పేగుబంధానికి అభయం.. తల్లికి టీకాతో శిశువుకూ రక్షణ

ప్రధానాంశాలు

Published : 24/09/2021 05:16 IST

పేగుబంధానికి అభయం.. తల్లికి టీకాతో శిశువుకూ రక్షణ

వాషింగ్టన్‌: గర్భిణులు కొవిడ్‌-19 టీకాలు పొందితే వారి సంతానానికీ ప్రయోజనం ఉంటుందని తాజా అధ్యయనం తేల్చింది. యాంటీబాడీలు.. రక్తంలో ఉండే ఒక రకం ప్రొటీన్లు. అవి ఇన్‌ఫెక్షన్‌ నుంచి రక్షిస్తాయి. సరైన ప్రతిరక్షకాల ఉత్పత్తిని ప్రేరేపించే సత్తాపైనే కొవిడ్‌ టీకాల సమర్థత ఆధారపడి ఉంటుంది. గర్భిణులు వ్యాక్సిన్లు తీసుకున్నప్పుడు వారి గర్భంలోని శిశువులకూ ఈ యాంటీబాడీల రక్షణ విస్తరిస్తుందా అన్న ప్రశ్నలు ప్రస్తుతం ఉత్పన్నమవుతున్నాయి. దీన్ని తేల్చేందుకు న్యూయార్క్‌ విశ్వవిద్యాలయంలోని గ్రాస్‌మన్‌ స్కూల్‌ ఆఫ్‌ మెడిసిన్‌ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేశారు. 36 మంది నవజాత శిశువులను పరిశీలించారు. వీరి తల్లులు.. గర్భిణులుగా ఉన్నప్పుడు ఫైజర్‌ లేదా మోడెర్నా టీకాలు తీసుకున్నారు. ఈ చిన్నారులందరిలోనూ పుట్టుక సమయంలోనే రక్షణాత్మక యాంటీబాడీలు పూర్తిస్థాయిలో ఉన్నట్లు గుర్తించారు. ఇన్‌ఫెక్షన్‌ సోకినప్పుడు లేదా టీకాలు పొందినప్పుడు మాత్రమే ఈ ప్రతిరక్షకాలు విడుదలవుతుంటాయి. ఇవి ఉండటం వల్ల శిశువులకు కొన్ని నెలల పాటు కొవిడ్‌ నుంచి రక్షణ లభిస్తుందని స్పష్టమవుతోంది. ముఖ్యంగా.. గర్భం ధరించిన ఐదు నెలలు తర్వాత టీకా పొందిన మహిళల సంతానంలో అధిక స్థాయిలో యాంటీబాడీలు ఉన్నాయని పేర్కొన్నారు. కొవిడ్‌ వ్యాక్సిన్ల వల్ల.. గర్భిణిగా ఉన్నప్పుడు గానీ, కాన్పు సమయంలోగానీ ముప్పు పెరుగుతుందని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని ముఖ్య శాస్త్రవేత్త జెన్నిఫర్‌ లైటర్‌ చెప్పారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన