తీవ్రస్థాయి కొవిడ్‌ రోగుల్లో మతిభ్రంశం

ప్రధానాంశాలు

Published : 23/09/2021 05:28 IST

తీవ్రస్థాయి కొవిడ్‌ రోగుల్లో మతిభ్రంశం

వాషింగ్టన్‌: తీవ్రస్థాయిలో కరోనా వైరస్‌ బారిన పడిన బాధితుల్లో మతిభ్రంశం సమస్యలు తలెత్తుతున్నట్లు అమెరికాలో నిర్వహించిన అధ్యయనం వెల్లడైంది. ఈ మేరకు కరోనా మహమ్మారి ప్రారంభంలో వైరస్‌ బారిన పడి ఆసుపత్రుల్లో చేరిన 150 మంది రోగుల్లో 73 మందికి వారి మానసిక స్థితిలో మార్పులు చోటుచేసుకున్నట్లు గుర్తించారు. ఈ బాధితుల్లో గందరగోళం, ఆందోళన, స్పష్టంగా ఆలోచించే సామర్థ్యాన్ని కోల్పోవడం వంటి లక్షణాలు కనిపించాయి. బీఎంజే ఓపెన్‌ జర్నల్‌లో ఈ అధ్యయనం వివరాలు ప్రచురితమయ్యాయి. మతిభ్రంశం బారిన పడిన రోగులు మరింతగా జబ్బు పడ్డారని, బీపీ, మధుమేహం వంటి జబ్బులతోపాటు కొవిడ్‌ సంబంధిత సమస్యలు వారిలో ఉత్పన్నమైనట్లు అధ్యయనకర్తలు గుర్తించారు. ఈ మేరకు గతేడాది మార్చి-ఏప్రిల్‌ నెలల మధ్య కొవిడ్‌ బారిన పడి ఐసీయూలో చికిత్స పొందిన బాధితుల వైద్య నివేదికలను పరిశోధకులు పరిశీలించారు. అనంతరం ఇళ్లకు వెళ్లిపోయిన వారితో టెలిఫోన్‌లో మాట్లాడారు. వీరిలో మతిభ్రంశానికి సంబంధించిన ఉమ్మడి లక్షణాలను గుర్తించేందుకు యత్నించారు. దీంతోపాటు బాధితుల్లో మెదడుకు ఆక్సిజన్‌ తక్కువగా చేరడం, రక్తం గడ్డకట్టడం, గుండెపోటు రావడం, ఇతర మానసిక సమస్యలకు సైతం దారితీస్తున్నట్లు గుర్తించారు. ఈ సందర్భంగా ముఖ్య అధ్యయనకర్త, మిషిగన్‌ విశ్వవిద్యాలయానికి చెందిన ఫిలిప్‌ విల్సీడెస్‌ మాట్లాడుతూ.. ‘‘కొవిడ్‌ అనేక ప్రతికూల ఫలితాలతో ముడిపడి ఉంది. అందువల్ల ఆసుపత్రుల్లో ఉండాల్సిన సమయం మరింతగా పెరుగుతోంది. కోలుకోవడం కష్టమవుతోంది’’ అని వెల్లడించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన