అక్టోబరు 1 నుంచి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు రద్దు

ప్రధానాంశాలు

Published : 29/09/2021 06:14 IST

అక్టోబరు 1 నుంచి ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డు రద్దు

 ఏడు సంస్థలకు ఆస్తులు, ఉద్యోగుల బదిలీ

 ఆదేశాలు జారీచేసిన రక్షణ శాఖ

దిల్లీ: సుదీర్ఘ చరిత్ర ఉన్న ‘ఆయుధ కర్మాగార మండలి’ ఇక తెరమరుగు కానుంది. అక్టోబరు 1 నుంచి ఈ సంస్థ రద్దవుతుంది. సంస్థకు చెందిన ఆస్తులు, ఉద్యోగులు, నిర్వహణను కొత్తగా ఏర్పాటుచేసిన ఏడు రక్షణ ప్రభుత్వ రంగ సంస్థ (డీపీఎస్‌యూ)లకు బదిలీ చేస్తూ, రక్షణశాఖ మంగళవారం ఆదేశాలు జారీ చేసింది. 200 సంవత్సరాల చరిత్ర ఉన్న ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మండలి (ఓఎఫ్‌బీ)కి 41 చోట్ల మందుగుండు, ఆయుధ సామగ్రి ఉత్పత్తి యూనిట్లు ఉన్నాయి. ఇదే సంస్థకు చెందిన మరికొన్ని ఉత్పత్తిరహిత విభాగాలను కూడా గుర్తించారు. సంస్కరణల్లో భాగంగా వీటిని ప్రభుత్వ రంగంలోని ఏడు కార్పొరేట్‌ సంస్థలకు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్‌ గత జూన్‌ 16న ఆమోదం తెలిపింది. ఓఎఫ్‌బీలో పనిచేస్తున్న సుమారు 70 వేల మంది ఉద్యోగుల సర్వీసు నిబంధనల్లో మార్పులు ఉండవని... రక్షణ తయారీ రంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగానే కార్పొరేటీకరణ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ఇప్పటికే స్పష్టం చేశారు. డీపీఎస్‌యూల్లో చేరే ఓఎఫ్‌బీ ఉద్యోగుల సర్వీసు నిబంధనలు మునుపటి నిబంధనలకు ఏమాత్రం తీసిపోవని... ఈ విషయంలో మార్గదర్శనం చేసేందుకు రక్షణ ఉత్పత్తి విభాగం నేతృత్వాన ప్రత్యేక కమిటీని ఏర్పాటు చేస్తామని రక్షణశాఖ తన ఆదేశాల్లో పేర్కొంది. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ విశ్రాంత, ప్రస్తుత ఉద్యోగుల పింఛన్లను తమ శాఖకు కేటాయించే బడ్జెట్‌ నుంచే ప్రభుత్వం చెల్లిస్తుందని తెలిపింది. ‘‘2004, జనవరి 1 తర్వాత ఓఎఫ్‌బీలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉద్దేశించిన జాతీయ పింఛను పథకం వర్తిస్తుంది. కొత్త సంస్థలు కూడా ఇదే పథకాన్ని అమలుచేసే అవకాశముంది’’ అని రక్షణశాఖ తెలిపింది.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన