పార్లమెంటు స్తంభించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

ప్రధానాంశాలు

Updated : 06/08/2021 05:56 IST

పార్లమెంటు స్తంభించడాన్ని ప్రజలు ప్రశ్నిస్తున్నారు

 సమాధానాలు వినకుండా నినాదాలిస్తే ఎలా?: ఓం బిర్లా

కొనసాగిన వాయిదాల పర్వం

ఒలింపిక్స్‌ విజేతల్ని అభినందించిన లోక్‌సభ

దిల్లీ: కోట్లాది రూపాయలు ఖర్చవుతున్నా.. పార్లమెంటులో కార్యకలాపాలు ఎందుకు సాగడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారని లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా చెప్పారు. అవకాశం ఇచ్చినప్పుడు ప్రశ్నలు అడగకుండా, సమాధానాలు వినిపించుకోకుండా పలువురు సభ్యులు నినాదాలు ఇవ్వడాన్ని ఆయన తప్పుపట్టారు. ఫోన్లపై నిఘా విధించడానికి పెగాసస్‌ స్పైవేర్‌ను వాడిందీ లేనిదీ ప్రభుత్వం చెప్పాలని డిమాండ్‌ చేస్తూ విపక్షాలు పార్లమెంటులో ఆందోళన కొనసాగించడంతో గురువారం కూడా కార్యకలాపాలు స్తంభించిపోయాయి. కొన్ని బిల్లుల్ని ఉభయ సభలు ఆమోదించాయి. లోక్‌సభ స్వల్ప విరామాలతో నాలుగుసార్లు, రాజ్యసభ మూడుసార్లు వాయిదా పడాల్సి వచ్చింది. ఉదయం లోక్‌సభలో ప్రశ్నోత్తరాలు మొదలైనప్పుడు విపక్షాలు గళమెత్తాయి. పెగాసస్‌ నిఘా, నూతన వ్యవసాయ చట్టాలు వంటి అంశాలను నిరసిస్తూ విపక్ష ఎంపీలు సభాపతి స్థానం వద్దకు వెళ్లి నినాద ఫలకాలు ప్రదర్శించారు. దీనిని స్పీకర్‌ తప్పుపట్టారు. ఇది పార్లమెంటు సంప్రదాయాలకు తగ్గట్టుగా లేదన్నారు. దిల్లీలో దళిత బాలికపై హత్యాచారం ఘటనపై సభలో కొద్దిసేపు అధికార, విపక్షాల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది.

నారీశక్తిని చాటిన క్రీడామణులు

సాయంత్రం చివరిసారిగా వాయిదా పడినప్పుడు సభాపతి స్థానంలో ఉన్న రమాదేవి మాట్లాడుతూ సభలో అవాంతరాలను చూసి ప్రజలు ఏమనుకుంటారో ఒక్కసారి ఆలోచించాలని విజ్ఞప్తి చేశారు. సభ్యులంతా తమతమ స్థానాలకు వెళ్లాలని సూచించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించిన క్రీడాకారిణులను, భారత హాకీ జట్టును సభ తరఫున లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా అభినందించారు. క్రీడాకారిణులు పతకాలు సాధించి నారీశక్తిని చాటారని కొనియాడారు. విపక్షాలు తమ డిమాండ్లపై చర్చకు పట్టుపట్టడంతో రాజ్యసభ కూడా పలుమార్లు వాయిదా పడింది. తృణమూల్‌ ఎంపీల సస్పెన్షన్‌పై జరిగిన ఆందోళనలో అద్దాల తలుపును పగులగొట్టడం తీవ్రంగా ఖండించదగ్గ విషయమని డిప్యూటీ ఛైర్మన్‌ హరివంశ్‌ అన్నారు.

* రక్షణ రంగంలో అత్యవసర సేవల బిల్లును రాజ్యసభ ఆమోదించింది. శాంతియుత నిరసనలు తెలిపే హక్కుకు ఈ బిల్లు అడ్డంకి కాదని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ చెప్పారు. ఇదివరకే లోక్‌సభ దీనిని ఆమోదించింది. పన్ను చట్టాల సవరణ బిల్లును ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ లోక్‌సభలో ప్రవేశపెట్టారు.

గొంతు నొక్కాలని చూసినా గళం వినిపిస్తాం: ఖర్గే

వివిధ అంశాలపై చర్చించాలని ప్రయత్నిస్తున్న తమ గొంతును నొక్కేందుకు ప్రభుత్వం ప్రయత్నించినా గళం వినిపించడాన్ని ఆపేది లేదని రాజ్యసభ విపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గే స్పష్టం చేశారు. ఎవరెవరిపై నిఘా విధించారనేది అనేక మలుపులు తిరుగుతోందని, చర్చ నుంచి ప్రభుత్వం తప్పించుకోవాలని చూస్తోందని విలేకరుల సమావేశంలో ఆయన ఆరోపించారు. నెపాన్ని తమపైకి నెడుతున్నా, విపక్షాన్ని ప్రభుత్వం తరఫున ఎవరూ ఎందుకు సంప్రదించడం లేదని ప్రశ్నించారు. గంటలో 10 బిల్లుల్ని ఆమోదించారంటే ప్రభుత్వ ఉద్దేశమేమిటో అర్థం చేసుకోవచ్చని చెప్పారు. యూపీఏ హయాంలో 90% అవాంతరాలకు విపక్ష భాజపా కారణమయ్యేదని గుర్తుచేశారు. ప్రస్తుత పార్లమెంటు సమావేశాల నుంచి అందరినీ బయటకు పంపించేసి సభను నడపాలనుకుంటున్నారని ఆరోపించారు.

ట్యాపింగ్‌కు ఆధారాల్లేవు: భాజపా

ఫోన్ల ట్యాపింగ్‌ జరిగిందంటూ కాంగ్రెస్‌ సహా విపక్షం చేస్తున్న ఆరోపణలకు ప్రాథమిక ఆధారాల్లేవని భాజపా తిప్పికొట్టింది. పెగాసస్‌ సహా ఏ అంశంపైనైనా అర్థవంతమైన చర్చకు తమ పార్టీ సిద్ధంగా ఉందని భాజపా సీనియర్‌ నేత రవిశంకర్‌ ప్రసాద్‌ విలేకరులకు చెప్పారు. ఐ.టి. మంత్రిని వివరణ అడిగే బదులు పత్రాలను విపక్షాలు చించివేశాయని చెప్పారు. పార్లమెంటు విలువలను అతి తక్కువగా గౌరవించడమే కాంగ్రెస్‌ నైజమని ఎద్దేవా చేశారు. ఒక కుటుంబ ప్రయోజనాన్ని కాపాడడమే ఆ పార్టీ లక్ష్యమని, అదొక ప్రైవేటు సంస్థ లాంటిదని అన్నారు. నరేంద్ర మోదీ ప్రధాని కావడాన్ని, ఆయన నేతృత్వంలో భాజపా విజయాలు సాధిస్తుండడాన్ని కాంగ్రెస్‌ జీర్ణించుకోలేకపోతోందని చెప్పారు. యూపీఏ డజన్ల కొద్దీ బిల్లుల్ని చర్చ లేకుండానే ఆమోదించిందని గుర్తుచేశారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన