పేగు క్యాన్సర్‌కు సరికొత్త మందు

ప్రధానాంశాలు

Updated : 21/09/2021 06:16 IST

పేగు క్యాన్సర్‌కు సరికొత్త మందు

వాషింగ్టన్‌: పేగు క్యాన్సర్లపై ఒక కొత్త ఔషధం సమర్థంగా పనిచేస్తున్నట్లు అమెరికా, బ్రిటన్‌ శాస్త్రవేత్తలు గుర్తించారు. ఈ వ్యాధి బారినపడినవారిలో కణితుల వృద్ధిని ఇది నెమ్మదింప చేస్తున్నట్లు తేల్చారు. బ్రిటన్‌లో చోటుచేసుకుంటున్న క్యాన్సర్‌ మరణాల్లో పేగు క్యాన్సర్‌ రెండో స్థానంలో ఉంది. ఈ ఒక్క దేశంలోనే ఏటా 42వేల మందిలో కొత్తగా ఈ వ్యాధి బయటపడుతోంది. ఈ నేపథ్యంలో అడావోసెర్టిబ్‌ ఔషధాన్ని శాస్త్రవేత్తలు తెరపైకి తెచ్చారు. వేగంగా వ్యాపించే ఒకరకం పేగు క్యాన్సర్‌ బారినపడ్డ 44 మందిపై దీన్ని ప్రయోగించారు. ఇలాంటివారికి శస్త్రచికిత్స చేసేందుకు అవకాశం లేదు. వీరికి అడావోసెర్టిబ్‌ను మాత్ర రూపంలో ఇచ్చారు. అది కణితి వృద్ధిని సరాసరిన 2 నెలల పాటు నెమ్మదింపచేసిందని తేల్చారు. ఈ ఔషధం వల్ల దుష్ప్రభావాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ముఖ్యంగా లెఫ్ట్‌ సైడెడ్‌/రెక్టల్‌ ట్యూమర్లు ఉన్న 31 మంది రోగులపై ఇది బాగా ప్రభావం చూపినట్లు గుర్తించారు. వీరు ఎక్కువకాలం జీవించారని శాస్త్రవేత్తలు తెలిపారు. వీరిలో ఆర్‌ఏఎస్‌, టీపీ53 అనే రెండు ఉత్పరివర్తనలు ఉన్నాయని చెప్పారు. అడావోసెర్టిబ్‌ ప్రభావం వీరిపై ఎక్కువగా కనిపించడానికి ఇవే కారణమై ఉండొచ్చని భావిస్తున్నారు. ఇతర రకాల పేగు క్యాన్సర్లపైనా ఇది పనిచేసే వీలుందని శాస్త్రవేత్తలు తెలిపారు.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
సినిమా
మరిన్ని

దేవతార్చన