శీతాకాల సమావేశాల్లో ‘డేటా పరిరక్షణ’పై జేపీసీ నివేదిక

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:52 IST

శీతాకాల సమావేశాల్లో ‘డేటా పరిరక్షణ’పై జేపీసీ నివేదిక

ఈనాడు, దిల్లీ: డేటా పరిరక్షణ బిల్లుపై సంయుక్త పార్లమెంటరీ కమిటీ(జేపీసీ) తన నివేదికను రానున్న పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఈ మేరకు భాజపా ఎంపీ, కేంద్ర మాజీ మంత్రి పి.పి.చౌధరీ నేతృత్వంలోని కమిటీ.. తుది కసరత్తు చేస్తోంది. ఈ బిల్లు వివాదాస్పదం కావడంతో 2019లో జేపీసీకి నివేదించారు. గత వారం చౌధరీ అధ్యక్షతన కమిటీ సమావేశమైంది. మళ్లీ ఈ నెల 22న మరోసారి భేటీ కానుంది. ఎలాగైనా పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల్లో తుది నివేదికను సమర్పించాలని కమిటీ భావిస్తోంది. నవంబర్‌ మూడో వారంలో శీతాకాల సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయి. ‘‘డేటాను స్థానికంగానే భద్రపరచాలని, సరిహద్దులు దాటించకూడదని బిల్లులో చేసిన ప్రతిపాదనలను చాలా అంతర్జాతీయ టెక్నాలజీ సంస్థలు వ్యతిరేకించాయి. ప్రపంచంలో చాలా దేశాల్లానే భారత్‌ కూడా తన పౌరుల డేటా సురక్షితంగా ఉండాలని భావిస్తోంది. జాతీయ భద్రతా అవసరాల రీత్యా ప్రభుత్వానికి కూడా పౌరుల డేటా అందుబాటులో ఉండాలి. పౌరుల గోప్యతా హక్కును కాపాడుతూనే దేశ భద్రతా ప్రయోజనాలకు కూడా ఈ బిల్లు ప్రాధాన్యత ఇస్తుంది’’ అని కమిటీలో ఓ సభ్యుడు తెలిపారు. అయితే ఈ ముసాయిదా బిల్లును విమర్శించేవారు.. డేటా పరిరక్షణపై ఏ చట్టమైనా పౌరుల గోప్యతా హక్కును రక్షించాలంటూ 2017లో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు కట్టుబడి ఉండాలంటున్నారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన