ఫాస్టర్‌గా ఉత్తర్వుల బట్వాడా

ప్రధానాంశాలు

Published : 24/09/2021 05:16 IST

ఫాస్టర్‌గా ఉత్తర్వుల బట్వాడా

అన్ని జైళ్లలో ఇంటర్నెట్‌ ఏర్పాటు చేయాలి : జస్టిస్‌ ఎన్‌.వి.రమణ ధర్మాసనం

ఈనాడు, దిల్లీ: సుప్రీంకోర్టు ఉత్తర్వులను తక్షణమే అందజేయడానికి రూపొందించిన ‘ఎలక్ట్రానిక్‌ దస్త్రాల సత్వర, సురక్షిత బట్వాడా’ (ఫాస్ట్‌ అండ్‌ సెక్యూర్‌ ట్రాన్స్‌మిషన్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ రికార్డ్స్‌-ఫాస్టర్‌) విధానం అమల్లోకి తేవాలని గురువారం సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. దీని ద్వారా బెయిల్‌ ఉత్తర్వులు పొందిన ఖైదీలు సకాలంలో విడుదల కావడం సాధ్యమవుతుంది. మధ్యంతర ఉత్తర్వులు, స్టే ఆర్డర్లు, బెయిల్‌ ఉత్తర్వులు, తదితరాలన్నీ ఎలక్ట్రానిక్‌ ధ్రువీకరణ (ఈ- అథెంటికేటెడ్‌) పత్రాల ద్వారా అందుతాయని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్‌.వి.రమణ, జస్టిస్‌ ఎల్‌.నాగేశ్వరరావు, జస్టిస్‌ సూర్యకాంత్‌లతో కూడిన ధర్మాసనం తన ఆదేశాల్లో తెలిపింది. ఇందుకోసం అన్ని జైళ్లలోనూ ఇంటర్నెట్‌ సౌకర్యం ఏర్పాటుచేసేలా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు తక్షణం చర్యలు తీసుకోవాలని పేర్కొంది. ఆ వ్యవస్థ అందుబాటులోకి వచ్చేంతవరకూ ఈ కొత్త ఫాస్టర్‌ వ్యవస్థను రాష్ట్ర ప్రభుత్వాలు నోడల్‌ ఆఫీసర్‌ ద్వారా అమలు చేయాలని ఆదేశించింది. జైలు నిబంధనల్లోనూ అవసరమైన మార్పులు చేయాలని సూచించింది. ఫాస్టర్‌ సిస్టం ద్వారా సుప్రీంకోర్టు జారీచేసే ఎలక్ట్రానిక్‌ ధ్రువీకరణ ఆదేశాలను (ఈ-అథెంటికేటెడ్‌) పరిగణలోకి తీసుకొనేలా నిబంధనలను సవరించాలని స్పష్టంచేసింది. ఈ ఉత్తర్వులకు ఇక నుంచి అందరూ కట్టుబడి ఉండాలని పేర్కొంది.

సుప్రీంకోర్టు బెయిల్‌ ఇచ్చినా ఉత్తర్వులు సకాలంలో అందలేదన్న కారణంతో నిందితులను విడుదల చేయకపోవడాన్ని జస్టిస్‌ రమణ పరిగణనలోకి తీసుకున్నారు. ఆయన ఆధ్వర్యంలోని ధర్మాసనం దీనిపై సుమోటోగా జులై 16న విచారణ జరిపింది. ఉత్తర్వులు పంపించడానికి ‘సురక్షిత, విశ్వసనీయ, ప్రామాణిక మార్గా’న్ని రూపొందించాలని సుప్రీంకోర్టు సెక్రటరీ జనరల్‌ను ఆదేశించింది. ఈ విషయంలో కోర్టు సహాయకునిగా వ్యవహరించే సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే, సొలిసిటర్‌ జనరల్‌ తుషార్‌ మెహతాల సలహాలు తీసుకోవాలని సూచించింది. ఈ నివేదిక కోర్టుకు అందడంతో గురువారం ధర్మాసనం దాన్ని పరిశీలించింది. దీనిపై దవే మాట్లాడుతూ ‘‘‘ఫాస్టర్‌’ కారణంగా రాజ్యాంగంలోని 21వ అధికరణం (జీవించే హక్కు) మరింత సమర్థంగా అమలవుతుంది. ఇందుకు జాతి మీకు (సీజేఐ జస్టిస్‌ రమణకు) కృతజ్ఞతతో ఉంటుంది’’ అని చెప్పారు. ఇందుకు జస్టిస్‌ రమణ స్పందిస్తూ ‘‘థ్యాంక్యూ! జాతి కృతజ్ఞత చూపాల్సింది వ్యవస్థకే తప్ప ఏ వ్యక్తికో కాదు’’ అని వ్యాఖ్యానించారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన