క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు రోదసి నుంచి సాంత్వన

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:51 IST

క్యాన్సర్‌ బాధిత చిన్నారులకు రోదసి నుంచి సాంత్వన

అంతరిక్ష యాత్రికురాలి మాటామంతి

కేప్‌ కెనావెరాల్‌: స్పేస్‌ఎక్స్‌ సంస్థకు చెందిన వ్యోమనౌకలో భూకక్ష్యలోకి చేరిన నలుగురు అంతరిక్ష యాత్రికులు పుడమికి సంబంధించిన అద్భుత దృశ్యాలను వీక్షిస్తున్నారు. క్యాన్సర్‌ బారినపడ్డ చిన్నారుల్లో స్ఫూర్తి నింపుతున్నారు. ‘ఇన్‌స్పిరేషన్‌4’ యాత్రలో భాగంగా క్రూ డ్రాగన్‌ కాప్స్యూల్‌లో బుధవారం రాత్రి అమెరికా నుంచి బయల్దేరిన ఈ పర్యాటకులు 585 కిలోమీటర్ల ఎత్తులోని కక్ష్యలోకి చేరారు. ఈ వ్యోమనౌక రోజుకు 15 సార్లు భూమి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అమెరికాకు చెందిన అతికొద్ది మంది వ్యోమగాములు మాత్రమే ఈ ఎత్తుకు చేరారు. ‘ఇన్‌స్పిరేషన్‌4’ యాత్రికులు సుశిక్షిత వ్యోమగాములు కాదు. సాధారణ పౌరులే. వీరిలో హేలీ ఆర్సినో తాజాగా అమెరికాలోని సెయింట్‌ జూడ్‌ పిల్లల ఆసుపత్రిలోని క్యాన్సర్‌ బాధిత చిన్నారులతో మాట్లాడారు. చిన్నతనంలో క్యాన్సర్‌ బారినపడ్డ ఆమె.. అదే ఆసుపత్రిలో చికిత్స చేయించుకొని, కోలుకున్నారు. ఇప్పుడు అక్కడే వైద్య సహాయకురాలిగా పనిచేస్తున్నారు. రోదసి నుంచి మాట్లాడినప్పుడు క్యాన్సర్‌ బాధిత చిన్నారులు తనపై ప్రశ్నల వర్షం కురిపించారని ఆమె తాజాగా ట్వీట్‌ చేశారు. బాలల గేయాల్లో వర్ణించినట్లుగా చందమామపై ఆవులు ఉన్నాయా అని వారు ఆరా తీసినట్లు చెప్పారు. పదేళ్ల వయసులో క్యాన్సర్‌ చికిత్స కారణంగా తలపై వెంట్రుకలను పూర్తిగా కోల్పోయిన స్థితిలో ఉన్నప్పటి తన ఫొటోను ఆమె చూపారు. రోదసిలో ఉండే భారరహిత స్థితి కారణంగా తన జుట్టు తేలియాడుతున్న దృశ్యాలను ఈ చిన్నారులు వీక్షించాలని, తద్వారా వారిలో ఆశ చిగురించాలని తాను కోరుకుంటున్నట్లు అంతరిక్ష యాత్రకు బయలుదేరడానికి ముందు ఆర్సినో చెప్పారు. మరోవైపు.. భవిష్యత్‌లో ఎవరైనా రోదసిలోకి వెళ్లగలిగే పరిస్థితులను కల్పించడానికి ఈ యాత్ర తోడ్పడుతుందని స్పేస్‌ఎక్స్‌ సంస్థ వ్యవస్థాపకులు ఎలాన్‌ మస్క్‌ తెలిపారు. అంతకుముందు కక్ష్యలోని యాత్రికులతో ఆయన మాట్లాడారు. బిలియనీరు జేర్డ్‌ ఇజాక్‌మన్‌ ఆధ్వర్యంలో సాగుతున్న ఈ యాత్రలో ఆర్సినోతోపాటు క్రిస్‌ సెంబ్రోస్కీ, సియాన్‌ ప్రాక్టర్‌లు పాలుపంచుకుంటున్నారు. వీరు మూడు రోజుల పాటు రోదసిలో ఉంటారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన