ప్రణాళికల్లేని పట్టణ విస్తరణ

ప్రధానాంశాలు

Published : 20/09/2021 05:00 IST

ప్రణాళికల్లేని పట్టణ విస్తరణ

తాజా నివేదికలో నీతి ఆయోగ్‌ ఆందోళన

ఈనాడు, దిల్లీ: దేశంలో దాదాపు సగం పట్టణాల విస్తరణ తీరుపై నీతి ఆయోగ్‌ పెదవి విరిచింది. అవి బృహత్‌ ప్రణాళికలను అనుసరించడం లేదని ఆందోళన వ్యక్తం చేసింది. ఫలితంగా పట్టణాల వృద్ధి, మౌలిక వసతుల కల్పన గురించి ముందస్తుగా అంచనా వేయలేని పరిస్థితి నెలకొందని పేర్కొంది. ‘దేశ పట్టణ ప్రణాళిక సామర్థ్యంలో సంస్కరణలు’ పేరుతో నీతి ఆయోగ్‌ ఉపాధ్యక్షుడు రాజీవ్‌ కుమార్‌, సీయీవో అమితాబ్‌ కాంత్‌, ప్రత్యేక కార్యదర్శి కె.రాజేశ్వరరావులు దిల్లీలో ఓ నివేదికను విడుదల చేశారు. నగరీకరణకు సంబంధించి ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎదురవుతున్న ఇబ్బందులు, వాటిని ఎదుర్కొనేందుకు అనుసరించాల్సిన విధానాల గురించి అందులో వివరించారు. ‘‘పట్టణీకరణకు బృహత్‌ ప్రణాళిక (మాస్టర్‌ ప్లాన్‌) అత్యంత ముఖ్యం. పట్టణాల పరిధిలోని భూ వినియోగం, విస్తరణను ఎప్పుడు ఎలా క్రమబద్ధీకరించాలో అది తెలియజేస్తుంది. కానీ మన దేశంలో సగం పట్టణాలు మాస్టర్‌ ప్లాన్లు లేకుండానే విస్తరిస్తున్నాయి. కొన్నిచోట్ల ప్రణాళికలున్నా.. వాటి అమలులో సవాళ్లు ఎదురవుతున్నాయి. కోర్టు కేసుల వల్ల జాప్యం జరుగుతోంది. ఆర్థిక ఇబ్బందుల నేపథ్యంలో కొన్నిచోట్ల ముక్కలుముక్కలుగా ప్రణాళికలు రూపొందించి అమలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా 7,933 పట్టణ నివాస ప్రాంతాలుండగా.. వాటిలో 65% ప్రాంతాలకు బృహత్‌ ప్రణాళికలు లేవు. ఫలితంగా విస్తరణ క్రమరహితంగా మారుతోంది’’ అని నీతి ఆయోగ్‌ తమ నివేదికలో పేర్కొంది.

స్థానిక ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి

‘‘స్థానిక ప్రభుత్వాలు ప్రణాళిక నిబంధనలు, బిల్డింగ్‌ బైలాస్‌ ద్వారా అభివృద్ధి కార్యక్రమాలను క్రమబద్ధీకరించాలి. చాలా నగరాల్లో అభివృద్ధి క్రమబద్ధీకరణ నిబంధనలను దశాబ్దాల క్రితం రూపొందించారు. వాటిని ఏకపక్షంగా నవీకరించిన ఉదంతాలున్నాయి. మోడల్‌ బిల్డింగ్‌ బైలాస్‌-2016ని అనుసరించి పలు రాష్ట్రాలు ఇటీవల తమ బైలాస్‌ను సవరించాయి. స్థానిక ప్రభుత్వాలు వీటిని యథాతథంగా కాకుండా.. స్థానిక అవసరాలు, ఆర్థిక పురోభివృద్ధికి దోహదం చేసేలా స్వీకరించాలి. పట్టణ భూమిని గరిష్ఠ స్థాయిలో ఉపయోగించుకొని, సుస్థిరమైన నగరాభివృద్ధికి పునాదులు వేసేలా చర్యలు తీసుకోవాలి’’ అని నీతి ఆయోగ్‌ పేర్కొంది. తదనుగుణంగా పలు సిఫార్సులు చేసింది.

75% పట్టణ జనాభా.. 10 రాష్ట్రాల్లో

ప్రస్తుతం దేశంలోని 75% పట్టణ జనాభా పది రాష్ట్రాల్లోనే ఉందని నీతి ఆయోగ్‌ తెలిపింది. ఆ పదింటిలో ఆంధ్రప్రదేశ్‌ కూడా ఒకటని ఉదహరించింది. రాష్ట్రంలో సెన్సస్‌ టౌన్ల సంఖ్య 2001-11 మధ్య 93 నుంచి 227కు పెరిగినట్లు తెలిపింది. దేశంలో మురికివాడల్లో నివసించే వారిలో 70% మంది ఆరు రాష్ట్రాల్లోనే ఉంటున్నారని పేర్కొంది. అందులో ఆంధ్రప్రదేశ్‌ వాటా 15% మేర ఉందని వెల్లడించింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన