ఆత్మహత్యకు పురిగొల్పినట్లు స్పష్టంగా తేలాలి

ప్రధానాంశాలు

Updated : 18/09/2021 05:38 IST

ఆత్మహత్యకు పురిగొల్పినట్లు స్పష్టంగా తేలాలి

అప్పుడే దోష నిర్ధరణ: సుప్రీం

దిల్లీ: ‘ఆత్మహత్యకు పురిగొల్పడం’పై సుప్రీంకోర్టు శుక్రవారం కీలక వ్యాఖ్యలు చేసింది. ఇలాంటి కేసుల్లో నిందితుల క్రియాశీలక పాత్ర లేనప్పుడు వారిని నిర్దిష్ట సెక్షన్ల కింద దోషులుగా తేల్చడం కుదరదని స్పష్టంచేసింది. ‘‘పురిగొల్పడం అనేది ఓ మానసిక ప్రక్రియ. అందులో ఓ పని చేసేలా ఓ వ్యక్తిని ప్రేరేపించడం లేదా ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తి ఆ పనిచేసేలా తోడ్పడటం ఉంటుంది’’ అని వ్యాఖ్యానించింది. మేరఠ్‌లో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన కేసులో.. ఎస్సీ/ఎస్టీ వేధింపుల నిరోధక చట్టం కింద ఓ మహిళపై జారీచేసిన నాన్‌ బెయిలబుల్‌ వారెంటును, ఆమెపై క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌ను ఈ సందర్భంగా సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఆత్మహత్యకు పురిగొల్పే విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తి క్రియాశీలక పాత్ర లేకుంటే.. ఆ వ్యక్తిని భారతీయ శిక్షాస్మృతిలోని సెక్షన్‌ 306 కింద దోషిగా తేల్చజాలరని జస్టిస్‌ ఆర్‌.సుభాష్‌ రెడ్డి, జస్టిస్‌ హృషికేశ్‌ రాయ్‌లతో కూడిన ధర్మాసనం పేర్కొంది. ‘‘ఈ సెక్షన్‌ కింద ఎవరిపైనైనా చర్యకు ఉపక్రమించాలంటే.. వారి ప్రత్యక్ష ప్రమేయం వల్లనే ఓ వ్యక్తి తనకు ఆత్మహత్య మినహా గత్యంతరం లేదని భావించి అఘాయిత్యానికి పాల్పడినట్లు తేలాలి’’ అని వ్యాఖ్యానించింది. ఓ వ్యక్తి ఆత్మహత్య కేసులో తనపై 306 సెక్షన్‌తో పాటు, ఎస్సీ ఎస్టీలపై వేధింపుల నిరోధక చట్టంలోని పలు సెక్షన్ల కింద చేపట్టిన క్రిమినల్‌ ప్రొసీడింగ్స్‌, నాన్‌బెయిల్‌బుల్‌ వారెంట్‌ను రద్దు చేయాలంటూ ఓ మహిళ గతంలో అలహాబాద్‌ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేయగా హైకోర్టు కొట్టివేసింది. దీన్ని సవాల్‌ చేస్తూ ఆమె సుప్రీంకోర్టును ఆశ్రయించారు. 2018 మే 11న మేరఠ్‌లో ఆమెపై ఓ కేసు నమోదైంది. తన సోదరుడిని ఇంటికి పిలిపించిన ఆమె కుటుంబం కులపరంగా దూషణలకు దిగి.. అతను ఆత్మహత్యకు పాల్పడేందుకు ప్రేరేపించిందంటూ ఓ వ్యక్తిచేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైంది. ఈ కేసులో ఫిర్యాదుదారు తనకు అనుకూలంగా చేసిన వ్యాఖ్యలు, చనిపోయిన వ్యక్తి గతంలో ఆమెతో ప్రేమలో ఉన్నట్లు సాక్షులు పేర్కొనడం తప్ప అతనితో ఆమె ఎలాంటి సంబంధం కొనసాగించినట్లు లేదా అతన్ని ఆత్మహత్యకు పురిగొల్పినట్లు ఆధారాలేమీ లేవని సుప్రీంకోర్టు పేర్కొంది.


తప్పుడు సమాచారమిస్తే.. ఉద్యోగం హక్కు కాదు 

సుప్రీంకోర్టు తీర్పు 

దిల్లీ: తప్పుడు సమాచారం ఇచ్చినా, క్రిమినల్‌ కేసుల విషయాన్ని దాచిపెట్టినా ఉద్యోగం పొందడాన్ని హక్కుగా పరిగణించలేరని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఆ ఉద్యోగి నేరంలో పాల్గొన్నాడా? దాని నుంచి విముక్తి పొందాడా? అన్నది సమస్య కాదని, నమ్మకానికి సంబంధించినదని న్యాయమూర్తులు జస్టిస్‌ ఎం.ఆర్‌.షా, జస్టిస్‌ ఎ.ఎస్‌.బోపన్నలతో కూడిన ధర్మాసనం వ్యాఖ్యానించింది. పెండింగ్‌ క్రిమినల్‌ కేసుల వివరాలు వెల్లడించలేదంటూ రాజస్థాన్‌ రాజ్య విద్యుత్‌ ప్రసారణ్‌ నిగమ్‌ ఓ ఉద్యోగిని తొలగించింది. దానిపై ఆయన హైకోర్టును ఆశ్రయించగా ఆ సంస్థ ఉత్తర్వును కొట్టివేసింది. దాంతో ఆ సంస్థ సుప్రీంకోర్టులో అప్పీలు చేసింది. హైకోర్టు ఆదేశాలను తిరస్కరిస్తూ ఉద్యోగంలో చేరేటప్పుడు తప్పుడు సమాచారం ఇవ్వడం సరికాదని తెలిపింది. ప్రాథమిక దశలోనే తప్పుడు సమాచారం ఇస్తే యజమానికి నమ్మకం లేకుండా పోతుందని, అందువల్ల భవిష్యత్తులో కొనసాగించాలని అనుకోరని పేర్కొంది. అలాంటి ఉద్యోగి తన ఉద్యోగం ఒక హక్కని భావించలేడని స్పష్టం చేసింది. ఆ వ్యక్తిని రెండేళ్లపాటు ప్రొబేషనర్‌గా తీసుకున్నారని, నిబంధనల ప్రకారం ఆయనను తొలగించడం తప్పేమీ కాదని తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన