమేనియా, నార్వే, ఫ్రాన్స్‌లను ‘జేగురు’ నుంచి ‘ఆకుపచ్చ’ జాబితాలోకి బ్రిటన్‌ మార్చింది. ఇకపై ఈ దేశాల నుంచి ఇంగ్లాండ్‌కు వచ్చేవారు క్వారంటైన్‌లో ఉండనవసరం లేదు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన