‘ఈ-శ్రమ్‌’లో కోటి మంది అసంఘటిత కార్మికులు

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

‘ఈ-శ్రమ్‌’లో కోటి మంది అసంఘటిత కార్మికులు

ఏపీ నుంచి ఇప్పటివరకు 3 లక్షల మంది నమోదు

ఈనాడు, దిల్లీ : అసంఘటిత రంగ కార్మికుల కోసం కేంద్ర కార్మికశాఖ ఏర్పాటుచేసిన ఈ-శ్రమ్‌ పోర్టల్‌లో కోటి మందికిపైగా పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో ఆంధ్రప్రదేశ్‌ నుంచి 3,02,621 మంది ఉన్నారు. అత్యధిక పేర్లు నమోదు చేసుకున్న రాష్ట్రాల్లో ఏపీ పదో స్థానంలో ఉంది. 10 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల నుంచి 3 లక్షల మందికిపైగా పేర్లు నమోదు చేసుకోగా, 2 రాష్ట్రాల్లో లక్ష నుంచి 3 లక్షల మధ్య, 10 రాష్ట్రాల్లో 10,000-  లక్ష మధ్య, 15 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో 10 వేలలోపే పేర్లు నమోదు చేసుకున్నారు. ఈ విషయంలో తెలంగాణ 10 వేల నుంచి లక్ష మందిలోపు నమోదు చేసుకున్న రాష్ట్రాల జాబితాలో ఉంది. ఇప్పటి వరకు బిహార్‌, ఒడిశా, ఉత్తర్‌ప్రదేశ్‌, పశ్చిమబెంగాల్‌, మధ్యప్రదేశ్‌ కార్మికులే ఎక్కువగా పోర్టల్‌లో నమోదు చేసుకున్నారు. ఇందులో అత్యధికం వ్యవసాయ, నిర్మాణ రంగాలకు చెందిన కార్మికులే ఉన్నారు. కరోనా సమయంలో లాక్‌డౌన్‌ విధించడంతో పనులు లేక వలస కార్మికులు కాలినడకన సొంత ఊళ్లకు బయలుదేరడం చర్చనీయాంశమైన నేపథ్యంలో కార్మికుల వివరాలను ఒక కేంద్రీకృత వ్యవస్థ ద్వారా సేకరించేందుకు కేంద్ర కార్మికశాఖ ఆగస్టు 26 నుంచి ఈ పోర్టల్‌ను ప్రారంభించింది. పోర్టల్‌లో గత 24 రోజుల్లో 1.03 కోట్ల మంది పేర్లు నమోదు చేసుకున్నారు. ఇందులో 43% మంది మహిళలు, 57% మంది పురుషులు ఉన్నారు. 2019-20 ఆర్థిక సర్వే ప్రకారం దేశంలో 38 కోట్ల మంది అసంఘటిత కార్మికులు ఉన్నారని అంచనా. వారందర్నీ ఈ పోర్టల్‌లో నమోదయ్యేలా చూడాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకొంది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన