ఆకస్‌తో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు

ప్రధానాంశాలు

Published : 18/09/2021 04:54 IST

ఆకస్‌తో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు

విమర్శలు గుప్పించిన చైనా
ఏకపక్షంగా కొత్త కూటమిని ఏర్పాటుచేశారన్న ఫ్రాన్స్‌

వాషింగ్టన్‌, దిల్లీ: ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనాకు చెక్‌ పెట్టడమే లక్ష్యంగా అమెరికా, బ్రిటన్‌, ఆస్ట్రేలియా కలిసి కొత్తగా ‘ఆకస్‌’ కూటమిని ఏర్పాటుచేసుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. చైనా, ఫ్రాన్స్‌ ఈ త్రైపాక్షిక కూటమి అవతరణను వ్యతిరేకించగా.. ఐరోపా సమాఖ్య (ఈయూ) కూడా పెదవి విరిచింది. ఆకస్‌తో ప్రాంతీయ సుస్థిరతకు ముప్పు వాటిల్లుతుందని చైనా పేర్కొంది. అణు జలాంతర్గాముల తయారీకి ఆస్ట్రేలియా సిద్ధపడుతుండటాన్ని వ్యతిరేకించింది. అణు నిరాయుధీకరణ లక్ష్యానికి తాజా పరిణామం విఘాతం కలిగిస్తుందని అభిప్రాయపడింది. మరోవైపు- ‘ఆకస్‌’ ఏర్పాటు క్రూరమైన ఏకపక్ష నిర్ణయమని ఫ్రాన్స్‌ విమర్శించింది. తాజా పరిణామాన్ని తమకు వెన్నుపోటుగా వ్యాఖ్యానించింది. తమను సంప్రదించకుండానే ఈ త్రైపాక్షిక కూటమి ఏర్పాటుకావడంపై ఈయూ అభ్యంతరం వ్యక్తం చేసింది.

సమర్థించుకున్న అమెరికా, ఆస్ట్రేలియా

ఆకస్‌పై విమర్శలు వెల్లువెత్తుతుండటంతో అమెరికా స్పందించింది. కూటమి ఏర్పాటును సమర్థించుకుంది. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో శాంతి, సుస్థిరతలను పెంపొందించడమే లక్ష్యంగా దాన్ని రూపొందించినట్లు శ్వేతసౌధం ప్రెస్‌ సెక్రటరీ జెన్‌ సాకి చెప్పారు. ఆకస్‌పై చైనా విమర్శలను ఆస్ట్రేలియా ప్రధానమంత్రి స్కాట్‌ మారిసన్‌ తోసిపుచ్చారు. ఇండో-పసిఫిక్‌లో శాంతిస్థాపనకే తాము కృషిచేయనున్నట్లు తెలిపారు. మరోవైపు- భారత్‌లో ఆస్ట్రేలియా హైకమిషనర్‌గా ఉన్న బారీ ఒఫారెల్‌ కూడా ఈ వ్యవహారంపై స్పందించారు. ఇండో-పసిఫిక్‌లో శాంతిభద్రతలకు ముప్పుగా పరిణమిస్తున్నవాటిపై భారత్‌ సహా ఇతర దేశాలను కలుపుకొని పోరాడగల సామర్థ్యాలను సముపార్జించుకోవడంపై ఆకస్‌ దృష్టిపెడుతుందన్నారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన