వైద్యుడే వీర్యదాత!

ప్రధానాంశాలు

Published : 16/09/2021 05:16 IST

వైద్యుడే వీర్యదాత!

నిజం దాచారంటూ కోర్టుకెక్కిన ‘తనయ’

ఆమెకు మరో 9 మంది మారు తోబుట్టువులు

న్యూయార్క్‌: తన తల్లిని గర్భవతిని చేసేందుకు.. అనామక దాతల నుంచి సేకరించిన వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని ఉపయోగించాడంటూ ఓ వైద్యుడిపై న్యూయార్క్‌కు చెందిన మహిళ (35) కోర్టులో వ్యాజ్యం దాఖలు చేశారు. దాదాపు నలభై ఏళ్ల కిందట ఆ వ్యవహారం జరిగింది. డాక్టర్‌ మోరిస్‌ వోర్ట్‌మన్‌ అనే వైద్యుడు ఇలాగే పలువురి కేసుల్లోనూ సొంత వీర్యాన్ని ఉపయోగించి గర్భం వచ్చేలా చేశాడని ఆమె తాజా ఫిర్యాదులో ఆరోపణలు చేశారు. 1980ల ప్రాంతంలో రోచెస్టర్‌కు చెందిన మోరిస్‌ వోర్ట్‌మన్‌ అనే వైద్యుడు.. ఫిర్యాది తల్లికి గర్భధారణ చికిత్స చేశారు. స్థానిక వైద్య విద్యార్థి వీర్యాన్ని చికిత్సలో ఉపయోగించానని వైద్యుడు అప్పట్లో తెలిపాడు. నిజానికి అది మోరిస్‌ సొంత వీర్యమేనని ఇప్పుడు ఆ మహిళ కుమార్తె ఆరోపిస్తున్నారు. మరో విశేషం ఏమిటంటే.. ఫిర్యాదు చేసిన మహిళ ప్రస్తుతం అదే వైద్యుడి వద్ద గైనకాలజీ చికిత్స తీసుకొంటున్నారు. 1985లో తాను జన్మించినట్లు ఆమె పేర్కొన్నారు. డీఎన్‌ఏ జీనియాలజీ (వంశంలోని వ్యక్తులను గుర్తించే  పరీక్ష) చేయించుకుంటే విషయం బయటపడిందని, తనకు ఇంకా 9 మంది మారు తోబుట్టువులు ఉన్నట్లు కూడా తేలిందని చెప్పారు. ఈ వ్యవహారంపై వైద్యుడు వోర్ట్‌మన్‌ కిమ్మనలేదు. ఆయన తరఫున మాట్లాడే న్యాయవాది వివరాలు సైతం వైద్యుడి కార్యాలయం వెల్లడించలేదు. గత కొన్నేళ్లుగా ఇలాంటి ఘటనలు 20కి పైగా వెలుగులోకి వచ్చాయి. దాతల వీర్యం కాకుండా, సొంత వీర్యాన్ని చికిత్సలో ఉపయోగిస్తున్నారని కొందరు వైద్యులపై ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. యూఎస్‌లోని నెవాడాలో జరిగిన ఇలాంటి ఉదంతంపై హెచ్‌బీవో ఛానల్‌లో ‘బేబీ గాడ్‌’ అనే డాక్యుమెంటరీ సైతం వచ్చింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన