యూపీలో ఐఏఎస్‌ అధికారిపై మతమార్పిడి ఆరోపణ

ప్రధానాంశాలు

Published : 29/09/2021 04:59 IST

యూపీలో ఐఏఎస్‌ అధికారిపై మతమార్పిడి ఆరోపణ

విచారణకు సిట్‌ నియామకం

కాన్పుర్‌: ఉత్తర్‌ప్రదేశ్‌లోని సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి, యూపీఎస్‌ ఆర్టీసీ ఛైర్మన్‌ మహమ్మద్‌ ఇఫ్తిఖారుద్దీన్‌పై మతమార్పిడులను ప్రోత్సహిస్తున్న ఆరోపణలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశాలు జారీ చేసింది. వారం రోజుల్లోపు నివేదిక ఇవ్వాలని మంగళవారం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని కోరింది. ఇఫ్తిఖారుద్దీన్‌ సమక్షంలో.. ఆయన ఇంట్లోనే జరిగిన ఓ సమావేశంలో మతమార్పిడుల గురించి చర్చించినట్టు ఉన్న వీడియో వైరల్‌ అవుతోంది. 2014-17 మధ్యకాలంలో ఆయన కాన్పుర్‌ డివిజనల్‌ కమిషనర్‌గా ఉన్న రోజుల్లో అధికారిక నివాసంలో ఈ వీడియో చిత్రీకరణ జరిగినట్టు చెబుతున్నారు. మతాధికారుల్లా కనిపిస్తున్న కొంతమంది ‘ప్రతి గడపకూ ఇస్లాం విస్తరించేలా చూడటం మన విధి’ అంటూ మాట్లాడుతున్నట్లు ఆ వీడియోలో ఉంది. 1985 బ్యాచ్‌కు చెందిన ఈ అధికారి ఓవైపు కూర్చొని ఉండగా.. మరో వ్యక్తి ఇస్లాంకు అనుకూలంగా మత మార్పిడుల గురించి రెచ్చగొట్టే ధోరణిలో ప్రసంగం చేశారు. విధి నిర్వహణ దృష్ట్యా ప్రస్తుతం రాష్ట్ర రాజధాని లఖ్‌నవూలో ఉంటున్న ఇఫ్తిఖారుద్దీన్‌ ఓ టీవీ ఛానల్‌ ముఖాముఖి కార్యక్రమంలో తాను ఆ సమావేశంలో లేనంటూ తొలుత ఖండించారు. తర్వాత అంగీకరిస్తూ.. ‘నేను చేసిన తప్పేంటి? నన్ను అపార్థం చేసుకున్నారు’ అని వివరణ ఇచ్చారు. మఠ్‌ మందిర్‌ సమన్వయ్‌ సమితి జాతీయ ఉపాధ్యక్షుడు భూపేశ్‌ అవస్థి ఫిర్యాదుతో ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. మరోవైపు.. వైరల్‌ అవుతున్న వీడియోల ప్రామాణికతపై కూడా దర్యాప్తు చేస్తున్నట్లు కాన్పుర్‌ పోలీస్‌ కమిషనర్‌ అసిం అరుణ్‌ తెలిపారు.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన