ఉడాయ్‌పై సైబర్‌ దాడి

ప్రధానాంశాలు

Updated : 23/09/2021 09:25 IST

ఉడాయ్‌పై సైబర్‌ దాడి

డేటాను తస్కరించిన చైనా హ్యాకర్లు

మధ్యప్రదేశ్‌ పోలీసు విభాగం, ఓ మీడియా సంస్థ నుంచీ సమాచార అపహరణ

బ్యాంకాక్‌: భారత ప్రభుత్వం, మీడియా వర్గాలను లక్ష్యంగా చేసుకొని చైనా సంస్థ ఒకటి హ్యాకింగ్‌కు తెగబడిందన్న వార్తలు తాజాగా కలకలం సృష్టిస్తున్నాయి. భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (ఉడాయ్‌), మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి హ్యాకర్లు సమాచార తస్కరణకు పాల్పడినట్లు తెలుస్తోంది. చైనా ప్రభుత్వ సహకారంతోనే ఈ తతంగం జరిగిందన్న అనుమానాలతో.. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరిగే సూచనలూ కనిపిస్తున్నాయి. అమెరికాకు చెందిన ‘రికార్డెడ్‌ ఫ్యూచర్‌’ అనే ప్రైవేటు సైబర్‌ భద్రత కంపెనీ పరిశోధక విభాగం- ‘ఇన్‌సిక్ట్‌ గ్రూప్‌’ బుధవారం ఈ మేరకు సంచలన వివరాలను బయటపెట్టింది. చైనాలో ప్రభుత్వరంగ సంస్థలకు మాత్రమే అందుబాటులో ఉండే ‘విన్టీ’ అనే మాల్‌వేర్‌ సహాయంతో తాజా హ్యాకింగ్‌ చోటుచేసుకుందని తెలిపింది. ఇన్‌సిక్ట్‌ గ్రూప్‌ తెలిపిన వివరాల ప్రకారం..

2020తో పోలిస్తే ఈ ఏడాది భారతీయ సంస్థలను లక్ష్యంగా చేసుకొని చైనీయుల హ్యాకింగ్‌ కార్యకలాపాలు భారీగా పెరిగాయి. దాదాపుగా అవన్నీ ప్రభుత్వ ప్రాయోజితమే. గత ఏడాదితో పోలిస్తే 2021లో (ఆగస్టు వరకే) భారత్‌ లక్ష్యంగా చైనా హ్యాకర్ల కార్యకలాపాలు 261% అధికంగా నమోదయ్యాయి. ప్రధానంగా ట్యాగ్‌-28 (సూచనప్రాయంగా పెట్టిన పేరు) అనే కంపెనీ ‘విన్టీ’ మాల్‌వేర్‌తో సైబర్‌ దాడులకు పాల్పడింది. ముంబయికి చెందిన ఓ ప్రైవేటు కంపెనీ నెట్‌వర్క్‌ నుంచి దాదాపు 500 మెగాబైట్ల డేటాను తస్కరించింది. ఆ డేటా ఏంటనేది స్పష్టంగా తెలియరాలేదు. అయితే అది భారత్‌-చైనా మధ్య ఉద్రిక్తతలకు సంబంధించిన సమాచారం కావొచ్చని అంచనాలున్నాయి. మధ్యప్రదేశ్‌ రాష్ట్ర పోలీసు విభాగం నుంచి కూడా 5 మెగాబైట్ల డేటాను ట్యాగ్‌-28 అపహరించింది. జాతీయ గుర్తింపు డేటాబేస్‌ను పర్యవేక్షించే ఉడాయ్‌పైనా ఈ ఏడాది జూన్‌, జులైల్లో హ్యాకింగ్‌కు పాల్పడింది. దాదాపు 10 మెగాబైట్ల డేటాను తస్కరించి.. 30 మెగాబైట్ల వరకు డేటాను అందులో అప్‌లోడ్‌ చేసింది. ప్రముఖులను గుర్తించి లక్ష్యంగా చేసుకునే ప్రయత్నాల్లో భాగంగా ఉడాయ్‌పై సైబర్‌ దాడి జరిపి ఉండొచ్చని విశ్లేషణలు వెలువడుతున్నాయి.
Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన